రైతుల అవసరం మేరకు ధాన్యం కొనుగోళ్లు

ABN , First Publish Date - 2021-11-26T06:18:35+05:30 IST

రైతుల అవసరం మేరకు ధాన్యం కొనుగోళ్లు

రైతుల అవసరం మేరకు ధాన్యం కొనుగోళ్లు
విలేకరులకు వివరాలు వెల్లడిస్తున్న అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌

ఈ సారి తరుగు సమస్య లేకుండా చర్యలు

కొన్న రోజునే ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం

విలేకరుల సమావేశంలో ఖమ్మం అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌

ఖమ్మం కలెక్టరేట్‌, నవంబరు 25: రైతుల అవసరం మేరకు ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్దంగా ఉన్నామని, గతంలోలా ఈ సారి ధాన్యం కొనుగోళ్లలో తరుగు సమస్య రానివ్వమని ఖమ్మం అదనపు కలెక్టర్‌ ఎన్‌.మధుసూదన్‌ స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై మీడియాలో వస్తున్న కథనాలపై స్పందించిన ఆయన గురువారం విలేకరుల సమావేశంలో పలు వివరాలను వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 298 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించి 129 కేంద్రాలు ప్రారం భించామన్నారు. వీటి ద్వారా ఇప్పటి వరకు 855మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొని.. సంబంధిత 13 మంది రైతులకు ఆ రోజునే రూ.15లక్షల27వేల రూపాయలను వారి బ్యాంకు ఖాతాల్లో జమచే శామన్నారు. గతంలో ఆరోపణలు వచ్చిన ఏదులాపురం పీఏసీఎస్‌ లో ధాన్యం కొనుగోలు చేయడం లేదని దీనికి బదులుగా ఈ సారీ డీసీఎంఎస్‌ ద్వారా కొనుగోళ్లు చేపడుతున్నామని, ఈసారి ధాన్యం రవాణాలోనూ జాప్యం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టామ న్నారు. సీఎంఆర్‌ బియ్యం కోసం ఇతర ప్రాంతాల కు ధాన్యాన్ని రవాణా చేయాల్సిన అవసరం లేదని జిల్లాలో 54 మిల్లులకు సామరాఽ్థ్యన్ని పెంచి సేకరించిన ధాన్యాన్ని ఇక్కడే  మిల్లింగ్‌ చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడా కూడా గన్నీ బ్యాగుల కొరత లేదని, జిల్లాకు కోటి బ్యాగులు అవసరం ఉండగా ప్రస్తుతం 60.11లక్షలు సిద్ధంగా ఉన్నాయన్నారు. జిల్లాలో ఆరోపణలు వచ్చిన, క్రిమినల్‌ కేసులు నమోదైన మిల్లులకు ధాన్యాన్ని కేటాయించేది లేదని స్పష్టం చేశారు. రైతులు విధిగా ధాన్యాన్ని కోసిన తర్వాత తేమ, తాలు, మట్టిపెడ్డలు లేకుండా ధాన్యాన్ని తెస్తే మద్దతు ధర పొందొంచ్చని, తరుగు సమస్య కూడా రాదన్నారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి రాజేందర్‌తో పాటు జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్‌ సోములు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-26T06:18:35+05:30 IST