పీయూ వైస్‌చాన్సలర్‌గా పాలమూరు బిడ్డ

ABN , First Publish Date - 2021-05-23T04:42:25+05:30 IST

పాలమూరు యూనివర్సిటీ నాలుగో వైస్‌చాన్సలర్‌గా పాలమూరు జిల్లా వాసికే అవకాశం దక్కింది.

పీయూ వైస్‌చాన్సలర్‌గా పాలమూరు బిడ్డ

స్వస్థలం మద్దూరు మండలం తిమ్మారెడ్డిపల్లి


 మహబూబ్‌నగర్‌, మే 22 (ఆంధ్రజ్యోతి): పాలమూరు యూనివర్సిటీ నాలుగో వైస్‌చాన్సలర్‌గా పాలమూరు జిల్లా వాసికే అవకాశం దక్కింది. శనివారం ఆమోదం పొందిన వైస్‌ఛాన్సలర్ల జాబితాలో పీయూ వీసీగా ప్రొఫెసర్‌ ఎల్‌బీ లక్ష్మీకాంత్‌ రాథోడ్‌ పేరు ఉంది. ఈయన ఈ పదవిలో మూడేళ్లు కొనసాగుతారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం తిమ్మారెడ్డిపల్లి లక్ష్మీకాంత్‌ రాథోడ్‌ స్వగ్రామం. నిరుపేద గిరిజన కుటుంబంలో జన్మించిన రాథోడ్‌ బాల్యం నుంచి కష్టపడి చదువుకొని పైకొచ్చారు. డిగ్రీ వరకు మహబూబ్‌నగర్‌లోనే చదివారు. ఆయన విద్యాభ్యాసమంతా ప్రభుత్వ సంస్థల్లోనే కొనసాగింది. పదో తరగతి వరకు ఎంబీసీ హైస్కూల్‌లో, ఇంటర్‌ ప్రభుత్వ జూనియర్‌  కాలేజీలో, ఎంవీఎస్‌ డిగ్రీ కాలేజీలో బీఏ చదివారు. ఆతర్వాత ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీలో ఎంఏ(ఎకనామిక్స్‌) చదివారు. తర్వాత వర్సిటీ కాలేజీలోనే బీపీఈడీ(ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌), ఎంపీఈడీ, పీహెచ్‌డీ కూడా చేశారు. ఎయిడెడ్‌ కాలేజీలో లెక్చరర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి, అంచెలంచెలుగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా, అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా, ప్రొఫెసర్‌గా ఎదిగారు. ప్రస్తుతం నిజాం కళాశాల ప్రిన్సిపాల్‌గా, ఫ్యాకల్టీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌గా డీన్‌గా పనిచేస్తూ, పాలమూరు వర్సిటీ వీసీగా అవకాశం దక్కించుకున్నారు. మరోవైపు యూనివర్సిటీ స్విమ్మింగ్‌ ఫూల్‌ ఇన్‌చార్జి ఆఫీసర్‌గా, డీ హాస్టల్‌ జనరల్‌ వార్డెన్‌గా, ఇంటర్‌ కాలేజీ టోర్నమెంట్‌ కార్యదర్శిగా, ఐయూటీ, బీవోసీ కార్యదర్శిగా, యూనివర్సిటీ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌గా, ఆశాఖ హెడ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఈయన మార్గదర్శనంలో 11 మంది విద్యార్థులు పీహెచ్‌డీ, 8 మంది విద్యార్థులు ఎంఫిల్‌ చేశారు. ప్రస్తుతం మరో 8 మంది పీహెచ్‌డీ, ఒకరు పీడీఎఫ్‌ స్కాలర్‌కు ఈయన గైడ్‌గా ఉన్నారు. పలు జర్నల్స్‌, బుక్స్‌ ప్రచురించారు. అనేక జాతీయ, అంతర్జాతీయ స్థాయి సెమినార్లు, వర్క్‌షాపులు నిర్వహించారు. యూనివర్సిటీ తరుఫున 23 దేశాల్లో పర్యటించి, అధ్యయనాలు జరిపి, నివేదికలిచ్చారు. అనేక జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్ల నిర్వహణలో కీలకంగా వ్యవహరించారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాలకు వివిధ స్థాయిల్లో కీలక పదవులు నిర్వర్తించారు. గజిటెడ్‌ అధికారుల క్రెడిట్‌ సొసైటీకి బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌గానూ ఎనిమిదేళ్లు పనిచేశారు. సొంత జిల్లాలో నెలకొల్పిన యూనివర్సిటీకి వీసీగా పనిచేసే అవకాశం రావడం పట్ల లక్ష్మీకాంత్‌ రాథోడ్‌ సంతోషం వ్యక్తం చేశారు. వీసీగా యూనివర్సిటీని ముందుకు తీసుకెళ్లేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే అంతిమ లక్ష్యంగా పని చేస్తామన్నారు. తన నియామకానికి సహకరించిన సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌గౌడ్‌, స్పోర్ట్స్‌ అథారిటీ ఛైర్మన్‌ ఏ.వెంకటేశ్వరరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2021-05-23T04:42:25+05:30 IST