వినాయక దేవాలయం ధ్వంసంపై పాక్ సుప్రీంకోర్టు విచారణ

ABN , First Publish Date - 2021-08-08T01:27:51+05:30 IST

సిద్ధి వినాయక దేవాలయం ధ్వంసం కేసును పాకిస్థాన్

వినాయక దేవాలయం ధ్వంసంపై పాక్ సుప్రీంకోర్టు విచారణ

ఇస్లామాబాద్ : సిద్ధి వినాయక దేవాలయం ధ్వంసం కేసును పాకిస్థాన్ సుప్రీంకోర్టు స్వీయ విచారణకు చేపట్టింది. రహీం యార్ ఖాన్ జిల్లాలోని భోంగ్ పట్టణంలో ఉన్న ఈ దేవాలయాన్ని విగ్రహాలతో సహా కొందరు దుండగులు ఇటీవల ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. 


నేషనల్ అసెంబ్లీ సభ్యుడు, పాకిస్థాన్ హిందూ కౌన్సిల్ ప్యాట్రన్-ఇన్-చీఫ్ డాక్టర్ రమేశ్ కుమార్ ఆగస్టు 5న పాకిస్థాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గుల్జార్ అహ్మద్‌ను కలిసి, ఈ విధ్వంసం గురించి వివరించారు. జస్టిస్ గుల్జార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసి, ఆగస్టు 6న విచారణ జరిపారు. ఈ సంఘటనపై నివేదికలతో హాజరు కావాలని పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ చీఫ్ సెక్రటరీని, ఐజీపీని ఆదేశించారు. ఈ సంఘటనను నిరోధించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయంపై దాడి జరుగుతూ ఉంటే పరిపాలనాధికారులు, పోలీసులు ఏం చేస్తున్నారని ఐజీపీ ఇనామ్ ఘనీని ప్రశ్నించారు. తదుపరి విచారణను ఆగస్టు 13కు వాయిదా వేశారు. 


భోంగ్‌ పట్టణ ప్రజలను రెచ్చగొట్టే విధంగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు హల్‌చల్ చేసిన నేపథ్యంలో దుండగులు ఆగస్టు 4న సిద్ధి వినాయక దేవాలయాన్ని ధ్వంసం చేశారు. ఈ దేవాలయంలోని విగ్రహాలను ధ్వంసం చేసి, నిప్పు పెట్టారు. 


Updated Date - 2021-08-08T01:27:51+05:30 IST