జమ్మూ-కశ్మీరును కలుపుతూ కొత్త మ్యాప్‌కు పాకిస్థాన్ మంత్రివర్గం ఆమోదం

ABN , First Publish Date - 2020-08-05T01:37:23+05:30 IST

ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ మంత్రివర్గం మంగళవారం

జమ్మూ-కశ్మీరును కలుపుతూ కొత్త మ్యాప్‌కు పాకిస్థాన్ మంత్రివర్గం ఆమోదం

ఇస్లామాబాద్ : ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ మంత్రివర్గం మంగళవారం నూతన రాజకీయ మ్యాప్‌ను ఆమోదించింది. జమ్మూ-కశ్మీరు, లడఖ్‌లోని కొన్ని ప్రాంతాలు పాకిస్థాన్ దేశంలోనివేనని పేర్కొంటూ ఈ మ్యాప్‌కు ఆమోదం తెలిపింది. గుజరాత్‌లోని జునాగఢ్, మనవడర్‌లతోపాటు సర్ క్రీక్ కూడా పాకిస్థాన్ దేశంలోనివేనని ఈ కొత్త మ్యాప్ పేర్కొంది. 


ఇమ్రాన్ ఖాన్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, ఈ నూతన మ్యాప్ పాకిస్థాన్, కశ్మీరీ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తోందని తెలిపారు. ప్రపంచం ముందు నూతన పాకిస్థానీ మ్యాప్‌ను పెడుతున్నామన్నారు. దీనిని పాకిస్థాన్ మంత్రివర్గం, ప్రతిపక్షాలు, కశ్మీరీ నాయకత్వం బలపరుస్తున్నట్లు తెలిపారు. 


కశ్మీరు విషయంలో గత ఏడాది భారత దేశం చేపట్టిన చట్టవిరుద్ధ చర్యను నేడు పాకిస్థాన్ కొత్త మ్యాప్ రద్దు చేసిందన్నారు. 


గత ఏడాది ఆగస్టు 5న భారత ప్రభుత్వం జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే అధికరణ 370ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రాన్ని విభజించి, జమ్మూ-కశ్మీరు, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసింది.


Updated Date - 2020-08-05T01:37:23+05:30 IST