శ్మశానం కోసం పాదయాత్ర

ABN , First Publish Date - 2022-05-27T05:40:02+05:30 IST

ఆరడుగుల నేల కోసం గ్రామస్థులంతా.. తహసీల్దార్‌ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లారు. తరతరాలుగా శ్మశానవాటిక స్థలంలో ఖననం చేస్తున్నాం.

శ్మశానం కోసం పాదయాత్ర

తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లిన గ్రామస్థులు

అక్కడ బైఠాయింపు 

వైసీపీ నాయకుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ 

హిందూపురం టౌన, మే 26: ఆరడుగుల నేల కోసం గ్రామస్థులంతా.. తహసీల్దార్‌ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లారు. తరతరాలుగా శ్మశానవాటిక స్థలంలో ఖననం చేస్తున్నాం. అధికార పార్టీకి చెందిన రియల్టర్‌ విజయభాస్కర్‌ రెడ్డి భూమిని కొనుగోలు చేశానంటూ సమాధులను ధ్వంసం చేసేందుకు పూనుకున్నారంటూ గ్రామస్థులు మండిపడ్డారు. హిందూపురం మండలం మరువపల్లికి చెందిన 200 కుటుంబాలకు గ్రామ సమీపాన శ్మశానవాటిక ఉంది. ఇక్కడ పదుల సంఖ్యలో సమాధులున్నాయి. ఇటీవల అధికార పార్టీకి చెందిన రియల్టర్‌ విజయభాస్కర్‌ రెడ్డి ఆ భూమిని కొనుగోలు చేశానంటూ తెరపైకి వచ్చాడు. సమాధులను తొలగించేందుకు ఉపక్రమించాడు. దీంతో గ్రామస్థులు కన్నెర్రజేశారు. గురువారం 200 మందిదాకా మరువపల్లి నుంచి హిందూపురం తహసీల్దార్‌ కార్యాలయం వరకు 4 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారు. అక్కడ బైఠాయించి, నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ.. తరాలుగా శ్మశానంలో సమాధులున్నాయన్నారు. ఇప్పుడు వైసీపీకి చెందిన విజయభాస్కర్‌ రెడ్డి సమాధులున్న స్థలం తనదేనంటూ సర్వే చేయించి, రాళ్లు నాటిస్తున్నాడన్నారు. బుడేనసాబ్‌ అనే వ్యక్తి శ్మశానవాటికకు స్థలం ఇచ్చాడన్నారు. ఇప్పుడా స్థలం తనదేనంటూ రియల్టర్‌ చెప్పడం విడ్డూరమన్నారు. వెంటనే మాకు ఐదెకరాల శ్మశానవాటిక స్థలాన్ని కేటాయించాలనీ, ప్రహారీ నిర్మించి, నీటి సౌకర్యం కల్పించాలని కోరారు. లేనిపక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు. ఇక్కడ పరిష్కారం కాకపోతే కలెక్టరేట్‌కు పాదయాత్ర చేపడతామన్నారు. వీరికి మద్దతుగా సీపీఎం నాయకులు పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్‌ శ్రీనివాసులుకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో పూలకుంట సర్పంచ మంజునాథ్‌, భగతసింగ్‌ ఆటో యూనియన నాయకులు రామకృష్ణ, సీపీఎం నాయకులు వినోద్‌, నరసింహులు, నరేష్‌, రమేష్‌, రాజు, ఆది, నరసింహప్ప, హనుమప్ప, రాజశేఖర్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-05-27T05:40:02+05:30 IST