Abn logo
Apr 12 2021 @ 15:14PM

ఈసీ అదేశాల మేరకే బలగాలు పనిచేస్తాయి: సీఆర్‌పీఎఫ్ డీజీ

న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్ అదేశాలకు అనుగుణంగానే పారామిలటరీ బలగాలు పనిచేస్తుంటాయని సీఆర్‌పీఎఫ్ డీజీ కుల్దీప్ సింగ్ సోమవారంనాడు వివరణ ఇచ్చారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర బలగాలు పనిచేస్తున్నాయంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపణల నేపథ్యంలో ఆయన తాజా వ్యాఖ్యలు చేశారు.

'రాజకీయ పార్టీలు ఏమి చెప్పాయనే దానిపై నేను వ్యాఖ్యానించను. పారామిలటరీ బలగాలు, ఆయా రాష్ట్ర ప్రజల బాధ్యత ఈసీదే. ఈసీ ఆదేశాలకు అనుగుణంగానే పారామిలటరీ బలగాలు పనిచేస్తాయని నేను నిశ్చయంగా చెప్పగలను' అని కుల్దీప్ అన్నారు. ఈనెల 10న నాలుగో విడత పోలింగ్ సమయంలో సీతల్‌కుచిలో బలగాల కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ప్రధాన కుట్రదారు అమిత్‌షానే అంటూ మమతా బెనర్జీ ఆరోపించారు. హోం మంత్రి రాజీనామా చేయాలన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామని బీజేపీకి తెలిసినందునే బెంగాల్‌లో హింసను ప్రేరేపిస్తోందని అన్నారు. కేంద్ర బలగాలను తాను నిందించలేనని, హోం మంత్రి ఆదేశాలకు అనుగుణంగానే వారు పనిచేస్తున్నారని అన్నారు. మమత ఆరోపణలను ప్రధాని మోదీ తిప్పికొట్టారు. ప్రజలకు రక్షణగా పోలింగ్ బూత్‌ల వద్ద పహారా కాస్తున్న కేంద్ర బలగాలపై నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. అమిత్‌షా స్పందిస్తూ, రాజీనామా చేయాల్సింది తాను కాదని, ప్రజలు చెబితే చేస్తానని, మే 2న మమతనే రాజీనామా చేయాల్సి ఉంటుందని పరోక్షంగా బీజేపీ విజయంపై ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement