కోలాహలం!

ABN , First Publish Date - 2021-07-30T06:52:28+05:30 IST

జిల్లాలోని ముఖ్యమైన రెండు నగర పాలక సంస్థల్లో రెండవ డిప్యూటీ మేయర్‌ పదవులు రెడ్డి సామాజికవర్గానికి ఖరారయ్యాయి.తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి తనయుడు అభినయరెడ్డికి అవకాశం దక్కినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారమవుతోంది.

కోలాహలం!
తిరుపతి కార్పొరేషన్‌ రెండవ డిప్యూటీ మేయర్‌ ఎన్నిక నిమిత్తం జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలిస్తున్న కమిషనర్‌ గిరీష

 నగర, పుర పాలక సంఘాల్లో  రెండో ఉపాధ్యక్ష పదవికి నేడు ఎన్నికలు

 అన్ని చోట్లా అభ్యర్థులపై దాదాపు స్పష్టత

 తిరుపతిలో అభినయ్‌... చిత్తూరులో రాజే్‌షరెడ్డి


 తిరుపతి, జూలై 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ముఖ్యమైన రెండు నగర పాలక సంస్థల్లో రెండవ డిప్యూటీ మేయర్‌ పదవులు రెడ్డి సామాజికవర్గానికి ఖరారయ్యాయి.తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి తనయుడు అభినయరెడ్డికి అవకాశం దక్కినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారమవుతోంది. నగరంలోని 4వ డివిజన్‌ నుంచీ కార్పొరేటర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన అభినయ్‌ నిజానికి మొదటి డిప్యూటీ మేయర్‌ పదవినే ఆశించారు. కాకపోతే అప్పట్లో ఎమ్మెల్యేల కుటుంబీకులకు అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధిష్ఠానం నిర్ణయించడంతో అవకాశం తప్పిపోయినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా రెండవ డిప్యూటీ మేయర్‌ పదవి అందుబాటులోకి రావడంతో అభినయ్‌కు అవకాశం ఇచ్చినట్టు తెలిసింది. ఆ మేరకు ఆయనకు అనుకూలంగా వైసీపీ కార్పొరేటర్లకు విప్‌ జారీ అయింది. ఎమ్మెల్యే కుమారుడు కావడంతో ఈ పదవి విషయంలో ఇతరులెవరూ ఆశించే పరిస్థితి లేకుండా పోయింది. చిత్తూరు నగర పాలక సంస్థ రెండవ డిప్యూటీ మేయర్‌ పదవికి 7వ డివిజన్‌ కార్పొరేటర్‌ రాజే్‌షకుమార్‌రెడ్డి పేరు ఖరారైంది. ఈ పదవిని పలువురు ఆశించినా చివరికి ఏకాభిప్రాయంతోనే రాజే్‌షకు అవకాశం దక్కనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.


మదనపల్లెలో జింకా... పలమనేరులో కిరణ్‌... పుంగనూరులో లలిత

మదనపల్లె మున్సిపల్‌ రెండవ వైస్‌ ఛైర్మన్‌ పదవికి 12వ డివిజన్‌ కౌన్సిలర్‌ జింకా వెంకటా చలపతిని ఎంపిక చేసినట్టు సమాచారం. ఈయన సతీమణి, 11వ డివిజన్‌ కౌన్సిలర్‌ జింకా రాధమ్మ ఛైర్‌పర్సన్‌ పదవిని ఆశించినా చివరికి దక్కని సంగతి తెలిసిందే. అప్పట్లో మనస్తాపానికి గురైన వీరిని సంతృప్తి పరిచేందుకు తాజాగా రెండవ వైస్‌ ఛైర్మన్‌ పదవి చలపతికి ఖరారు చేసినట్టు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఈ పదవితో సర్దుకోవాలని, రెండున్నరేళ్ళ తర్వాత ఛైర్‌పర్సన్‌ పదవిని రాధమ్మకే కట్టబెడతామంటూ రెండు రోజుల కిందట రాజంపేట ఎంపీ మిధున్‌రెడ్డి మాట ఇచ్చినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారమవుతోంది. పలమనేరులో 3వ వార్డు కౌన్సిలర్‌ కిరణ్‌కుమార్‌ను రెండవ వైస్‌ ఛైర్మన్‌ పదవికి ఎమ్మెల్యే ఎంపిక చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ ఆ పదవి కోసం పెద్దగా పోటీ కూడా లేదని సమాచారం. పుంగనూరు మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గం కావడంతో ఆయన నిర్ణయానికి తిరుగులేని పరిస్థితి. అక్కడ 6వ వార్డు కౌన్సిలర్‌గా వున్న లలిత పేరును మంత్రి ఖరారు చేసినట్టు చెబుతున్నారు.


నగరిలో వెంకటరత్నం... పుత్తూరులో జయప్రకాష్‌

నగరి నియోజకవర్గ వైసీపీలో ఒకటికి మించి వర్గాలున్నా నియోజకవర్గ స్థాయి పదవుల విషయంలో ఎమ్మెల్యే రోజా మాటే చెల్లుబాటవుతోంది. మున్సిపల్‌, మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల సందర్భంగా అది నిరూపితమైంది కూడా. అదే రీతిలో ఇపుడు నగరి, పుత్తూరు మున్సిపాలిటీల్లో రెండవ వైస్‌ ఛైర్మన్‌ పదవులకు కూడా ఆమె నిర్ణయం ప్రకారమే అభ్యర్థులు ఎంపికైనట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నగరిలో ఒకటో వార్డు కౌన్సిలర్‌ వెంకటరత్నం, పుత్తూరులో 16వ వార్డు కౌన్సిలర్‌ జయప్రకాష్‌ రెండవ వైస్‌ ఛైర్మన్లుగా ఎన్నిక కానున్నట్టు తెలిసింది.తిరుపతి మినహా రెండవ డిప్యూటీ మేయర్‌, రెండవ వైస్‌ ఛైర్మన్‌ పదవుల విషయంలో అవకాశాలు దక్కని ఆశావహులు ఎలా ప్రతిస్పందిస్తారో శుక్రవారం తేటతెల్లం కానుంది. 


Updated Date - 2021-07-30T06:52:28+05:30 IST