పనబాక లక్ష్మికి రెండోసారి అవకాశమెందుకంటే..

ABN , First Publish Date - 2020-11-17T14:39:58+05:30 IST

‘తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక వైసీపీ ఓటమికి..

పనబాక లక్ష్మికి రెండోసారి అవకాశమెందుకంటే..

వైసీపీ ఓటమికి తిరుపతి నాంది కావాలి

పనబాక లక్ష్మిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబు


తిరుపతి(ఆంధ్రజ్యోతి): ‘తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక వైసీపీ ఓటమికి నాంది కావాలి. ఇక్కడనుంచే వైసీపీ అరాచకాలకు అడ్డుకట్ట పడాలి’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని టీడీపీ నాయకులతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మిని ప్రకటించారు. గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నాయకులకు సూచించారు. ఏడాదిన్నర పాలనలో అభివృద్ధి లేకపోగా.. దళితులు,  ముస్లింలు, గిరిజనులు, బీసీలపై వైసీపీ దాడులకు అంతేలేకుండా పోయిందన్నారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన గుర్తుచేశారు.


‘తిరుపతిలో ఐఐటీ, ఐజర్‌, ఐఐడీపీ వంటి అత్యున్న విద్యాసంస్థలను నెలకొల్పాం. సోమశిల, కండలేరు విస్తరణ ద్వారా తిరుపతి పార్లమెంట్‌ పరిధిలో నీటికొరత లేకుండా కృషిచేశాం. నదుల అనుసంధానంతో గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తెచ్చి, శ్రీశైలంలో కృష్ణా జలాలను సీమ జిల్లాలకు మళ్లించాం. తిరుపతి, నగరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాలకూ నీళ్లిచ్చాం. తూర్పు ప్రాంతాలకు సోమశిల, కండలేరు ద్వారా నీటినిస్తే, ఇప్పుడు వైసీపీ వచ్చాక పనులన్నీ నిలిపేసి అగమ్యగోచరంగా మార్చింది. టీడీపీ హయాంలో తిరుపతి, శ్రీసిటీ, కృష్ణపట్నంలను ట్రైసిటీగా అభివృద్ధి చేశాం. తిరుపతి ఎయిర్‌పోర్టు విస్తరణతోపాటు నెల్లూరు జిల్లా దగదర్తిలో ఎయిర్‌పోర్టుకు శ్రీకారం చుట్టాం. తిరుపతిలో గరుడవారధి, జిల్లాలో రోడ్లను 4, 6 లైన్లుగా అభివృద్ధిచేస్తే ఇప్పుడు రోడ్ల పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నాం. తిరుపతి పార్లమెంట్‌ పరిధిలో 29,235 మందికి 27,805 ఎకరాల్లో సీజేఎఫ్‌ఎస్‌, డీకేటీ పట్టాలిచ్చాం. జిల్లాలో 1.7 లక్షల ఇళ్లను మంజూరుచేసి.. అందులో 1,10,541 ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేశాం’ అని చంద్రబాబు వివరించారు.


తాము కట్టిన ఇళ్లను పేదలకు ఇవ్వకుండా ప్రస్తుత ప్రభుత్వం శిథిలం చేస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఏడాదిన్నరగా కార్పొరేషన్లకు నిధులు ఇవ్వలేదని ఆనయ గుర్తుచేశారు. హార్టికల్చర్‌ పంటలను తాము ప్రోత్సహిస్తే.. వైసీపీ వచ్చాక మైక్రో ఇరిగేషన్‌కు కూడా తూట్లు పొడిచిందన్నారు. రేణిగుంట, ఏర్పేడును ఎలక్ర్టానిక్‌ హబ్‌గా.. తిరుపతిని హార్డ్‌వేర్‌ అండ్‌ ఎలక్ర్టానిక్‌ సిటీగా అభివృద్ధి చేశామన్నారు. రేణిగుంటలో రూ.15వేల కోట్ల పెట్టుబడితో ముందుకొచ్చిన రిలయన్స్‌ను కూడా ఈ ప్రభుత్వం పోగొట్టిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీ హయాంలో నెలకొల్పిన అపోలో టైర్స్‌ కంపెనీ తొలిటైర్‌ను ఇటీవలే మార్కెట్లోకి విడుదలచేశారని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక కంపెనీనైనా తీసుకొచ్చిందా అని ప్రశ్నించారు. అమరరాజా ఇన్‌ఫ్రాటెక్‌కు ఇచ్చిన భూములను వైసీపీ లాక్కుందన్నారు. ఇలా వైసీపీ కక్ష సాధింపులతో రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు వచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. 


తిరుపతికి అప్రతిష్ఠ తెస్తున్నారు 

రాష్ట్ర ప్రభుత్వం తిరుపతిని అన్నివిధాలా అప్రతిష్ఠపాలు చేస్తోందని చంద్రబాబు నాయుడు ఆదోళన వ్యక్తంచేశారు. ‘అసభ్య ప్రవర్తనతో ఎస్వీబీసీ ఛైర్మన్‌ రాజీనామా చేయడం, భక్తులకు ఫోర్న్‌ వెబ్‌సైట్‌ లింకులు పంపడం టీటీడీ చరిత్రలో ఎప్పుడైనా జరిగాయా? తిరుపతిలో అన్యమత ప్రచారం, ఆర్టీసీ టికెట్లపై జెరూసలం యాత్ర విశేషాలు దేనికి సంకేతం? పింక్‌ డైమండ్‌పై తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్లపై టీటీడీ వేసిన కేసులు విత్‌డ్రా చేసుకోవాలనుకోవడం దివాలాకోరుతనానికి నిదర్శనం’ అని విమర్శించారు. తిరుపతి ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సూచించారు. గత ఎన్నికల్లో దూరమైన వర్గాలు మళ్లీ దగ్గరకావడం శుభపరిణామన్నారు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి రాజకీయ కక్ష సాధించడమే పనిగా పెట్టుకున్నారని తిరుపతి పార్లమెంట్‌ అధ్యక్షుడు నరసింహ యాదవ్‌ మండిపడ్డారు. 


నమ్మకాన్ని వమ్ముచేయను: పనబాక లక్ష్మి

తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయనని, గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తిరుపతి లోక్‌సభ టీడీపీ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి పేర్కొన్నారు. దాడులు, దౌర్జన్యాలతో వైసీపీపై అన్ని వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. నంద్యాల ఉప ఎన్నికను సవాలుగా తీసుకుని గెలిచినట్టే తిరుపతి ఎన్నికనూ ఛాలెంజ్‌గా తీసుకుని విజయం సాధించాలన్నారు. వైసీపీ చేసిన దారుణాలకు ఉప ఎన్నికద్వారా ప్రజలే గుణపాఠం చెప్పాలని సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, తిరుపతి పార్లమెంట్‌ పరిశీలకుడు ఉగ్ర నరసింహారెడ్డి, ఎమ్మెల్సీ టీడీ జనార్దన్‌, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణ, నేతలు మాల్యాద్రి, వెంకటపతి రాజు, చింతకాయల విజయ్‌, నెలవల సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.


పనబాకకు రెండోసారి అవకాశం

తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది తొలి భాగంలో ఇక్కడ ఉప ఎన్నిక జరగవచ్చని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ముందుగానే తన అభ్యర్థిని ఖరారు చేసింది. పనబాక లక్ష్మికి రెండో అవకాశం ఇచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరపున తొలిసారి పోటీచేసిన ఈమెకే ఉప ఎన్నికలోనూ చంద్రబాబు అవకాశం ఇచ్చారు. నియోజకవర్గానికి సుపరిచితురాలు కావడంతో ఆమెనే పోటీ చేయించాలని టీడీపీ నాయకత్వం నిర్ణయించింది. 1996 నుంచి కాంగ్రెస్‌ పార్టీలో క్రియాశీలక సభ్యురాలిగా ఉన్న ఆమె 11వ లోకసభకు మొదటిసారి నెల్లూరు పార్లమెంట్‌ నుంచి గెలుపొందారు. ఆతర్వాత 12, 14, 15వ లోకసభకు ఎన్నికవుతూ వచ్చారు. 2004లో నెల్లూరు నుంచి  2009లో బాపట్ల నుంచి గెలుపొందారు. యూపీఏ ప్రభుత్వంలో పెట్రోలియం, కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2014లో బాపట్లలో ఓటమి చెందారు. 

Updated Date - 2020-11-17T14:39:58+05:30 IST