Abn logo
Apr 18 2021 @ 00:23AM

కరోనాతో భయంభయం

జిల్లాలో కుప్పలు తెప్పలుగా కరోనా పాజిటివ్‌ కేసులు 

 పెరుగుతున్న మరణాల సంఖ్య

 జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఆక్సిజన్‌ సిలెండర్ల కొరత 

 అలాగే ర్యాపిడ్‌ కిట్‌ల కొరత కారణంగా నిలిచిపోయిన టెస్ట్‌లు 

పలు గ్రామాల్లో  స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌లు 

 సోమవారం నుంచి ఎన్‌టీఆర్‌ మినీ స్టేడియంలో కరోనా టెస్టులు 

నిర్మల్‌, ఏప్రిల్‌ 17 (ఆంరఽధజ్యోతి) : నిర్మల్‌ జిల్లాలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతుండడం భయకంపితులను చేస్తోంది. కరోనాతీవ్రతతో సారంగపూర్‌ మండలంలోని గోపాల్‌పేట్‌ గ్రామానికి చెందిన ఓ యువకుడు మరణించినట్లు గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు కరోనా కారణంగా ఈ ఒకే గ్రామంలోని ఐదుగురికి పైగా మృత్యువాత పడ్డట్లు వారు పేర్కొంటున్నారు. కరోనాతీవ్రతతో ప్రభుత్వాసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోతున్న రోగులంతా సర్కారు దవాఖానాకు క్యూ కడుతున్నారు. దీంతో జిల్లా కేంద్ర ఆసుపత్రిలో సిలెండర్‌ల కొరత మొదలైంది. ప్రతీరోజూ జిల్లా ఆసుపత్రికి 50కి పైగా ఆక్సిజన్‌ సిలెండర్‌లు అవసరం అవుతుండగా కొర త కారణంగా ప్రస్తుతం పది సిలెండర్‌లను మాత్రమే సరఫరా అవుతున్నాయి. దీంతో అవసరం ఉన్న వారందరికి ఆక్సిజన్‌ను అందించలేని పరిస్థితి నెలకొంటోంది. కరోనాటెస్టులు చేసుకుంటున్న వారిసంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతున్న కారణంగా ర్యాపిడ్‌కిట్‌ల కొరత తీవ్రమయ్యింది. ఈ ర్యాపిడ్‌కిట్‌ల కొరత కారణంగా శనివారం కరోనాపరీక్షలను నిలిపివేశారు. ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే ఆరుగురు సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్‌ రావడంతో జిల్లాఆసుపత్రిలో ఆందోళన మొదలైంది. కాగా ఇక్కడి జిల్లాకేంద్ర ఆసుపత్రిలో శ్వాసకోశ వ్యాధులకు సంబంధించిన స్పెషలిస్టు, ఫల్మానాలజిస్ట్‌ పోస్టుఖాళీగా ఉండడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న రోగులకు జనరల్‌ వైద్యులే చికత్స చేయాల్సి వస్తోంది. కుంటాల మండలం పెంచికల్‌పాడ్‌కు చెందిన ఓ మహిళ కరోనావ్యాధితో మరణించినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. అలాగే సోన్‌ మండలంలోని వెల్మల్‌ బొప్పారం గ్రామం లోని ఓ బ్యాంకులో పని చేసే మేనేజర్‌, కడ్తాల్‌ గ్రామానికి చెందిన ఆశ కార్యకర్తలు కరోనాతో మృతి చెందడం పరిస్థితి తీవ్రతను వెల్లడిస్తోంది. గత కరోనాకు భిన్నంగా ఈ సారి సెకండ్‌వేవ్‌ కారణంగా పాజిటివ్‌ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరిగిపోతుండడం వైద్య,ఆరోగ్యశాఖను బెంబేలేత్తిస్తోంది. ప్రతిరోజూ జిల్లాలోని 19 పీహెచ్‌సీలతో పాటు జిల్లా కేంద్ర ఆసుపత్రి, భైంసా, ఖానాపూర్‌లలోని ఏరియా ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఓ వైపు కరోనాపరీక్షలు చేసుకునేందుకు మరోవైపు కొవిడ్‌ టీకాలను తీసుకునేందుకు జనం పోటీ పడుతూ ఆసుపత్రులకు వస్తుండడంతో ఇవన్నీ కిటకిటలాడిపోతున్నాయి. వైద్యసిబ్బంది రాత్రింబవళ్ళు సేవలు అందిస్తూ తలమునకలవుతున్నారు. దీంతో ఈ సిబ్బందిలో కొంతమంది ఇప్పటికే కరోనాపాజిటివ్‌తో బాధపడుతున్నట్లు సమాచారం. 

ఫ ఆక్సిజన్‌ సిలెండర్‌ల కొరత

ఇదిలా ఉండగా జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఆక్సిజన్‌ సిలెండర్‌ల కొరత ఏర్పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతీరోజూ ఈ ఆసుపత్రిలో 50కి పైగా ఆక్సిజన్‌ సిలెండర్‌ల అవసరం ఏర్పడుతోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వీటి కొరతతో జిల్లా ఆసుపత్రికి కేవలం పది సిలెండర్‌లను మాత్రమే సరఫరా అవుతున్నాయంటున్నారు. దీని కారణంగా ఆక్సిజన్‌ అవసరమై ఆసుపత్రికి వస్తున్నవారికి పూర్తిస్థాయిలో సేవలను అందించలేకపోతున్నారు. సెకండ్‌వేవ్‌ కరోనా తీవ్రత ఊపిరితిత్తులపై ఎక్కువగా ప్రభావం చూపుతుండడమే కాకుండా పాజిటివ్‌ వస్తున్న చాలా మంది లో ఆక్సిజన్‌ లెవల్స్‌ వేగంగా పడిపోతున్నాయి. దీంతో రోగులకు ఆక్సిజన్‌ను అత్యవసరంగా అందించాల్సి వస్తోంది. అయితే ఆక్సిజన్‌ అవసరం అవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండగా మరోవైపు సిలెండర్ల కొరత వైద్యాధికారులను ఇబ్బందులకు గురి చేస్తోంది. 

ఫ  క్రమంగా పెరుగుతున్న మరణాలు

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులసంఖ్య వేగంగా విస్తరిస్తోంది. మొదట వందలోపు ఉన్న పాజిటివ్‌ కేసులు క్రమంగా నాలుగింతలకు చేరుకుంది. ప్రస్తుతం ప్రతీరోజూ జిల్లాలోని 19 పీహెచ్‌సీలు, జిల్లా కేంద్ర ఆసుపత్రి తో పాటు ఖానాపూర్‌, భైంసా ఏరియా ఆసుపత్రుల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజూ 500లకు తగ్గకుండా కేసులు నమోదు అవుతున్నాయంటే కరోనా ఉధృతి ఎంత తీ వ్రంగా ఉందో వెల్లడవుతోంది. అయితే గతానికి భిన్నంగా ఈ సారి మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరిగిపోతోంది. సారంగాపూర్‌ మండలం గోపాల్‌పేట్‌ గ్రామంలో ఇప్పటి వరకు ఐదుగురికి పైగా వ్యక్తులు కరోనాతో మరణించినట్లు చెబుతున్నారు. అలాగే వెల్మల్‌ బొప్పారం గ్రామంలోని ఓ ప్రైవేటు బ్యాంకులో మేనేజర్‌గా పని చేస్తున్న అధికారి మరణించినట్లు చెబుతున్నారు. బీరవెల్లి, చించోలి (బి), వడ్‌గాం, భైంసా, మాలేగాం, లోకేశ్వరం, కడెం, తదితర గ్రామాల్లో కూడా కరోనాతో పలువురు మరణించినట్లు సమాచారం. మరణాల సంఖ్య పెరిగిపోతున్న కారణంగా అందరిలో భయాందోళనలు తీవ్రమవుతున్నాయి. అయితే ఇటు కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్య విషయంలో వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు దాటవేత దోరణి అవలంభిస్తున్నారు. వాస్తవాలను బయట పెట్టకుండా తప్పుడు లెక్కలు చూపిస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి.

ఫ కరోనా టెస్టుల కిట్‌ల కొరత

కరోనా పరీక్షలు నిర్వహించే ర్యాపిడ్‌ యాంటీజేన్‌ కిట్‌లకు తీవ్ర కొరత ఏర్పడుతోంది. ఈ కొరత కారణంగా శనివారం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో కరోనా పరీక్షలను నిర్వహించలేదు. హైదరాబాద్‌ నుంచి కిట్‌లను రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. గత పది రోజుల నుంచి  జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలతో పాటు ప్రభుత్వాసుపత్రులలో జనం పెద్ద సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహించుకుంటున్న కారణంగా ఈ కిట్‌లకు కొరత ఏర్పడుతోందంటున్నారు.  రోజు రోజుకు పరీక్షలు చేసుకునే వారి సంఖ్య పెరిగిపోతుండడంతో కిట్‌ల అవసరం పెరిగిపోతోంది. అయితే డిమాండ్‌ మేరకు కిట్‌లు సరఫరాకాకపోతున్న కారణంగా ప్రభుత్వాసుపత్రుల్లో మధ్యాహ్నం వరకే పరీక్షలను నిర్వహిస్తున్నారు.

ఫ సోమవారం నుంచి ఎన్‌టీఆర్‌ మినీస్టేడియంలో కరోనా పరీక్షలు

కాగా స్థానిక జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఓ వైపు కరోనాపరీక్షలు నిర్వహిస్తుండడం అలాగే మరోవైపు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్న కారణం గా  గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రభుత్వాసుపత్రి పరిసరాల్లో ఇటు కరోనాపాజిటివ్‌ బాధితులు, అలాగే టీకాల వేసుకునేందు కు వచ్చేవారు సంచరిస్తుండడం వైరస్‌వ్యాప్తికి మరింత అవకాశం ఏర్పడుతుందని భావిస్తున్నారు. దీని కారణంగా సోమవారం నుంచి ఎన్‌టీఆర్‌ మినీ స్టేడియంలో కరోనాటెస్టులను నిర్వహించేందుకు వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు నిర్ణయించారు. దీంతో జిల్లాకేంద్ర ఆసుపత్రిలో కేవలం వ్యాక్సినేషన్‌ మాత్రమే నిర్వహించనున్నారు.  

ఆక్సిజన్‌ కొరత ఉన్న మాట వాస్తవమే..

ఈ విషయమై నిర్మల్‌ జిల్లా ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్‌ దేవేంధర్‌రెడ్డిని సంప్రదించగా ఆసుపత్రిలో ఆక్సిజన్‌ సిలెండర్‌ల కొరత ఉన్న మాట వాస్తవమేనన్నారు. ప్రతీరోజూ ఆసుపత్రికి 50 సిలెండర్‌లు అవసరం ఉండగా ప్రస్తుతం ప్రైవేటు ఏజెన్సీ కేవలం 10 సిలెండర్‌లను మాత్రమే సరఫరా చేస్తుందన్నారు. 

Advertisement
Advertisement