కరోనా వేళ.. హాంకాంగ్ జూలో అత్యంత అరుదైన దృశ్యం

ABN , First Publish Date - 2020-04-09T21:45:36+05:30 IST

హాంకాంగ్ జూలో అత్యంత అరుదైన దృశ్యం కనిపించింది. ఈ జంతు ప్రదర్శన శాలలోని పాండాలు పదేళ్ల

కరోనా వేళ.. హాంకాంగ్ జూలో అత్యంత అరుదైన దృశ్యం

న్యూఢిల్లీ: హాంకాంగ్ జూలో అత్యంత అరుదైన దృశ్యం కనిపించింది. ఈ జంతు ప్రదర్శన శాలలోని పాండాలు పదేళ్ల తర్వాత తొలిసారి జతకట్టాయి. కరోనా వైరస్ కారణంగా జూను తాత్కాలికంగా మూసివేసిన సమయంలో ఈ అరుదైన ఘటన చోటుచేసుకోవడం విశేషం. 14 ఏళ్ల వయసున్న యింగ్ యింగ్, లీలీలను 2010 నుంచి ఒక్కటి చేసేందుకు ప్రయత్నిస్తున్నా సఫలం కాలేదని జూ అధికారులు తెలిపారు. తొలిసారి వాటి మధ్య సహజ సంయోగ ప్రక్రియ జరగడం ఆనందంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. పాండాలు రెండూ 2007 నుంచి ఇక్కడే ఉంటున్నాయి. వాటిని ఒక్కటి చేసేందుకు జూ సిబ్బంది ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. బహుశా రోజువారీ సందర్శకుల కారణంగానే అవి విముఖత వ్యక్తం చేసి ఉంటాయని భావిస్తున్నారు.


ఇక వాటి మధ్య సహజ సంయోగ క్రియ జరిగే అవకాశం లేదని భావించిన చైనా శాస్త్రవేత్తలు లీ లీ నుంచి వీర్యాన్ని సేకరించి యింగ్ యింగ్‌కు కృత్రిమ గర్భధారణ చేశారు. అయితే, గర్భస్రావం జరగడంతో శాస్త్రవేత్తల కృషి ఫలించలేదు. 


కరోనా వైరస్ భయపెడుతున్న నేపథ్యంలో జనవరి 26న పార్క్‌ను మూసివేశారు. ప్రస్తుతం ఈ పాండాలు సగటు జీవిత కాలానికి సరిగ్గా మధ్యలో ఉన్నాయి. వీటికి లైంగిక పరిపక్వత వచ్చి దశాబ్దం దాటి పోయింది. ఎప్పుడూ కలిసి కనిపించని ఈ రెండు పాండాలు సోమవారం ఉదయం సన్నిహితంగా మెలగడంతో అధికారులు వాటిపై దృష్టిపెట్టారు. చివరికి సహజంగా వాటి మధ్య సంయోగ క్రియ ప్రారంభం కావడంతో అధికారుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. సహజ సంయోగ క్రియ వల్ల గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అధికారులు తెలిపారు.   

Updated Date - 2020-04-09T21:45:36+05:30 IST