ధాన్యం.. దైన్యం

ABN , First Publish Date - 2021-01-04T05:00:58+05:30 IST

వరి సాగు ఆరంభంలో ఈ ఏడాది ప్రకృతి అనుకూలించింది. సాగర్‌ నీరు కూడా పుష్కలంగా అందింది. దీంతో దిగుబడులు ఆశాజనంగా ఉంటాయని రైతులు ఆనందించారు. మార్కెట్‌లో మంచి ధరలు లభిస్తే లాభాలు వస్తాయని మురిసిపోయారు. కానీ వారి ఆశలు అడియాశలయ్యాయి.

ధాన్యం.. దైన్యం
దర్శి ప్రాంతంలో దాన్యంను బస్తాలకు ఎత్తి ఉంచిన రైతులు

దిగుబడులతోపాటు

దిగజారిన ఽధరలు 

లభించని ప్రభుత్వ ‘మద్దతు’

నాలుగు చోట్ల మాత్రమే కొనుగోళ్లు

ఆర్‌బీకేలలో ప్రారంభంకాని వైనం

దోచుకుంటున్న ప్రైవేటు వ్యాపారులు 

భారీగా నష్టపోతున్న రైతులు 

కౌలుదారుల పరిస్థితి దయనీయం


అద్దంకి / దర్శి, జనవరి 3 : జిల్లాలో ధాన్యం రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పంట కోతలు, నూర్పిళ్ల ప్రారంభంలోనే వ్యాపారుల మాయాజాలం మొదలైంది. ధరలు దిగజార్చి రైతులను దోచుకుంటున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభంకాకపోవడం, ఆర్‌బీకేల్లో ధాన్యం సేకరణ ప్రకటనలకే పరిమితమవడం, అప్పుల వారి నుంచి ఒత్తిడి పెరగడంతో రైతులు బహిరంగ మార్కెట్‌లో ధాన్యం విక్రయాలకు మొగ్గు చూస్తున్నారు. దీన్ని ఆసరా చేసుకొని వ్యాపారులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే క్వింటాకు రూ. 200 తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది  ప్రకృతి ప్రతికూలతతో పెట్టుబడి ఖర్చులు భారీగా పెరిగాయి. దిగుబడులు పడిపోయాయి. ఈ సమయంలో ధరలు కూడా దిగజారడంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. 


 వరి సాగు ఆరంభంలో ఈ ఏడాది ప్రకృతి అనుకూలించింది. సాగర్‌ నీరు కూడా పుష్కలంగా అందింది. దీంతో దిగుబడులు ఆశాజనంగా ఉంటాయని రైతులు ఆనందించారు. మార్కెట్‌లో మంచి ధరలు లభిస్తే లాభాలు వస్తాయని మురిసిపోయారు. కానీ వారి ఆశలు అడియాశలయ్యాయి. తుఫాన్‌లు, వాయుగుండాల ప్రభావంతో కురిసిన అతివర్షాలు పంటలను తీవ్రంగా దెబ్బతీశాయి. విజృంభించిన తెగుళ్లు నిండా ముంచాయి. దీనికితోడు ఎలుకల బెడద కూడా అధికమైంది. ఇటీవల పంట కోతలు, నూర్పిళ్లు ప్రారంభంకాగా దిగుబడులు దిగజారాయి. ఈ సమయంలో ప్రభుత్వం నుంచి ఆశించిన చేయూత కరువైంది. కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో ప్రారంభం కాకపోవడం, అప్పుల భారం తీర్చుకునేందుకు పంటను రైతులు వెంటనే అమ్ముకోవాల్సి వస్తుండటాన్ని ఆసరా చేసుకొని ప్రైవేటు వ్యాపారులు ధరలు దిగజార్చి దోచుకుంటున్నారు. 


పెరిగిన పెట్టుబడి ఖర్చులు

ఈ ఏడాది వరి సాగుకు పెట్టుబడి ఖర్చులు పెరిగాయి. సాధారణంగా ఎకరా సాగుకు రూ. 30వేల వరకూ ఖర్చవుతుంది. ఈ ఏడాది అధిక వర్షాలు, తెగుళ్ల బెడద వలన అధికంలో రూ. 5వేల వరకూ వెచ్చించాల్సి వచ్చింది. అద్దంకి, దర్శి ప్రాంతాల్లో బీపీటీ రకం దిగుబడులు సాధారణంగా ఎకరాకు 30 బస్తాల వరకూ (బస్తా 75 కిలోలు) వస్తుంది. ఈ ఏడాది ప్రకృతి ప్రతికూలత కారణంగా 12 నుంచి 22 బస్తాలు దాటలేదు. 


నాలుగు చోట్ల మాత్రమే కొనుగోళ్లు ప్రారంభం

 జిల్లాలో మొత్తం 98 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చిన్నప్పటికీ ప్రస్తుతం 4 చోట్ల మాత్రమే ప్రారంభించారు. 40 వేల టన్నుల ధాన్యం కొనుగోలుకు అనుమతి ఉండగా, కేవలం 1000 టన్నులు మాత్రమే సేకరించారు. అధికారుల నిర్లక్ష్యంతో కొనుగోళ్లు మొక్కుబడిగా సాగుతున్నాయి. ప్రభుత్వం ఏ గ్రేడ్‌ ధాన్యానికి క్వింటా రూ.1688, సాధారణ రకానికి రూ.1668 మద్దతు ధర ప్రకటించింది.  రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రేడ్‌-1 రకం కొనుగోలు చేస్తామని ప్రకటించినా ఇప్పటి వరకూ ఆ ఊసే కరువైంది. అయితే కొనుగోళ్లు అన్ని ప్రాంతాల్లో ప్రారంభించకపోవడంతో సన్న, చిన్నకారు రైతులు అవసరాల కోసం తక్కువ ధరలకు ప్రైవేట్‌ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. 


ప్రైవేటు వ్యాపారుల దగా

రైతుల అవసరాన్ని ఆసరా చేసుకొని ప్రైవేటు వ్యాపారులు దగా చేస్తున్నారు. ధరలు దిగజార్చి దోచుకుంటున్నారు.  ధాన్యం క్వింటా రూ.1450 నుంచి రూ.1500 వరకూ కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన దానికి, మార్కెట్‌లో ధరకు సుమారు రూ.200 తేడా ఉండటంతో  రైతులు నష్టపోతున్నారు. 


భారీగా నష్టపోతున్న రైతులు 

గతంలో జిల్లాలో ఎకరాకు  27 నుంచి 40 కింటాళ్ల వరకూ ధాన్యం దిగుబడి వచ్చేది. కానీ ఈసారి 18 నుంచి 20 క్వింటాళ్ల వరకూ వస్తోంది. ప్రస్తుతం క్వింటా ప్రభుత్వ మద్దతు ధర రూ. 1688గా ఉంది. ఆ ప్రకారం చూస్తే గతంలో 40 క్వింటాళ్లకు  రైతులకు రూ. 65వేల వరకూ వచ్చేది. ఖర్చులు పోను 35వేల వరకూ ఆదాయం ఉండేది. కానీ ఈసారి  దిగుబడులు దిగజారడం వలన సగటున 30వేలకు మించి ఆదాయం లభించడం లేదు. ఆ ప్రకారం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే పెట్టుబడులు మాత్రమే వస్తాయి. కానీ ప్రైవేటు వారు క్వింటాకు రూ. 200 తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. వారి వద్ద అమ్మిన రైతులు సుమారు రూ. 4వేల వరకూ నష్టపోతున్నారు. మొత్తం మీద గతంతో పోల్చుకుంటే రైతులు రూ. 30వేల నుంచి రూ. 35వేల వరకూ నష్టపోతున్నారు.  కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వారు కౌలు, ఇతరత్రా పెట్టిన పెట్టుబడులు కలిపి ఎకరాకు రూ. 15వరకూ నష్టపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కేంద్రాల ద్వారా కొనుగోళ్లు వేగవంతంగా జరిగేలా చూడటంతోపాటు, రైతు భరోసా కేంద్రాల ద్వారా కూడా సేకరణ ప్రారంభించాలని అన్నదాతలు డిమాండ్‌ చేస్తున్నారు.


దిగుబడులు భారీగా తగ్గాయి


ఈ ఏడాది ధాన్యం దిగుబడులు బాగా తగ్గాయి. బీపీటీ రకం బస్తా (75 కిలోలు)కు గత ఏడాది ప్రారంభంలో రూ.1500 వరకూ ఇవ్వగా ఇప్పుడు రూ.1300కు కూడా కొనుగోలు చేయడం లేదు.  ఆర్‌బీకేలలో ఇంకా ధాన్యం కొనుగోలు ప్రారంభించ లేదు. వ్యాపారులు కూడా ఆసక్తి చూపకపోవటంతో ధర మరింత తగ్గించి అమ్ముకోవాల్సి వస్తోంది. కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి కనిపించటం లేదు. 


గంగవరపు మస్తాన్‌రావు, వరి రైతు, అంబడిపూడి, బల్లికురవ మండలం 



Updated Date - 2021-01-04T05:00:58+05:30 IST