పరిషత్‌ పోరు.. ప్రశాంతం

ABN , First Publish Date - 2021-04-09T04:41:47+05:30 IST

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు గురువారం ఎటువంటి సందడి లేకుండా.. ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో 37 జడ్పీటీసీ, 590 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఎన్నడూ లేనివిధంగా ఈసారి పోలింగ్‌ అంతటా మందకొడిగా సాగింది. 58.37 శాతం మాత్రమే నమోదైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమై.. సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభం నుంచీ ఓట్ల నమోదు మందకొడిగా సాగింది.

పరిషత్‌ పోరు.. ప్రశాంతం
రాపాకలో బారులుదీరిన ఓటర్లు

మందకొడిగా పోలింగ్‌

ఓటు హక్కు వినియోగించుకున్నది 58.37 శాత మే

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు గురువారం ఎటువంటి సందడి లేకుండా.. ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో 37 జడ్పీటీసీ, 590 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఎన్నడూ లేనివిధంగా ఈసారి పోలింగ్‌ అంతటా మందకొడిగా సాగింది. 58.37 శాతం మాత్రమే నమోదైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమై.. సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభం నుంచీ ఓట్ల నమోదు  మందకొడిగా సాగింది. ఉదయం 9 గంటలకు కేవలం 8.99 శాతం మాత్రమే నమోదైంది. 11 గంటలకు 19.32 శాతం, మధ్యాహ్నం 1 గంటకు 36.62శాతం, 3 గంటలకు 46.46 శాతం ఓటింగ్‌ సాగింది. సాయంత్రం 5 గంటలకు 58.37 శాతంతో పోలింగ్‌ ప్రక్రియ పూర్తయింది. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ పరిషత్‌ ఎన్నికలను బహిష్కరించిన విషయం తెలిసిందే. దీంతో కొంతమంది టీడీపీ అభ్యర్థులు బరిలో కొనసాగినా.. పోలింగ్‌ కేంద్రాలకు సమీపంలో ఎటువంటి శిబిరాలు ఏర్పాటు చేయలేదు. టీడీపీ అభ్యర్థులు పెద్దగా బరిలో లేకపోవడంతో తమకు ఇక పోటీ లేదంటూ.. వైసీపీ అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఓటర్లంతా పంచాయతీ ఎన్నికల హడావుడి గురించే చర్చించుకున్నారు. ఆ ఎన్నికలతో పోల్చితే పరిషత్‌ పోరు సాదాసీదాగా సాగిందని పేర్కొంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలకు తీసుకువచ్చి ఆటోలు, ప్రత్యేక వాహనాల్లో తరలించారు. ఓటర్లకు మార్గమధ్యలో నీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. పరిషత్‌ ఎన్నికల్లో ఇటువంటి ఏర్పాట్లు ఏవీ లేవు. పోలింగ్‌ కేంద్రాలకు కొద్దిదూరంలో పార్టీల వారీగా శిబిరాలు కూడా ఏర్పాటు చేయలేదు. దివ్యాంగులు, వృద్ధుల కోసం నేతలు ప్రత్యేక చర్యలు చేపట్టలేదు. కేవలం అధికారులు చేపట్టిన ఏర్పాట్లనే ఓటర్లు వినియోగించుకున్నారు. 


 7,84,375 మంది.. ఓటుకు దూరం!


జిల్లాలో మొత్తం ఓటర్లు 19,01,851 మంది. పరిషత్‌ ఎన్నికల్లో  11,17,476 మంది మాత్రమే ఓటుహక్కు వినియోగించుకున్నారు. 7,84,375 మంది ఓటు హక్కు వినియోగించుకోకపోవడం గమనార్హం, జిల్లాలో 58.37 శాతం మాత్రమే పోలింగ్‌ నమోదైంది. శ్రీకాకుళం మండలంలో అత్యధికంగా 71.62 శాతం పోలింగ్‌ జరగ్గా.. తర్వాతి స్థానంలో ఎచ్చెర్ల మండలం నిలిచింది. పాతపట్నం మండలంలో అత్యల్పంగా 42.54 శాతం మాత్రమే పోలింగ్‌ నమోదైంది. పాతపట్నం, భామిని, కొత్తూరు, వంగర మండలాల్లో 50 శాతం మంది కూడా ఓటు వేయలేదు. టీడీపీ బరిలో లేకపోవడమే ఈ సారి జిల్లాలో పోలింగ్‌ శాతం తగ్గడానికి ప్రధాన కారణమనే వాదన వినిపిస్తోంది. 


 ఓటుహక్కు వినియోగించుకున్న ప్రముఖులు...


పోలాకి మండలం మబుగాంలో ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ కుటుంబ సమేతంగా ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఆమదాలవలస మండలం తొగరాంలో స్పీకర్‌  తమ్మినేని సీతారాం దంపతులు ఓటు వేశారు.  వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడలో పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, టెక్కలిలోని వంశధారకాలనీలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు, రణస్థలం మండలం పాతర్లపల్లిలో ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌, ఇచ్ఛాపురంలో మార్కెటింగ్‌ సొసైటీ అధ్యక్షులు పిరియా సాయిరాజ్‌, వీరఘట్టం మండలం వండవలో ఎమ్మెల్యే కళావతి, రాజాం మండలం సారధిలో ఎమ్మెల్యే కంబాల జోగులు, పాతపట్నంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఓటుహక్కు వినియోగించుకున్నారు. 


పారదర్శకంగా ఎన్నికలు:కలెక్టర్‌ నివాస్‌


జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా... పారదర్శకంగా నిర్వహించామని కలెక్టర్‌ నివాస్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ సరళిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, అన్ని చోట్ల పోలింగ్‌ సజావుగా సాగిందని, ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని స్పష్టం చేశారు.  సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌, మిగిలిన పోలింగ్‌ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్ల నియామకం, ప్రత్యేక అధికారుల స్వీయ పర్యవేక్షణ వంటి ఏర్పాట్లతో ఇది సాధ్యమైందని చెప్పారు. అనంతరం ఎచ్చెర్ల మండలం ఎస్‌ఎంపురం, బడేవానిపేట, బుడగట్లపాలెం, తదితర పోలింగ్‌ కేంద్రాలను ఎస్పీ అమిత్‌బర్దర్‌తో కలసి కలెక్టర్‌ పరిశీలించారు. టెక్కలి మండలం కొనుసుల కొత్తూరు, కోటబొమ్మాళి, నిమ్మాడ, పలాస మండలం పెదంచల, చినంచల, గోదావరిపురం, గంగువా పోలింగ్‌ కేంద్రాలను జాయింట్‌ కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, ఎన్నికల పరిశీలకుడు చక్రవర్తి వేర్వేరుగా పరిశీలించారు.  

  

 ఐదుగురిపై సస్పెన్షన్‌ వేటు

రణస్థలం/ఎచ్చెర్ల, ఏప్రిల్‌ 8: ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఐదుగురి ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు పడింది.  రణస్థలం జిల్లా పరిషత్‌ పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రాన్ని ఎస్పీ అమిత్‌బర్దర్‌తో కలసి కలెక్టర్‌ పరిశీలించి ఓటర్లతో మాట్లాడారు. బ్యాలెట్‌ పత్రాల పంపిణీలో నిర్లక్ష్యం వహించిన జేఆర్‌పురం వీఆర్వోలు వెంకన్న, వాసుదేవరావు, పంచాయతీ సెక్రటరీ జీవన్‌, మహిళా పోలీసు నాగమణిని సస్పెన్షన్‌ చేశామని కలెక్టర్‌ కలెక్టర్‌ తెలిపారు. అలాగే, ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం పోలింగ్‌ కేంద్రాన్ని కూడా కలెక్టర్‌ పరిశీలించారు. అక్కడ ఎన్నికల్లో నిర్లక్ష్యం వహించిన పంచాయతీ కార్యదర్శి రషీదాబేగంను సస్పెండ్‌ చేశారు.

Updated Date - 2021-04-09T04:41:47+05:30 IST