వీడిన ఉత్కంఠ

ABN , First Publish Date - 2021-01-26T07:00:58+05:30 IST

‘పంచాయతీ ఎన్నికలు జరుగుతాయా..? లేదా...?’ అన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. పంచాయతీ ఎన్నికలను రద్దు చేయాలని హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ మేరకే ఎన్నికలు నిర్వహించాలని అత్యున్నత న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువరించింది.

వీడిన ఉత్కంఠ

జిల్లాలో మొదటగా.. కదిరి రెవెన్యూ డివిజన్‌లో ఎన్నికలు

29 నుంచి 31 వరకు నామినేషన్ల స్వీకరణ

ఫిబ్రవరి 9న పోలింగ్‌.. ఓట్ల లెక్కింపు... ఫలితాల వెల్లడి

అధికార యంత్రాంగంలో కదలిక

సుప్రీం తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు 

అంటున్న ప్రతిపక్షాలు


అనంతపురం, జనవరి 25(ఆంధ్రజ్యోతి): ‘పంచాయతీ ఎన్నికలు జరుగుతాయా..? లేదా...?’ అన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. పంచాయతీ ఎన్నికలను రద్దు చేయాలని హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ మేరకే ఎన్నికలు నిర్వహించాలని అత్యున్నత న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువరించింది. దీంతో పల్లెపోరుకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. సుప్రీంకోర్టు తీర్పును ప్రతిపక్షాలు స్వాగతిస్తుండగా.. అధికార వైసీపీ సైతం వారి బాటలోనే సై అనక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయనటంలో సందేహం లేదు. ఆ పార్టీ పెద్దలు సైతం ఎన్నికలకు సిద్ధమనే సంకేతాలను పంపారు. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమే్‌షకుమార్‌ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేశారు. ఇదివరకూ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో తొలివిడత పంచాయతీ ఎన్నికలకు సోమవారం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రకటించారు. అధికారుల సహాయ నిరాకరణతో జిల్లాలో ఎక్కడా నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం చేపట్టలేదు. అధికారులు ఆ మేరకు ఏర్పాట్లు చేయలేదు. దీంతో ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ రీ షెడ్యూల్‌ను విడుదల చేసింది. తొలి విడతలో జరిగే ఎన్నికలు నాలుగో విడతలో ఉంటాయని ప్రకటించింది. ఆ మేరకు జిల్లాలో తొలివిడత ఎన్నికలు పెనుకొండ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని 13 మండలాల్లో జరగాల్సి ఉంది. అవి నాలుగో విడతలో నిర్వహించనున్నారు. దీనిని బట్టి చూస్తే.. షెడ్యూల్‌ మేరకు రెండో విడతలో జరగాల్సిన కదిరి రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని పంచాయతీలకు తొలివిడతలో నిర్వహించనున్నారు. ఆ తరువాత ధర్మవరం కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్లు, మూడో విడతలో అనంతపురం రెవెన్యూ డివిజన్‌, ఆఖరుగా నాలుగో విడతలో పెనుకొండ రెవెన్యూ డివిజన్‌లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.


కదిరి డివిజన్‌లోనే తొలి విడత

కదిరి రెవెన్యూ డివిజన్‌లోని ఆమడగూరు, బుక్కపట్నం, గాండ్లపెంట, కదిరి, కొత్తచెరువు, ఎన్‌పీ కుంట, నల్లచెరువు, నల్లమాడ, ఓబుళదేవర చెరువు, తలుపుల, పుట్టపర్తి, తనకల్లు మండలాల్లోని పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 29 నుంచి 31 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. ఫిబ్రవరి 1న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 2న వాటిపై అభ్యంతరాలను పరిశీలిస్తారు. 3న అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. 4న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశమిస్తారు. 9న ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకూ పోలింగ్‌ నిర్వహిస్తారు. ఆ తరువాత ఓట్లు లెక్కించి, విజేతను ప్రకటిస్తారు. అనంతరం ఉపసర్పంచ్‌ ఎన్నిక కూడా అదే రోజు సాగుతుంది. దీంతో జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికల పోరు ముగుస్తుంది.


రెండు, మూడు, నాలుగు విడతల షెడ్యూల్‌ ఇలా..

రెండో విడతలో ధర్మవరం రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని రాప్తాడు, బత్తలపల్లి, చెన్నేకొత్తపల్లి, ధర్మవరం, కనగానపల్లి, రామగిరి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లోని పంచాయతీలు, కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని బెలుగుప్ప, బొమ్మనహాళ్‌, బ్రహ్మసముద్రం, డి. హిరేహాళ్‌, గుమ్మఘట్ట, కళ్యాణదుర్గం, కంబదూరు, కణేకల్లు, కుందుర్పి, రాయదుర్గం, శెట్టూరు మండలాల్లోని పంచాయతీలకు ఎన్నికలుంటాయి. వీటికి ఫిబ్రవరి 2 నుంచి 4వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. 5న వాటిని పరిశీలిస్తారు. 6న అభ్యంతరాలను పరిశీలిస్తారు. 7న తుది నిర్ణయం ప్రకటిస్తారు. 8న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పిస్తారు. 13న పోలింగ్‌ ఉంటుంది. సాయంత్రం 4 గంటలకు ఓట్లు లెక్కించి, ఫలితాలు వెల్లడిస్తారు. మూడో విడతలో అనంతపురం రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని అనంతపురం, ఆత్మకూరు, బుక్కరాయసముద్రం, గార్లదిన్నె, గుత్తి, గుంతకల్లు, కూడేరు, నార్పల, పామిడి, పెద్దవడుగూరు, పుట్లూరు, శింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, వజ్రకరూరు, విడపనకల్లు, యాడికి, యల్లనూరు, పెద్దపప్పూరు మండలాల పరిధిలోని పంచాయతీలకు ఎన్నికలుంటాయి. ఇందుకు సంబంధించి ఫిబ్రవరి 6 నుంచి 8వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 9న వాటిని పరిశీలిస్తారు. 10న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తారు. 11న తుది నిర్ణయం ఉంటుంది. 12న ఉపసంహరణకు అవకాశమిస్తారు. 17న పోలింగ్‌ ఉంటుంది. అదేరోజు సాయంత్రం ఓట్ల లెక్కింపుతోపాటు విజేతలను ప్రకటిస్తారు. నాలుగో విడతలో పెనుకొండ రెవెన్యూ డివిజన్‌ పరిధి అగళి, అమరాపురం, చిలమత్తూరు, గోరంట్ల, గుడిబండ, హిందూపురం, లేపాక్షి, మడకశిర, పరిగి, పెనుకొండ, రొద్దం, రొళ్ల, సోమందేపల్లి మండలాల పరిధిలోని పంచాయతీలకు ఎన్నికలుంటాయి. వీటికి సంబంధించి ఫిబ్రవరి 10 నుంచి 12వ తేదీ వరకు  నామినేషన్లు స్వీకరిస్తారు. 13న పరిశీలన, 14న అభ్యంతరాల పరిశీలన, 15న తుది నిర్ణయం తీసుకుంటారు. 16న ఉపసంహరణకు అవకాశమిస్తారు. 21న పోలింగ్‌, అదేరోజు సాయంత్రం ఓట్లు లెక్కించి, విజేతలను ప్రకటిస్తారు. దీంతో జిల్లాలో పంచాయతీ ఎన్నికల సంగ్రామం ముగుస్తుంది.


యంత్రాంగంలో కదలిక

పంచాయతీ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగంలో కదలిక వ చ్చింది. ఎన్నికలు నిర్వహణ తప్పని పరిస్థితి కావటం తో సంబంధిత అధికారుల్లో హడావుడి మొదలైంది. జడ్పీ సీఈఓ, జిల్లా పంచాయతీ అధికారితోపాటు మరికొందరు అధికారులు ఓటరు జాబితాల తయారీ, ఎన్నికల సిబ్బంది నియామకం వంటి ప్రక్రియను వేగవంతం చేశారు. ఆ మే రకు నివేదికలు తయారు చేసి, జిల్లా కలెక్టర్‌కు అందజేసినట్లు ఆ వర్గాల ద్వారా అందిన సమాచారం. మంగళవారం గణతంత్ర వే డుకల నేపథ్యంలో బుధవారం నుంచి జిల్లా యం త్రాంగంలో పంచాయతీ ఎన్నికల హడావుడి మరింత పెరగనుందనడంలో సందేహం లేదు.



రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు చెంపపెట్టు

కాలవ శ్రీనివాసులు, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు

రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టు. రాజ్యాంగ ధర్మాలను విచ్ఛిన్నం చేయడానికి జగన్‌ సర్కారు ప్రయత్నిస్తోంది. నియంతృత్వ పోకడలతో జగన్‌ పాలన చేస్తున్నారు. ఉద్యోగ సంఘాల నాయకుల ముసుగులో కొందరిని అడ్డుపెట్టుకుని జగన్‌ ఆడించిన నాటకం సుప్రీం తీర్పుతో బట్టబయలైంది. ఎన్నికలు నిష్పాక్షికంగా జరగాలంటే కేంద్ర బలగాల ఆధ్వర్యంలో నిర్వహించాలి. ఎన్నికల్లో జగన్‌ సర్కారు దౌర్జన్యాలు, ఆకృత్యాలపై ప్రతిపక్షాలు చేసే ఫిర్యాదులపై ఎన్నికల కమిషన్‌ తక్షణం స్పందించి, చర్యలు తీసుకోవాలి. ఎన్నికల్లో పక్షపాతంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకోవడంతోనే సజావుగా సాగుతాయి. ఆ మేరకు ఎన్నికల కమిషన్‌ చొరవ చూపాలి.


జగన్‌ ఇప్పటికైనా కళ్లు తెరవాలి

బీకే పార్థసారఽథి, టీడీపీ హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు

హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ.. సుప్రీంకోర్టుకెళ్లినా.. ఎన్నికల కమిషన్‌ నిర్ణయానికి అనుగుణంగానే తీర్పు వెలువడటాన్ని ప్రజాస్వామ్యవాదులుగా స్వాగతిస్తున్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్‌ కళ్లు తెరవాలి. రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించకపోతే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం ఏర్పడే పరిస్థితులున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించకపోవటం జగన్‌ అహంకారానికి నిదర్శనం. సుప్రీం తీర్పు ఆయనకు చెంపపెట్టు. దీంతో సీఎంగా కొనసాగే అర్హత కోల్పోయారు. వెంటనే రాజీనామా చేయాలి.


ప్రభుత్వం బేషజాలకు పోవటం సరికాదు

బండ్లపల్లి ప్రతా్‌పరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు

పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం బేషజాలకు పోవటం సరికాదు. ముఖ్యమంత్రి ఈ విషయంలో నియంతృత్వ పోకడలకు పోయాడన్నది స్పష్టంగా కనిపిస్తోంది. సుప్రీం తీర్పుతోనైనా సీఎం రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించాలి. ఇప్పటికైనా జగన్‌లో మార్పు వస్తుందని అనుకుంటున్నా. సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం. ఎన్నికలను ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించాలి.


రాజ్యాంగ ధర్మాన్ని పాటించాలి

రాంభూపాల్‌, సీపీఎం జిల్లా ఉత్తర ప్రాంత కార్యదర్శి

అధికారంలో ఎవరున్నా.. రాజ్యాంగ ధర్మాన్ని పాటించాలి. ఎన్నికల కమిషన్‌కు సహకరించాలి. అలా కాదని జగన్‌ సర్కారు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. సుప్రీంకోర్టు సైతం ఎన్నికల కమిషన్‌ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే తీర్పు వెలువరించిందంటే ఆ వ్యవస్థను గౌరవించాలన్నది అర్థం. పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారం అందించాలి. నిష్పాక్షికంగా ఎన్నికలు సాగేలా చర్యలు తీసుకోవాలి.


ఎన్నికల బరి నుంచి వైసీపీ తప్పుకోవాలి

జగదీష్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి

మాటకు కట్టుబడే వారైతే పంచాయతీ ఎన్నికల పోటీ నుంచి వైసీపీ తప్పుకోవాలి. రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరించే వారికి సుప్రీం తీర్పు ఓ గుణపాఠం. ముఖ్యమంత్రి జగన్‌కు ఏ మాత్రం నైతిక విలువలున్నా వెంటనే పదవికి రాజీనామా చేయాలి. ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించని అధికారులు ఎంతటివారైనా వారిపై చర్యలు తీసుకోవాలి. రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా పాలకులు వ్యవహరించటం మంచిది కాదు. 


ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకించే హక్కు ఉద్యోగ సంఘాలకు లేదు

పెద్దనగౌడ్‌, పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు

ఎన్నికల కమిషన్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించే హక్కు ఉద్యోగ సంఘాలకు లేదు. సంఘాల నేతలు.. ఉద్యోగుల సమస్యలపై మాత్రమే పోరాటం చేయాలి. బొప్పరాజు వెంకటేశ్వరరావు, చంద్రశేఖర్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణ ఒకొక్కరు ఒక్కో సంఘాన్ని పెట్టుకుని, ప్రభుత్వాలకు అంటకాగుతున్నారు.  తమ పదవులను కాపాడుకునేందుకు ప్రభుత్వాలకు వత్తాసు పలుకుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పును ప్రతిఒక్కరూ ఆహ్వానించాల్సిందే. ఆ మేరకు ఎన్నికలు చేపట్టాల్సిందే.


తీర్పును అమలు చేయాల్సిందే:

గుడిసె దేవానంద్‌, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు

సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయాల్సిందే. ప్రభుత్వం ఇసుక, మద్యం, విద్యార్థుల ఫీజుల రద్దు, దేవాలయాల దాడులపై ప్రజల్లో నెలకొన్న అసమ్మతిని కప్పిపుచ్చుకునేందుకు ఎన్నికలను వ్యతిరేకిస్తోంది. దీనికి తోడు ప్రభుత్వానికి అండగా ఉద్యోగ సంఘాల నేతలను ఉసిగొల్పి, రాజ్యాంగంపై తిరుగుబాటుకు కారణమయ్యారు. ఇది ముమ్మాటికీ క్షమించరాని నేరం. ఇప్పటికైనా ఉద్యోగ సంఘాల నేతలకు, వైసీపీ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. ఎన్నికల సంఘం నిర్ణయం సరైనదే. కమిషనర్‌ నిమ్మగడ్డ రమే్‌షకుమార్‌ను ఎస్‌ఈసీగా కాకుండా సీఎం జగన్మోహన్‌రెడ్డి వ్యక్తిగతంగా పరిగణించారు. దీంతో హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పు ఆయనకు చెంపుపెట్టు. ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకారం సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే.


సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం

టీసీ వరుణ్‌, జనసేన నాయకుడు

పంచాయతీ ఎన్నికలను ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ మేరకే నిర్వహించాలని సుప్రీం కోర్టు తీర్పునివ్వటాన్ని స్వాగతిస్తున్నాం. పాలకులెవరైనా రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించాలి. రాజ్యాంగ ధర్మాన్ని కూడా పాటించాలి. పంచాయతీ ఎన్నికలపై స్పష్టమైన నిర్ణయం వెలువడిన నేపథ్యంలో ఎన్నికలు సజావుగా సాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహించాలి.


Updated Date - 2021-01-26T07:00:58+05:30 IST