వరి రైతు పరేషాన్‌

ABN , First Publish Date - 2020-11-21T04:20:38+05:30 IST

వరిని పండించిన రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వరి కోతకు అనేక అడ్డంకులు ఏర్పడుతున్నాయి.

వరి రైతు పరేషాన్‌
తాండూరులో నేలకొరుగుతున్న వరిపంట

  • కూలీలు, యంత్రాలు దొరక్క పాట్లు
  • ఇబ్బందులు పడుతున్న అన్నదాతలు
  • పొలాల్లోనే బంగారంలా మెరుస్తున్న వరిపంట


తాండూరు రూరల్‌ : వరిని పండించిన రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వరి కోతకు అనేక అడ్డంకులు ఏర్పడుతున్నాయి. కూలీలు దొరకడం లేదు.. యంత్రాలు అందుబాటులో లేవు. దీంతో పొలంలోనే వరి నేలకొరిగిపోతుందని రైతులు దిగులు చెందుతున్నారు. 

ఈ ఏడాది వరిని అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. పంట కూడా బాగానే పండింది. దోమపోటు లేకపోవడంతో దిగుబడి బాగానే వచ్చింది. కానీ కూలీల కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. కనీసం యంత్రాలతోనైనా వరి పంటను కోద్దామనుకున్నా అవి కూడా సమయానికి దొరకడం లేదు. దీంతో కోతకు వచ్చిన పంట పొలాల్లోనే ఉండిపోయింది. మరికొన్ని రోజులైతే ధాన్యం పొలాల్లోనే రాలిపోయే పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. 

తాండూరు మండలంలో బెల్కటూర్‌, చింతామణిపట్నం, చెంగోల్‌, అల్లాపూర్‌, వీరారెడ్డిపల్లి, రాంపూర్‌తండా, చెనిగేష్‌పూర్‌, కోణాపూర్‌, ఎల్మకన్నె, అంతారం, గోనూరు గ్రామాలతోపాటు తాండూరు పట్టణ శివారులోని మల్‌రెడ్డిపల్లి పల్లె చెరువు, అంతారం తండాల్లో వరిపంటలు సాగు చేశారు. ప్రస్తుతం పత్తి పంట కూడా చేతికి రావడంతో కూలీలు పత్తిని తీయడానికి వెళుతున్నారు. అదేసమయంలో వరిపంట కోతకు రావడంతో కూలీలు అందుబాటులో లేక చేతికి వచ్చిన వరిపంట నేలవాలుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు మహిళా కూలీలకు రూ.300లు చెల్లించినా వరికోతకు రావడం లేదని, డిమాండ్‌ బాగా పెరిగిందని రైతులు వాపోయారు. గతంలో పరిసరాల్లో ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతాల నుంచి వరిని కోసే హార్వెస్టర్లు, ఇతర యంత్రాలు ఈ ప్రాంతానికి వచ్చేవి. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో యంత్రాలు  ఇక్కడకి రాలేదు. ఈ ప్రాంతంలో సరిపడినన్ని యంత్రాలు లేక వరికోతలు ఆలస్యమవుతున్నాయి. ఉన్న యంత్రాలను పొలాలకు తీసుకెళ్లి వరిపంటలు కోసేందుకు రైతులు రాత్రింబవళ్లు పడిగాపులు కాయాల్సి వస్తోంది. కనీసం కూలీలతో అయినా కోతలు కోయిద్దామంటే కూలీలు కూడా దొరక్కపోవడంతో పంట నేలపాలయ్యే ప్రమాదం ఉందని రైతులు పేర్కొంటున్నారు.


కూలీలు రావడం లేదు.. యంత్రాలు దొరకడం లేదు.. -  వెంకటేష్‌, రైతు, ఖాంజాపూర్‌


ఈ ఏడాది వరి పంట చేతికి వచ్చి కోద్దామనుకున్నా కూలీలు దొరకడం లేదు. కనీసం యంత్రాలతో అయినా వరి కోద్దామంటే అవి కూడా అందుబాటులో లేవు. అందుబాటులో ఉన్న యంత్రాలతో కోయిద్దామనుకున్నా గంటకు రూ.3వేలు అడుగుతున్నారు. ఒక ఎకరా వరి కోయడానికి గంటన్నర సమయం పడుతుంది. అయినప్పటికీ యంత్రాలు దొరక్కపోవడం, కూలీలు రాకపోవడంతో పంట చేతికి వస్తుందా? లేదా? అన్న ఆందోళనలో ఉన్నాం.




Updated Date - 2020-11-21T04:20:38+05:30 IST