Advertisement
Advertisement
Abn logo
Advertisement

అనుయాయులకే ప్యాకేజీ, పునరావాసం

ఆధార్‌, రేషన్‌కార్డుల్లేకున్నా వర్తింపు

నిర్వాసితులకు మాత్రం మొండిచేయి

కుమ్మక్కయిన అధికారులు, ప్రజాప్రతినిధులు

రెంటికి చెడ్డ రేవడిలా మల్లన్నసాగర్‌ బాధితులు


గజ్వేల్‌, అక్టోబరు 23 : మల్లన్నసాగర్‌ పునరుపాధి, పునరావాస ప్యాకేజీ, ఇళ్ల కేటాయింపులో అవినీతి రాజ్యమేలుతోంది. అసలైన నిర్వాసితులకు మొండిచెయ్యి చూపిస్తున్నారు. గ్రామాల్లో ఏ గుర్తింపు లేని వారికి ఇళ్లు, ప్యాకేజీ ఇచ్చారు. అన్ని ఉండి గ్రామంలో ఉన్న వారికి మాత్రం పరిహారం అందించేందుకు నిరాకరిస్తున్నారు. నిర్వాసిత గ్రామాలకు చెందిన మాజీ, తాజా ప్రజాప్రతినిధులు, అధికారులతో కుమ్మక్కై అసలైన లబ్ధిదారులను నిండా ముంచుతున్నారు.


పక్కదారి పట్టిన ప్యాకేజీ, ఇళ్ల కేటాయింపు

మల్లన్నసాగర్‌ ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలో ఒక్కో గ్రామానికి పదుల సంఖ్యలో పక్కదారి పట్టాయి. మాజీ, తాజా ప్రతినిధులు కుమ్మక్కై అధికారులతో మాట్లాడుకుని వారి వారి అనుయాయులకు ఇప్పించుకుని వాటాలు పంచుకున్నారు. గజ్వేల్‌ డివిజన్‌ పరిధిలోని సింగారం, ఎర్రవల్లి గ్రామాలకు చెందిన దాదాపు 40 నుంచి 45 మంది అర్హులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, ఇళ్లు అందకపోగా గ్రామానికి సంబంధం లేని వ్యక్తులు ప్యాకేజీతో పాటు ఇళ్లును పొందారు. గ్రామంలో ఇళ్లు, భూమి ఉండి అన్ని గుర్తింపు కార్డులు ఉన్న యజమాని ఇంటిపై ప్యాకేజీ నంబర్‌ వేసినా పరిహారం మాత్రం ఇవ్వడం లేదు. వీరి పేరుపై బయటి వ్యక్తులకు అందించారు.  

కొండపాక మండలం సింగారం గ్రామంలో తల్లి పెరిట ఉన్న ఎస్‌కేఎంఎస్‌ నంబర్‌ను కొడుకు పేరుపై వేసి ఇళ్లు, ప్యాకేజీని కేటాయించారు. తల్లి ఒంటరి మహిళ కావడంతో ఆర్‌అండ్‌ఆర్‌ అందలేదు. ఒంటరి మహిళలకు ఇళ్లు, ప్యాకేజీ ఇచ్చే విషయం కోర్టులో ఉండడంతో ప్రభుత్వం వారికి ఆర్‌అండ్‌ఆర్‌ను నిలిపివేసింది. అయితే మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌తో సంబంధం లేని కొమురవెళ్లి మండలంలోని ఓ గ్రామపంచాయతీలో పనిచేస్తున్న వ్యక్తికి ఇక్కడ ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీని అధికారులు అందజేశారు. ఇలానే హైద్రాబాద్‌లో ఉంటూ అక్కడే గుర్తింపు కార్డులున్న వారికి ప్యాకేజీతో పాటు ఇళ్లను కేటాయించారు. ఇతర రాష్ట్రానికి చెందిన మౌలానా అనే వ్యక్తికి ప్యాకేజీని ఇచ్చిన అధికారులు, గ్రామంలో ఉంటూ పూజలు చేసుకుంటున్న పూజారికి మాత్రం నిరాకరించారు. 


ఎర్రవల్లిలో 25 మంది, సింగారంలో 10 మంది అనర్హులకు

మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాలైన ఎర్రవల్లి, సింగారం గ్రామాలకు చెందిన దాదాపు 35 మంది అనర్హులకు ప్యాకేజీ, ఇళ్లు అందించారు. గ్రామానికి చెందిన బడా నేతలు ఒక్కో లబ్ధిదారుని వద్ద రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల చొప్పున వసూలు చేసినట్లు తెలిసింది. సింగారం గ్రామానికి చెందిన మహ్మద్‌ హుస్సేన్‌ ఇంటిపై ఇద్దరికి ఎస్‌కేఎంఎస్‌ నంబర్‌ వేసి ప్యాకేజీ, ఇళ్లను అందించారు. కానీ పాపం హుస్సేన్‌కు మాత్రం ప్యాకేజీలో చోటుదక్కలేదు. గ్రామానికి చెందిన భూనిర్వాసితులకు చెందిన స్థిరాస్తి, చెక్కుల విషయంలో తమకు మామూళ్లు ఇస్తే త్వరగా ఇప్పిస్తామని గ్రామ పెద్దలుగా చెప్పుకునే వారు వసూళ్లకు దిగుతున్నట్లు తెలిసింది. ఈ రెండు గ్రామాల్లోనే దాదాపుగా రూ.2 కోట్ల వరకు ఇప్పటికే వసూళ్లు చేసినట్లు నిర్వాసితులు పేర్కొన్నారు.


అనర్హులకు అందితే రికవరీ చేస్తాం

అర్హులైన లబ్ధిరులకు కచ్చితంగా న్యాయం చేస్తాం. అనర్హులకు అందినట్లు మా విచారణలో తేలితే చట్టరీత్యా రీకవరీ చేయడంతో పాటు ఇళ్లు, ప్లాట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తాం. క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం. ఇటీవల ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి భూనిర్వాసితుల నుంచి ప్యాకేజీలు, ఇళ్ల విషయమై దరఖాస్తులను స్వీకరించాం. వారిలో లబ్ధిదారులను గుర్తించి త్వరలోనే అందజేస్తాం. భూనిర్వాసితుల విషయంలో ఎలాంటి తప్పిదాలకు చోటివ్వం. అంతేకాకుండా నిష్పక్షపాతంగా భూనిర్వాసితులకు రావాల్సిన పరిహారాలను అందజేస్తాం. ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వాల్సిన పనిలేదు. 

- విజయేందర్‌రెడ్డి, ఆర్డీవో, గజ్వేల్‌Advertisement
Advertisement