ఓ కార్యదర్శి.. ఓ వైసీపీ నేత!

ABN , First Publish Date - 2022-07-20T05:15:37+05:30 IST

అనగనగనగా ఓ పంచాయతీ కార్యదర్శి.. ఓ వైసీపీ నేత. ఇద్దరూ ఒకే రోజు గ్రామ పంచాయతీ నిధులను తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. కార్యదర్శి రూ.13.75 లక్షలు, వైసీపీ నేత రూ.6.55 లక్షలు డ్రా చేసుకున్నారు. కొందరు వార్డు సభ్యులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై డీపీవో విచారణకు ఆదేశించారు. ఇందుకోసం ఓ ప్రత్యేక అధికారిని కూడా నియమించారు. నిధుల మళ్లింపుపై సమగ్ర దర్యాప్తు చేయాలని స్థానికులు కోరుతున్నారు. సంతబొమ్మాళి పంచాయతీ కార్యదర్శిగా ఎస్‌కేఎస్‌ ప్రసాద్‌ పనిచేస్తున్నారు. ఓటీఎస్‌ వసూళ్ల విషయంలో వలంటీర్లను విధుల నుంచి తొలగిస్తానని హెచ్చరించిన నేపథ్యంలో ఈయనపై ఉన్నతాధికారులు ససెన్షన్‌ వేటు వేశారు. అయితే ఈ నేపథ్యంలో ఆయన పంచాయతీ నిధులు భారీగా దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఏడాది సెప్టెంబరు 12న రూ.13.75 లక్షలు పంచాయతీ ఖాతా నుంచి తన సొంత ఖాతాకు నిధులు బదలాయించాడు. అంతటితో ఆగకుండా నిబంధనలకు విరుద్ధంగా ఒకేసారి నిధులు డ్రా చేసినట్టు తెలుస్తోంది. 15వ ఆర్థిక సంఘం నిధులు పారిశుధ్యానికి వాడకూడదన్న నిబంధన ఉన్నా.. పాటించలేదని తేటతెల్లమైంది. ప్రధానంగా కొవిడ్‌

ఓ కార్యదర్శి.. ఓ వైసీపీ నేత!

ఒకే రోజు రూ.13.75 లక్షలు పంచాయతీ కార్యదర్శి డ్రా

అదేరోజు వైసీపీ నాయకుడి ఖాతాలోకి రూ.6.55 లక్షలు

 నిధుల గోల్‌మాల్‌

వార్డు సభ్యుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన వైనం

సంతబొమ్మాళి, జూలై 19: అనగనగనగా ఓ పంచాయతీ కార్యదర్శి.. ఓ వైసీపీ నేత. ఇద్దరూ ఒకే రోజు గ్రామ పంచాయతీ నిధులను తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. కార్యదర్శి రూ.13.75 లక్షలు, వైసీపీ నేత రూ.6.55 లక్షలు డ్రా చేసుకున్నారు. కొందరు వార్డు సభ్యులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై డీపీవో విచారణకు ఆదేశించారు. ఇందుకోసం ఓ ప్రత్యేక అధికారిని కూడా నియమించారు. నిధుల మళ్లింపుపై సమగ్ర దర్యాప్తు చేయాలని స్థానికులు కోరుతున్నారు.  సంతబొమ్మాళి పంచాయతీ కార్యదర్శిగా ఎస్‌కేఎస్‌ ప్రసాద్‌ పనిచేస్తున్నారు. ఓటీఎస్‌ వసూళ్ల విషయంలో వలంటీర్లను విధుల నుంచి తొలగిస్తానని హెచ్చరించిన నేపథ్యంలో ఈయనపై ఉన్నతాధికారులు ససెన్షన్‌ వేటు వేశారు. అయితే ఈ నేపథ్యంలో ఆయన పంచాయతీ నిధులు భారీగా దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఏడాది సెప్టెంబరు 12న రూ.13.75 లక్షలు పంచాయతీ ఖాతా నుంచి తన సొంత ఖాతాకు నిధులు బదలాయించాడు. అంతటితో ఆగకుండా నిబంధనలకు విరుద్ధంగా ఒకేసారి నిధులు డ్రా చేసినట్టు తెలుస్తోంది. 15వ ఆర్థిక సంఘం నిధులు పారిశుధ్యానికి వాడకూడదన్న నిబంధన ఉన్నా.. పాటించలేదని తేటతెల్లమైంది. ప్రధానంగా కొవిడ్‌ సేవల రూపంలో భారీగా నిధులు పక్కదారి పట్టించినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి పంచాయతీ నిర్వహణ ఖర్చుల్లో నగదు చెల్లింపులుండవు. ఏజెన్సీలకు చెక్కుల రూపంలో అందిస్తారు. కానీ పంచాయతీ కార్యదర్శి మాత్రం నగదుగా మార్చి అందించడం చర్చనీయాంశమైంది. 

ఇలా చెల్లించాడు.. 

హైపోక్లోరైడ్‌కు రూ.59,000లు, జనరేటర్‌ అద్దె, చెత్త సేకరణ ట్రాక్టర్‌ డీజిల్‌కు రూ.6,40,000 ఖర్చు చేసినట్టు చూపారు. లక్ష్మీపురంలో ఏర్పాటుచేసిన కొవిడ్‌ రిలీఫ్‌ సెంటర్‌ పారిశుధ్య కార్మికుల ఖర్చు కింద రూ.లక్ష, ట్యాంకర్‌ ద్వారా నీటి సరఫరా, గదులు శుభ్రం చేసేందుకు రూ.40,800లు నిధులు చెల్లింపులు చేసినట్టు చూపారు. ట్రాక్టరు మరమ్మతులకు రూ.1,70,450, డీజిల్‌ ఖర్చుకు రూ.3.65,000 ఖర్చు అయినట్టు చూపి చెల్లింపులు చేశారు. టెక్కలి కనకమహాలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్‌లో బ్లీచింగ్‌ కొనుగోలు చేసినట్టు చూపి నగదు చెల్లించారు. అయితే పంచాయతీ అవసరాలకు వినియోగించే వస్తువుల కొనుగోలుకు సంబంధించి నేరుగా నగదు చెల్లింపులు చేసేందుకు వీల్లేదు. చెక్కు రూపంలో మాత్రమే చెల్లించాలి. అయితే అదే రోజు  సంతబొమ్మాళికి చెందిన వైసీపీ నాయకుడి ఖాతాలోకి మరో రూ.6,55,521 నగదు చెల్లింపులు చేసినట్టు తెలుస్తోంది. ఒకే రోజు ఏకంగా రూ.20 లక్షల వరకూ నిధులు బదలాయించినట్టు తెలుస్తోంది. అయితే ఇందులో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ పేరిట నిధులు దుర్వినియోగమైనట్టు ఆరోపణలు వినిపిస్తున్నారు. ఒకే పనికి సంబంధించి వేర్వేరు శాఖల నుంచి నిధులు విడుదలైనట్టు తెలియడం చర్చనీయాంశంగా మారుతోంది. రెండు రోజుల కిందట కలెక్టరేట్‌ స్పందనలో పంచాయతీ వార్డు సభ్యులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మండలస్థాయి ప్రజాప్రతినిధి భర్త తాను అంతా చూసుకుంటానని పంచాయతీ కార్యదర్శికి భరోసా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి నిజాలను నిగ్గు తేల్చాలని సంతబొమ్మాళి పంచాయతీ ప్రజలు కోరుతున్నారు. 

                               విచారణకు ఆదేశించాం. 

సంతబొమ్మాళి పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదులు వచ్చాయి. విచారణకు ఆదేశించాం. ప్రత్యేక అధికారిని నియమించాం. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.                                                                                                 

 -రవికుమార్‌, జిల్లా పంచాయతీ అధికారి, శ్రీకాకుళం



దుర్వినియోగం చేయలేదు

పంచాయతీలో నిధులు దుర్వినియోగం కాలేదు. థర్డ్‌ పార్టీకి కాకుండా నేరుగా డబ్బులు చెల్లించేందుకే నిధులను సొంత ఖాతాలోకి మార్చాము. ఇందులో ఎటువంటి దురుద్దేశం లేదు. 

-ఎస్‌కేఎస్‌ ప్రసాద్‌, పంచాయతీ కార్యదర్శి, 



Updated Date - 2022-07-20T05:15:37+05:30 IST