ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి

ABN , First Publish Date - 2021-10-19T04:28:53+05:30 IST

గత వానాకాలం, యాసంగి సీజన్‌లో అనుభవాలను పరిగణలోకి తీసుకుని ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌ తెలిపారు. సోమవారం సిద్దిపేట ఐడీవోసీలోని అదనపు కలెక్టర్‌ చాంబరులో జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రారంభంపై సివిల్‌ సప్లయ్‌, డీఆర్డీఏ, డీసీవో, లీగల్‌ మెట్రాలజీ, డీపీఏం, మెప్మా అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు.

ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి

రైతులు బ్యాంకు ఖాతా, ఆధార్‌ కార్డు జిరాక్స్‌ పత్రాలను అందజేయాలి 

మిల్లుకో ప్రత్యేకాధికారిని నియమిస్తాం

వ్యవసాయ, మార్కెటింగ్‌, పౌరసరఫరాల శాఖలు సమన్వయంతో పనిచేయాలి

అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌


సిద్దిపేట టౌన్‌, అక్టోబరు 18 : గత వానాకాలం, యాసంగి సీజన్‌లో అనుభవాలను పరిగణలోకి తీసుకుని ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌ తెలిపారు. సోమవారం సిద్దిపేట ఐడీవోసీలోని అదనపు కలెక్టర్‌ చాంబరులో జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రారంభంపై సివిల్‌ సప్లయ్‌, డీఆర్డీఏ, డీసీవో, లీగల్‌ మెట్రాలజీ, డీపీఏం, మెప్మా అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ ఆధార్‌కార్డు, పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంకు ఖాతాలో కొనుగోళ్ల అనుసంధానంపై యోచిస్తున్నట్లు తెలిపారు. దీంతో ధాన్యం పండించిన రైతుల బ్యాంకు ఖాతాల్లోనే నేరుగా కొనుగోళ్ల డబ్బు జమ కానున్నాయని పేర్కొన్నారు. వ్యవసాయ, మార్కెటింగ్‌, పౌరసరఫరాల శాఖలు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ మిల్లుకు ఓ ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్లు వివరించారు. జిల్లా వ్యాప్తంగా 400 పైచిలుకు ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలను ప్రారంభించనున్నట్లు, అదేవిధంగా సబ్‌ సెంటర్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని అదనపు కలెక్టర్‌ తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఎక్కడెక్కడ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలనే అంశంపై అధికారులతో చర్చించారు. జిల్లాలోని వే బ్రిడ్జి కాంటలను క్షుణ్ణంగా పరిశీలించాలని లీగల్‌ మెట్రాలజీ అధికారిని ఆదేశించారు. వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా క్లస్టర్‌ కేంద్రాల వారీగా రైతుల సమగ్ర వివరాలను సేకరించాలని సూచించారు. చెక్‌ లిస్ట్‌, వెయింగ్‌ మిషనరీ, ప్యాడీ క్లీనర్స్‌, గన్నీ బ్యాగులతో పాటు ట్రాన్స్‌పోర్టులారీలు అందుబాటులో ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. సమీక్షలో డీఆర్డీఏ పీడీ గోపాల్‌రావు, సివిల్‌ సప్లయ్‌ అధికారి హరీశ్‌, డీసీవో ప్రభాకర్‌, మెప్మా పీడీ హన్మంతరెడ్డి, లీగల్‌ మెట్రాలజీ అధికారి, డీపీఎం కరుణాకర్‌, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-19T04:28:53+05:30 IST