రోడ్డు పక్కన చెట్టుమీద చక్కటి పొదరిల్లు.. 8 ఏళ్లుగా అదే 28 ఏళ్ల కుర్రాడి నివాసం.. ఆశ్చర్యంతో ఆరా తీస్తే..

ABN , First Publish Date - 2022-04-22T22:46:50+05:30 IST

అతడి పేరు ఫర్మాన్ అలీ.. వయసు 28 ఏళ్లు.. పాకిస్థాన్‌లోని కరాచీకి చెందిన ఈ వ్యక్తి గత ఎనిమిదేళ్లుగా ఓ చెట్టుపై నివసిస్తున్నాడు..

రోడ్డు పక్కన చెట్టుమీద చక్కటి పొదరిల్లు.. 8 ఏళ్లుగా అదే 28 ఏళ్ల కుర్రాడి నివాసం.. ఆశ్చర్యంతో ఆరా తీస్తే..

అతడి పేరు ఫర్మాన్ అలీ.. వయసు 28 ఏళ్లు.. పాకిస్థాన్‌లోని కరాచీకి చెందిన ఈ వ్యక్తి గత ఎనిమిదేళ్లుగా ఓ చెట్టుపై నివసిస్తున్నాడు.. చెట్టు మీద చక్కటి పొదరింటిని ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు.. ఆ ఇల్లు తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. అందువల్ల అతడిని చాలా మంది `టార్జాన్ ఆఫ్ కరాచీ` అని పిలుస్తుంటారు.. అయితే అతడు చెట్టు మీద నివసిస్తోంది తన అభిరుచి వల్ల కాదు.. పేదరికం వల్ల. 


`మా అమ్మను, నాన్నను కోల్పోయిన తర్వాత కొద్ది రోజులు రోడ్ల పక్కన ఫుట్‌పాత్‌ల మీద, పార్కుల్లోనూ పడుక్కునే వాడిని. ఆయా స్థలాల్లో ఎవరూ నన్ను ఎక్కువ రోజులు ఉండనిచ్చే వారు కాదు. అద్దె ఇల్లు తీసుకునేంత స్థోమత నాకు లేదు. అందుకే చెట్టు మీద నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకున్నా. వర్షం, చలి నుంచి నన్ను నేను కాపాడుకునేందుకు వెదురు, పాత తలుపు చెక్కలు, దుప్పట్లతో ఓ ఆవాసం ఏర్పాటు చేసుకున్నా. ఇక్కడకు వచ్చాక నాకు ప్రశాంతంగా ఉంది. ఈ ఎనిమిదేళ్లలో ఎవరూ నన్ను వెళ్లగొట్టడానికి ప్రయత్నించలేద`ని చెప్పాడు. 


కార్లు కడిగి, రోడ్లు తుడిచి, ఇళ్లలో చిన్న చిన్న పనులు చేసి ఫర్మాన్ తన తిండికి కావాల్సిన డబ్బులు సంపాదిస్తాడు. కొందరు ఆహారం కూడా ఇస్తుంటారు. ఆ చెట్టు మీదే ఫర్మాన్ ఒక చిన్న వాష్ బేసిన్, బ్యాటరీతో పని చేసే బల్బు, వంట చేసుకోవడానికి ఎలక్ట్రిక్ స్టవ్ ఏర్పాటు చేసుకున్నాడు. తనకు గతంలో వివాహం అయిందని, తన పేదరికం చూసి భార్య తనను వదిలేసి వెళ్లిపోయిందని ఫర్మాన్ చెప్పాడు. ఏదేమైనా ఫర్మాన్ ట్రీ హౌస్ మాత్రం సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయింది. 


Updated Date - 2022-04-22T22:46:50+05:30 IST