పండుగాడు... మహాడేంజర్‌

ABN , First Publish Date - 2020-06-03T09:44:13+05:30 IST

పటమట డొంక రోడ్డులో చర్చి వెనుక ఖాళీ..

పండుగాడు... మహాడేంజర్‌

గ్యాంగ్‌వార్‌కు ముందు టిక్‌టాక్‌లో వీడియోల అప్‌లోడ్‌

వంగవీటి, దండుపాళ్యం చిత్రాల్లోని డైలాగ్‌లతో టిక్‌టాక్‌


విజయవాడ(ఆంధ్రజ్యోతి): అపార్ట్‌మెంట్‌ సెటిల్‌మెంట్‌ విషయంలో సందీప్‌కుమార్‌ను చంపాలని మణికంఠ అలియాస్‌ పండు నిర్ణయించుకున్నాడా? ఆ విషయాన్ని అతడికి తెలియజేయడానికే టిక్‌టాక్‌ వీడియోలు చేశాడా? పండు చరిత్రను తవ్వుతుంటే కొత్తకొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. తాజాగా సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్న పండు టిక్‌టాక్‌ వీడియోలు సరిగ్గా గ్యాంగ్‌వార్‌కు ముందు రోజు చిత్రీకరించాడు. వంగవీటి, దండుపాళ్యం చిత్రాల్లోని డైలాగ్‌లతో ఇతడు చేసిన టిక్‌టాక్‌లు అతని ఆలోచనా ధోరణిని తేటతెల్లం చేస్తున్నాయి. 


పటమట డొంక రోడ్డులో చర్చి వెనుక ఖాళీ స్థలంలో సందీప్‌ కుమార్‌, పండు వర్గాలు పరస్పరం మారణాయుధాలతో దాడులు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసుల దర్యాప్తునకు పోలీసు కమిషనర్‌ సీహెచ్‌ ద్వారకాతిరుమలరావు ఆరు ప్రత్యేక బృందాలను నియమించారు. పోలీసులు పరారీలో ఉన్న వారికోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ప్రధాన నిందితుడు పండు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఉన్నాడు. పండు ఇప్పటి వరకు చక్కబెట్టిన వ్యవహారాలకు సంబంధించి పోలీసులకు కొత్తకొత్త విషయాలు తెలుస్తున్నాయి. తాజాగా సామాజిక మాధ్యమాల్లో పండు చేసిన టిక్‌టాక్‌ వీడియోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. సరిగ్గా గ్యాంగ్‌వార్‌కు ముందు రోజు ఈ వీడియోలను చిత్రీకరించాడు.


‘బెజవాడ మొత్తానికి మొగుడులా బతకడానికి పెద్దగా ఆలోచించాలి’ అని వంగవీటి చిత్రంలోని డైలాగ్‌తో ఒక టిక్‌టాక్‌ చేశాడు. తర్వాత ‘కత్తితో గొంతు కోస్తున్నప్పుడు స్‌.... అనే ఓ సౌండ్‌ వస్తది సామి. అది వినడానికి సమ్మగా ఉంటది’ అని దండుపాళ్యం చిత్రంలోని డైలాగ్‌తో మరో టిక్‌టాక్‌ చేశాడు. ఇది కాకుండా ‘నీకు గొంతు పైమాల ఇష్టం. వాటికి గొంతు కింద మాల ఇష్టం. నాకు గొంతే ఇష్టం. గొంతు కోశాక స్‌.......’ అంటూ బ్లేడ్‌ ముక్కను నోట్లో పెట్టుకుని నాలుకతో తిప్పుతూ ఇంకో టిక్‌టాక్‌ చేశాడు. రక్తపాతం విషయంలో పండు మైండ్‌సెట్‌ ఎలా ఉంటుందో ఈ వీడియోలను చూస్తే ఇట్టే తెలిసిపోతోంది.


వాటిలో మొదటి రెండు టిక్‌టాక్‌లను కొట్లాట జరగడానికి ముందురోజు అంటే శుక్రవారం అప్‌లోడ్‌ చేశాడు. పండు చిలిపి అని ఉన్న అకౌంట్‌ ద్వారా ఈ వీడియోలను అప్‌లోడ్‌ చేశాడు. వాస్తవానికి తోట సందీప్‌ కుమార్‌, పండు ఇద్దరూ మామ మామ అని పిలుచుకునే వారు. ఎప్పుడైతే అపార్ట్‌మెంట్‌ సెటిల్‌మెంట్‌ విషయంలో తేడాలు వచ్చాయో ఆ రోజు నుంచి కత్తులు దూసుకున్నారు. ఈ వీడియోలను బట్టి చూస్తుంటే సందీప్‌ను హత మార్చడానికి వేసుకున్న స్కెచ్‌లో భాగంగానే వాటిని అప్‌లోడ్‌ చేశాడని తెలుస్తోంది. తాను ఎంత కసితో ఉన్నానో సందీప్‌కు తెలియజేయడానికే ఈ టిక్‌టాక్‌లు చేశాడన్న అనుమానం కలుగుతోంది.


పోలీసు రికార్డుల ప్రకారం పండుపై మూడు కేసులు ఉన్నాయని సమాచారం. కళాశాల విద్యార్థులకు గంజాయిని రుచి చూపించి గ్యాంగ్‌లో తిప్పుకుంటున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. గ్యాంగ్‌వార్‌లో అతడి వెంట వెళ్లిన వారిలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. రామలింగేశ్వరనగర్‌, సనత్‌నగర్‌, కానూరు, డొంకరోడ్డు ప్రాంతాలకు చెందిన యువకులు ఇందులో ఉన్నారని తెలుస్తోంది. ఈ కేసులో ఒక్కసారిగా ఉచ్చు బిగిసిపోవడంతో ఆ విద్యార్థులు ఇళ్ల నుంచి అదృశ్యమయ్యారు.


పోలీసుల అదుపులో నాగబాబు?

నాగబాబు.. గ్యాంగ్‌వార్‌లో వినిపిస్తున్న పేర్లలో ఇదొకటి. చెరొక గ్యాంగ్‌ను నిర్వహిస్తున్న సందీప్‌కుమార్‌, పండులను ఈ వ్యక్తి బాగానే ఉపయోగించుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అతడు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. నాగబాబు ఒక బిల్డర్‌. నాగబాబు వాళ్లిద్దరిని ఏయే సెటిల్‌మెంట్లకు ఉపయోగించుకున్నాడో తెలియాల్సి ఉంది. పైగా పెనమలూరులోని అపార్ట్‌మెంట్‌ డీల్‌ విషయంలో సందీప్‌కు తెలియకుండా పండును, పండుకు తెలియకుండా సందీప్‌ను ఎందుకు దింపాడన్నది తెలియడం లేదు.


సందీప్‌పై ఉన్న 13 కేసులకు సంబంధించి పటమట పోలీస్‌స్టేషన్‌లో సస్పెక్ట్‌ షీట్‌ ఉంది. 2015వ సంవత్సరంలో న్యాయస్థానం నుంచి ఉత్తర్వులు తెచ్చుకుని ఆ షీట్‌ను రద్దు చేయించుకున్నాడు. షీట్‌ను రద్దు చేయించుకున్నా సందీప్‌ తీరు మాత్రం మారలేదు. పలు వివాదాలను సెటిల్‌ చేసి, వచ్చిన డబ్బులతో గ్యాంగ్‌ను నడిపేవాడని వినికిడి. ఇలా సెటిల్‌మెంట్లతో వచ్చిన డబ్బుతోనే పండు, సందీప్‌లు లాక్‌డౌన్‌ సమయంలో నిరుపేదలకు నిత్యావసరాలను సరఫరా చేశారు. ఆ వీడియోలను కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసుకున్నారు. 


ఇవి కూడా చదవండి

-----------------------------

పిన్న వయసులోనే పెద్ద చరిత్రలు


బెజవాడ ‘రియల్’ గ్యాంగ్‌వార్‌!

Updated Date - 2020-06-03T09:44:13+05:30 IST