Abn logo
Apr 13 2021 @ 01:28AM

తరలించేస్తున్నారు!

కాకినాడ సీబీఎస్‌ఈ చెన్నై రీజనల్‌ కార్యాలయంలో విలీనం

సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ ఇక్కడ అవసరం లేదట

పంతం నెగ్గించుకుంటున్న ఉత్తరాది రాష్ట్రాల నేతలు

అయినా నోరు మెదపని తెలుగు రాష్ట్రాల ఎంపీలు

ఏపీలో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు ఉండడాన్ని ఉత్తరాది రాష్ట్రాల  ప్రజాప్రతినిధులు, బడా పారిశ్రామికవేత్తలు ఒక పట్టాన జీర్ణించుకోలేరు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇక్కడి నుంచి వాటిని తరలించుకుపోవాలని చూస్తూనే వుంది. ఈ క్రమంలో పెట్రో                                  కారిడార్‌, లాజిస్టిక్‌, ఐటీ హబ్‌లు రానీయుండా తెర వెనుక నుంచి కుట్రలు చేస్తునే ఉందనే విమర్శలూ ఉన్నాయి. ఈ క్రమంలోనే కాకినాడలో వున్న సీబీఎస్‌ఈ (సీవోఈ) కార్యాలయ తరలింపునకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం...

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

యూపీఏ హయాంలో కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన కాకినాడ ఎంపీ ఎంఎం పళ్లంరాజు వ్యక్తిగత శ్రద్ధతో 2014 ఫిబ్రవరిలో కాకినాడ గాంధీనగర్‌లో సెంట్రల్‌ బోర్టు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) పరిధిలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సెలెన్సీ (సీవోఈ)ని తీసుకువచ్చారు. దీనిని 2018లోనే తరలించడానికి కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖ ప్రయత్నించగా తెలంగాణ, ఏపీ ఎంపీలు ప్రతిఘటించారు. అప్పట్లో దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం రావడంతో తరలింపునకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. మళ్లీ ఇప్పుడు దీని తరలింపు తప్పదని, ఈ ఏడాది జూన్‌ నెలాఖరు నాటికి సీబీఎస్‌ఈ చెన్నై రీజనల్‌ కార్యాలయంలో విలీనం చేస్తున్నామని ఇటీవల ఈ కార్యాలయానికి ఉత్తర్వు జారీ అయ్యింది. ఇక్కడ పనిచేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని తొలగించి, పర్మినెంట్‌ ఉద్యోగులు ముగ్గురిని బెంగళూరు బదిలీ చేస్తూ ఆ ఆదేశాల్లో పేర్కొంది. దీంతో ఏపీకి తలమానికమైన శిక్షణ విద్యా సంస్థ తరలిపోతుండడంపై జిల్లా మేధావి వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఉమ్మడి ఏపీలో 2014 ఫిబ్రవరిలో ఏర్పాటుచేసిన సీవోఈ తరలింపునకు కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ కార్యాలయాధికారులను తట్టబుట్ట సర్దుకోవాలని సర్క్యులర్‌ జారీ చేసింది. చెన్నైలో ఉన్న సీబీఎస్‌ఈ ప్రాంతీయ కార్యాలయం (రీజనల్‌ ఆఫీస్‌)లో దీనిని విలీనం చేస్తున్నట్టు ప్రకటించింది. కాకినాడ సీవోఈ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని ఆ శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌కు ఉత్తరాది రాష్ట్రాల నేతలు నూరిపోశారని ప్రచారం జరుగుతోంది. అయితే ఉత్తరాదికి తరలిస్తే ఆ నేతల పన్నాగంపై అనుమానాలు వ్యక్తమవుతాయని సదరు మంత్రిత్వ శాఖ భావించింది. మధ్యే మార్గంగా దక్షిణాదిలోనే దీనిని ఉంచేలా చెన్నై రీజనల్‌ కార్యాలయంలో విలీనం చేయడానికి మంత్రి సమ్మతించారని సమాచారం. ఇంత జరుగుతున్నా తెలుగు రాష్ట్రాల ఎంపీలు నోరు మెదపకపోవడం గమనార్హం.

  ఆరు రాష్ట్రాలకు ఇదొక్కటే 

 కాకినాడలో సీవోఈ వచ్చాక తొలుత ఒడిసా, ఏపీ, తెలంగాణ మూడు రాష్ట్రాల పరిధిలో సీబీఎస్‌ఈ విద్యాలయాల్లో 10, 11, 12 తరగతులు బోధిస్తున్న సబ్జెక్టు టీచర్లకు మూడు నెలలకొకసారి బోధనాంశాల్లో వస్తున్న మార్పులపై నిపుణులతో మూడు రోజుల పాటు శిక్షణ ఇచ్చేవారు. పై మూడు రాష్ట్రాల్లో ఉత్తమ ఫలితాలు వస్తుండడంతో కర్ణాటక, పుదుచ్చేరి, అండమాన్‌ అండమాన్‌ నికోబార్‌ దీవులకు చెందిన సీబీఎస్‌ఈ పాఠశాలల అసోసియేషన్లు తమ ప్రాంతాల్లో సీవోఈ ఏర్పాటు చేయాలని వారి ఎంపీల ద్వారా కేంద్రానికి వినతులు పంపారు. దీంతో ఆ రాష్ట్రాల ఫ్యాకల్టీలు కూడా కాకినాడ సీవోఈలో శిక్షణ తీసుకోవడానికి కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆమోద ముద్ర వేసింది. 

అధిక ప్రాధాన్యం 

ఆరు రాష్ట్రాలకు ఇదొక్కటే శిక్షణ సంస్థ కావడంతో అధిక ప్రాధాన్యం ఏర్పడింది. 800 సీబీఎస్‌ఈ పాఠశాలల నుంచి 5 వేల మంది వరకు వివిధ సబ్జెక్టు టీచర్లు శిక్షణ పొందడానికి కాకినాడ వచ్చేవారు. అయితే ఒకేసారి అన్ని సబ్జెక్టు టీచర్లకు కాకుండా... ఒక్కో సబ్జెక్టుపై బ్యాచ్‌ల వారీగా అధ్యాపకులకు శిక్షణ ఇస్తూ వస్తున్నారు. ఒక్కో బ్యాచ్‌కు 80 నుంచి 100 మంది అధ్యాపకులు వారి రాష్ట్రాల నుంచి శిక్షణకు వస్తున్నారు. క్రమంగా ప్రతీ మూడు నెలలకు ఆరు రాష్ట్రాల్లో ఏదో ఒక రాష్ట్రంలో ఒక సీబీఎస్‌ఈ స్కూల్‌ను ఎంచుకుని అధ్యాపకులను అక్కడకు రప్పించి శిక్షణ ప్రారంభించారు. దీంతో కాకినాడలో కార్యకలాపాలు తగ్గుముఖం పట్టినా పర్యవేక్షణ మాత్రం ఇక్కడి నుంచే జరుగుతోంది. కొవిడ్‌ కారణంగా ఏడాదిన్నర నుంచి ఆన్‌లైన్‌లో శిక్షణ ఇప్పిస్తున్నారు.    


Advertisement
Advertisement
Advertisement