నేడు ఏం జరగబోతోంది ?

ABN , First Publish Date - 2021-01-25T05:27:43+05:30 IST

‘సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాల కన్నా వంద రెట్లు ఎక్కువ సస్పెన్స్‌’.. ‘గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని చూడలేదు. అసలు ఏం జరగబోతోందో కూడా చెప్పడం కష్టంగా ఉంది’..

నేడు ఏం జరగబోతోంది ?

అందరిలోనూ ఒకటే ఉత్కంఠ !

పంచాయతీ ఎన్నికలు జరుగుతాయా.. లేదా?

జిల్లాలోని అన్ని వర్గాల్లో ఇదే చర్చ

నేడు నోటిఫికేషన్‌ ఇవ్వాల్సి ఉన్న కలెక్టర్‌

నామినేషన్లు వేసేందుకు పలువురు సన్నాహాలు

మరి స్వీకరిస్తారో.. లేదో ?


నెల్లూరు, జనవరి 24 (ఆంధ్రజ్యోతి) : ‘సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాల కన్నా వంద రెట్లు ఎక్కువ సస్పెన్స్‌’.. ‘గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని చూడలేదు. అసలు ఏం జరగబోతోందో కూడా చెప్పడం కష్టంగా ఉంది’.. ‘ఒకవేళ సుప్రీంకోర్టు ఎన్నికలకు పచ్చజెండా ఊపితే ప్రభుత్వం ఏం చేస్తుంది ? లేక సుప్రీంకోర్టు ఎన్నికలకు బ్రేక్‌ వేస్తే ఎన్నికల కమిషన్‌ ఏం చేస్తుంది ?’... ఇప్పుడు జిల్లాలో ఎవరి నోట విన్నా ఇవే మాటలు.. సామాన్యుల నుంచి మేధావుల వరకు సోమవారం ఏం జరగబోతోందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. సామాన్య, రాజకీయ, మేధావి, ఉద్యోగ వర్గాల్లో టెన్షన్‌.. టెన్షన్‌గా ఉంది. కోట్లమంది చూపు  సుప్రీంకోర్టు వైపు మళ్లిం ది. ఓ వైపు రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్‌ విడుదల చేసింది. జిల్లా ఎన్నికల అధికారులుగా ఉన్న కలెక్టర్లు సోమవారం ఉదయం పదిన్నర గంటలకు నోటిఫికేషన్‌ విడుదల చేయాల్సి ఉంది. ఆ వెంటనే మొదటి విడతగా ఎన్నికలు జరగనున్న నెల్లూరు డివి జన్‌లోని పంచాయతీల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొద లుకానుంది. అయితే సోమవారం అనుకున్న సమయానికి కలెక్టర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేస్తారా.. అన్నదే సస్పెన్స్‌గా మారింది. శనివారం ఎన్నికల కమిషన్‌ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరు కావాలని సూచించినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాం టి ఆదేశాలు రాకపోవడంతో కలెక్టర్‌ హాజరు కాలేదు. అందు లోనూ సుప్రీంకోర్టులో ప్రభుత్వం వేసిన పిటిషన్‌ సోమవారం విచారణకు రానుంది. ఈ పరిస్థితుల్లో కలెక్టర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చర్చనీయాంశమైంది. 


నామినేషన్లు స్వీకరిస్తారా.. లేదా?

సోమవారం మొదటి విడత ఎన్నికలకు సంబంధించి బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరుపేట, కొడవలూరు, కోవూరు, మనుబోలు, ముత్తుకూరు, నెల్లూరు రూరల్‌, పొదలకూరు, రాపూరు, టీపీ గూడూరు, వెంకటాచలం, విడవలూరు మండలాల్లో నోటిఫికేషన్లు విడుదల చేసి నామినేషన్లు స్వీకరణ మొదలు కావాలి. పలుచోట్ల కొన్ని పార్టీల సానుభూతిపరులతోపాటు పలువురు స్వతంత్రులు కూడా తొలిరోజు నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం అనుకున్న సమయానికి నామినేషన్లు స్వీకరణ మొదలు పెట్టాలి. కానీ ఇది జరుగుతుందా..? సోమవారం పంచాయతీ కార్యాలయాల్లో పరిస్థితి ఎలా ఉండబోతోందన్నది ఆసక్తిగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్‌ ఎన్నికల కమిషన్‌ వ్యవహారంలో అధికారు లు, ఉద్యోగుల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి... అన్న మాదిరిగా తయారైంది. ప్రస్తుతం అధికారులు, ఉద్యోగు లున్నది ఎన్నికల కమిషన్‌ పరిధిలో.. అయితే ఆదేశాలు రావాల్సింది రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి.. అక్కడి నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో జిల్లాలోని ఉన్నతాధికారుల తో సహా ఇళ్ల నుంచి బయటకువచ్చేందుకు వెనకడుగు వేస్తున్నారు. కనీసం ఫోన్లకు కూడా అందుబాటులో ఉండడం లేదు. సోమవారం ఎన్నికల కమిషన్‌ ఆదేశాల ప్రకారం ఉదయం పదిన్నర గంటల నుంచి నామినేషన్ల స్వీకరించాలా.. లేదా? అన్నదానిపై కూడా తర్జనభర్జన పడుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో అధికారుల్లో కూడా టెన్షన్‌ ఎక్కువవుతోంది. 


గతేడాదే ప్రక్రియ పూర్తి

కాగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గతేడాదే ప్రక్రియ అంతా పూర్తి చేశారు. నామినేషన్ల పేపర్లు, ఇతర సామగ్రి అంతా మండలాలకు చేరాయి. 2019 ఓటర్ల జాబితా కూడా సిద్ధంగా ఉంది. అప్పట్లో పంచాయతీలకు గ్రేడ్‌-1 రిటర్నింగ్‌ అధికారులను నియమించారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల ప్రకారం వీరంతా వారికి కేటాయించిన పంచాయతీ కార్యాలయాలకు సోమవారం చేరుకొని నామినేషన్లు స్వీకరించాల్సి ఉంది. ఇంతవరకు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో ఏం చేయాలన్నది వారికి కూడా తెలియడం లేదు. ఈ క్రమంలో సోమవారం క్షేత్రస్థాయి అధికారులు కార్యాలయాలకు వెళ్లాలా.. వద్దా ? అన్న అంశంపై కూడా మథనపడుతున్నారు. కాగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అన్ని ప్రక్రియలు ఇప్పటికే పూర్తి చేసి ఉన్నామని, కలెక్టర్‌ నుంచి ఆదేశాలు అందితే గంటలోపే నామినేషన్ల ప్రక్రియ మొదలు పెడతామని ఓ మండల స్థాయి అధికారి చెప్పడం గమనార్హం. ఇదిలా ఉంటే అంతర్గతంగా రాజకీయ వేడి పుంజుకుంది. పరిస్థితులు ఎటు మారినా, ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమయ్యేందుకు క్షేత్రస్థాయి నాయకులు సన్నాహాలు మొదలు పెట్టారు. మండల స్థాయి నాయకులు ముఖ్యుల ఇళ్లల్లో సమావేశమవుతూ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఈ సమావేశాల్లోని అంశాలను ఆయా ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులకు చేరవేస్తున్నారు.  

Updated Date - 2021-01-25T05:27:43+05:30 IST