కల్లాల్లోనే వడ్లు

ABN , First Publish Date - 2021-06-15T05:21:05+05:30 IST

కల్లాల్లోనే వడ్లు

కల్లాల్లోనే వడ్లు
కిషన్‌నగర్‌ శివారులో వెంచర్‌లో ఉన్న వడ్ల కుప్పలు

  • గన్నీ బ్యాగుల కొరత
  • కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల పడిగాపులు
  • కొన్ని కేంద్రాల మూత 
  • ఆందోళనలో అన్నదాతలు 

షాద్‌నగర్‌ రూరల్‌: ఒక పక్క వానకాలం రావడం, మరో పక్క యాసంగిలో పండించిన వడ్లు అమ్ముడుపోక రైతులు ఆందోళన చెందు తున్నారు. కొనుగోలు కేంద్రాలకు తరలించని ధాన్యం కల్లాలో ఉంది. ఎండకు ఎండి వానకు తడుసి మొలకలూ వస్తున్నాయి. ధాన్యం రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు దాపురించాయి. కష్టించి పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేని దయనీయ పరిస్థితిలో రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ ప్రాంత రైతులు వర్షాధారంపైనే సాగుచేస్తుంటారు. గత ఏడాది వర్షాలు బాగానే కురియడంతో ఈ యాసంగిలో వరి ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేశారు. షాద్‌నగర్‌ నియోజకవర్గంలో ఈ సీజన్‌లో రికార్డు స్థాయిలో 37,821 హెక్టార్లలో వరి పంటను సాగు చేశారు. దీంతో పంట ఉత్పత్తి ఎక్కువ వచ్చి వడ్లు కొనేవారే లేకుండా పోయారు. రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నా లోడింగ్‌ కావడం లేదు.


  • ముందస్తు ప్రణాళిక లోపమే కారణం?


యాసంగిలో ఎక్కువ విస్తీర్ణంలో వరి సాగు చేశారని తెలిసీ కొనుగోళ్లపై ప్రభుత్వం, అధికారులు ముందస్తు ప్రణాళిక తయారు చేయకపోవడమే నేడు రైతుల ఇబ్బందులకు కారణంగా తెలుస్తోంది. డిమాండ్‌కు తగ్గ గన్నీ బ్యాగులు సరఫరా చేయకపోవడంతో కల్లాల్లో, పొలాల వద్దే ధాన్యపు రాశులు కన్పిస్తున్నాయి. కిషన్‌నగర్‌, చించోడు తదితర గ్రామాల్లో కల్లాల్లోనే వడ్ల రాసులు ఉన్నాయి. బయట అమ్మలేక ప్రభుత్వం కొనక రైతులు కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వం క్వింటాలుకు రూ.1888 చెల్లిస్తుండగా ప్రైవేటులో రూ.1300 మాత్రమే చెల్లిస్తున్నారు. 


  • మూతపడిన కొందుర్గు కొనుగోలు కేంద్రం


కొందుర్గు, జిల్లేడు-చౌదరిగూడ ఉమ్మడి మండలాల కోసం లాల్‌పహాడ్‌ శ్రీనివాస కాటన్‌ మిల్లులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని అధికారు లు ఐదు రోజుల కిందే మూసేశారు. ధాన్యం తెచ్చిన రైతులు అవస్థ పడు తున్నారు. నియోజకవర్గంలోకెల్లా కొందుర్గు మండలంలో ఎక్కువ విస్తీర్ణం లో వరి పండిస్తారు. ఉన్న ఒక్క కొనుగోలు కేంద్రం మూతతో వడ్లు షాద్‌ నగర్‌ తీసుకెళ్లాలంటే దూర భారంతో పాటు రవాణా ఖర్చులు ఎక్కువ వుతాయని రైతులు వాపోతున్నారు. లాల్‌పహాడ్‌ కొనుగోలు కేంద్రాన్ని మొత్తం వడ్లు కొనేంతవరకూ తెరిచి ఉంచాలని కోరుతున్నారు.

Updated Date - 2021-06-15T05:21:05+05:30 IST