విజయవాడ సిగలో విరిసిన ‘పద్మాలు’

ABN , First Publish Date - 2021-01-26T06:58:33+05:30 IST

విజయవాడ సిగలో రెండు ‘పద్మాలు’ వికసించాయి. కేంద్రం సోమవారం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో రాష్ట్రానికి మూడు రాగా, వాటిలో రెండు విజయవాడ కళాకారులకే దక్కడం విశేషం.

విజయవాడ సిగలో విరిసిన ‘పద్మాలు’

రామస్వామి, సుమతిలకు పద్మశ్రీ పురస్కారాలు

ఇద్దరి జన్మస్థలం పశ్చిమగోదావరి జిల్లానే

విద్వాంసులుగా మార్చిన విజయవాడ


విజయవాడ(ఆంధ్రజ్యోతి): విజయవాడ సిగలో రెండు ‘పద్మాలు’ వికసించాయి. కేంద్రం సోమవారం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో రాష్ట్రానికి మూడు రాగా, వాటిలో రెండు విజయవాడ కళాకారులకే దక్కడం విశేషం. వాయులీన విద్వాంసుడు అన్నవరపు రామస్వామి, మృదంగ విద్వాంసురాలు నిడుమోలు సుమతి (దండమూడి సుమతీ రామ్మోహన్‌)లను పద్మశ్రీలు వరించాయి. వీరిద్దరూ పశ్చిమగోదావరి జిల్లాలో జన్మించి, విజయవాడలో స్థిరపడ్డారు.


పద్మశ్రీతో రామస్వామికి మరింత కీర్తి

‘మనసును ఆహ్లాదపరిచే కళతో జనులను రంజింపచేసిన కళాకారుడే చరితార్థుడవుతాడు. వయోలిన్‌ విద్వాంసుడు అన్నవరపు రామస్వామి అభిప్రాయం ఇది. దీనికి తగ్గట్టుగానే ఆయన సంగీత ప్రపంచంలో చరితార్థుడయ్యారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీతో అన్నవరపు రామస్వామి కీర్తి మరింతగా పెరిగింది. పొరుగు జిల్లా నుంచి బాల్యంలో సంగీత శిక్షణ కోసం వచ్చిన ఆయన విజయవాడలోనే స్థిరపడ్డారు. రామస్వామి పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం సోమవరప్పాడు గ్రామంలో 1923 మార్చి 23న జన్మించారు. ఆయన వయసు ఇప్పుడు 97 ఏళ్లు. పెద్ద కుటుంబం కావడంతో బాల్యంలోనే ఎన్నో కష్టాలను చవిచూశారు. ఆ కష్టాల మధ్యే సంగీతంలో నిలదొక్కుకున్నారు.


అన్నవరపు తండ్రి పెద్దయ్య. తల్లి లక్ష్మి. ఆ తల్లిదండ్రులకు ఈయన ఎనిమిదో సంతానం. ఒకటో తరగతి వరకు చదివి తర్వాత ఆపేశారు. తరువాత పశువులను మేపుకుని వచ్చేవారు. ఆయన సంగీత శిక్షణ ఎనిమిదో ఏట ప్రారంభం కాగా, కచేరీల ప్రస్థానం 13వ ఏటనే ఆరంభమైంది. ఏలూరులోని జగన్నాథచౌదరి అనే సంగీత విద్వాంసుడి వద్ద వయోలిన్‌ శిక్షణ పొందారు. తర్వాత సంగీత విద్వాంసుడు దాలిపర్తి పిచ్చయ్య సలహాతో విజయవాడలోని పారుపల్లి రామకృష్ణయ్య పంతుల వద్ద శిష్యరికం చేశారు. ఆయన వద్ద ఎనిమిదేళ్లపాటు శిక్షణ తీసుకున్నారు. రామకృష్ణయ్య పంతులు సంగీతం ఉచితంగానే నేర్పినా, రామస్వామి తిండికి ఇబ్బంది పడేవారు. సంగీతం నేర్చుకున్న సమయంలో అన్నం కోసం నాలుగేళ్లు ఇబ్బంది పడ్డానని ఆయన చెప్పారు. బాలమురళీకృష్ణ కూడా ఈయనతోపాటే సంగీతం నేర్చుకున్నారు. ఆయన కచేరీలకు రామస్వామి వయోలిన్‌ సహకారం అందజేసేవారు. మద్రాసు నుంచి మంగళంపల్లి బాలమురళీకృష్ణ విజయవాడ ఎప్పుడు వచ్చినా, అన్నవరపు రామస్వామి ఇంట్లోనే బస. ఇద్దరూ కలిసి అనేక దేశాల్లో కచేరీలు ఇచ్చారు. రామస్వామికి నాలుగుసార్లు కనకాభిషేకాలు జరిగాయి. వెండి కిరీటం, గండపెండేరాలతో రెండు సార్లు, బంగారు కంకణాలతో నాలుగుసార్లు సత్కరించారు. రామస్వామి షష్టిపూర్తి ఉత్సవాలకు కమిటీ చైర్మన్‌గా ఆయన ప్రాణమిత్రుడు బాలమురళీకృష్ణ వ్యవహరించారు. 


మృదంగంలో తిరుగులేని సుమతి

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో 1950వ సంవత్సరంలో పుట్టిన మృదంగ విద్వాంసురాలు నిడుమోలు సుమతి (దండమూడి సుమతీ రామ్మోహన్‌) తొలుత తండ్రి రాఘవయ్య వద్ద మృదంగం నేర్చుకున్నారు. తర్వాత విజయవాడలో ఘంటసాల సంగీత కళాశాలలో మృదంగ విద్వాంసుడు దండమూడి రామ్మోహనరావు వద్ద శిక్షణ తీసుకున్నారు. రామ్మోహనరావుకు మంచి శిష్యురాలిగా ఉన్న సుమతి ఆయననే జీవిత భాగస్వామిగా చేసుకున్నారు. దేశవిదేశాల్లో ప్రముఖ సంగీత విద్వాంసులతో కలిసి ప్రదర్శన ఇచ్చారు. పళని సుబ్రహ్మణ్యం స్మారక పురస్కారాన్ని అందుకున్నారు. రామ్మోహనరావు, సుమతి చాలాకాలం ఆకాశవాణి, దూరదర్శన్‌లో ‘ఏ’ గ్రేడ్‌ మృదంగ కళాకారులుగా ఉన్నారు.


పళని సుబ్రహ్మణ్యం బాణి వారికి ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. సుమతి వేలాది మంది విద్యార్థులను తయారు చేశారు. లయ వేదిక అనే సంస్థను స్థాపించి మృదంగంలో విశేష ప్రతిభ కనబరిచిన కళాకారులను భర్త రామ్మోహనరావు పేరుతో సత్కరిస్తున్నారు. ఆమెకు మృదంగ విదుషి, మృదంగ శిరోమణి, మృదంగ మహారాణి, నాదభగీరథ, మృదంగలయ విద్యాసాగర వంటి బిరుదులు ఉన్నాయి. 1974, 1982, 1985 సంవత్సరాల్లో మద్రాసు సంగీత అకాడమీ నుంచి ఉత్తమశ్రేణి వాయిద్య కళాకారిణి అవార్డును అందుకున్నారు. 2009లో సుమతిని కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం వరించింది. పురుషాధిక్యం బలంగా ఉన్న రోజుల్లో సుమతి మృదంగంతో సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు. నాటి నుంచి ఆమె ఏనాడూ వెనుతిరిగి చూడలేదు. 

Updated Date - 2021-01-26T06:58:33+05:30 IST