Abn logo
Apr 16 2021 @ 01:44AM

విశాఖ నుంచి ఆక్సిజన్‌, వెంటిలేటర్లు

  • నాగ్‌పూర్‌ ఆస్పత్రులకు అందజేస్తాం: గడ్కరీ
  • ఆక్సిజన్‌ పంపండి.. ప్రధానికి మహారాష్ట్ర లేఖ


నాగ్‌పూర్‌/న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 15: మహారాష్ట్రలో రోజురోజుకూ కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి ఆక్సిజన్‌, వెంటిలేటర్లను తెప్పిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు. ‘‘నాగ్‌పూర్‌లో పరిస్థితిని అదుపు చేసేందుకు విశాఖ నుంచి 40 టన్నుల ఆక్సిజన్‌ను తెప్పిస్తున్నాం. వెంటిలేటర్లను కూడా విశాఖలోని మెడికల్‌ డివైజ్‌ పార్క్‌ నుంచి సరఫరా చేయిస్తున్నాం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.


గురువారం ఆయన నాగ్‌పూర్‌లోని జాతీయ కేన్సర్‌ కేంద్రంలో 100 పడకల కొవిడ్‌ వార్డులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెమ్‌డెసివిర్‌ తయారీ అనుమతులు ప్రస్తుతం నాలుగు కంపెనీలకే ఉన్నాయని, డిమాండ్‌కు తగ్గట్లుగా ఉత్పత్తిని పెంచేందుకు మరో ఎనిమిది కంపెనీలకు అనుమతి ఇచ్చామని చెప్పారు. కొవిడ్‌-19 క్రియాశీల కేసుల సంఖ్య ఈ నెలాఖరుకు రెట్టింపు కానుందని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కొవిడ్‌ ఆస్పత్రుల్లో ప్రస్తుతం రోజుకు 12 వందల మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ వినియోగం జరుగుతోందని.. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రోజుకు 2 వేల మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేయాలని కోరారు. అందుకోసం వైమానిక దళ సేవలను ఉపయోగించుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు గురువారం ప్రధాని నరేంద్ర మోదీకి ఓ లేఖ రాశారు.


మరోవైపు, మహారాష్ట్రకు రిలయెన్స్‌ ఇండస్ట్రీస్‌ తరఫున 100 టన్నుల ప్రాణవాయువును అందజేస్తామని ముఖేశ్‌ అంబానీ ప్రకటించారు. జామ్‌నగర్‌లోని రిలయెన్స్‌ జంట రిఫైనరీల వద్ద ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్‌ ప్లాంట్‌ నుంచి ఈ మొత్తాన్ని వితరణ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.


కాగా.. ఢిల్లీలో నమోదవుతున్న కొవిడ్‌ కేసుల్లో 65% మంది బాధితులు యువకులేనని.. వ్యాక్సిన్‌పై వయోపరిమితిని తొలగించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కేంద్రాన్ని కోరారు. గురువారం ఆయన ప్రధానికి రాసిన లేఖలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఒకవైపు కరోనా టీకాల కొరత పలు రాష్ట్రాలను వేధిస్తుంటే.. టీకా ఉత్సవ్‌ను ఎలా నిర్వహిస్తారని, అదంతా కేంద్రం అబద్దాల టీకా పండుగ అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శించారు. 


మొదటి డోసు కొవాగ్జిన్‌.. తర్వాత కొవిషీల్డ్‌

కొవిడ్‌ వ్యాక్సిన్లు ఇవ్వడంలో అప్రమత్తంగా ఉండాల్సిన వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఒక వ్యక్తికి రెండు డోసుల్లో వేర్వేరు వ్యాక్సిన్లు ఇచ్చిన ఘటన యూపీలోని మహరాజ్‌గంజ్‌ జిల్లాలో వెలుగుచూసింది. కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్న ఉమేష్‌ అనే వ్యక్తికి రెండో డోసుగా కొవిషీల్డ్‌ ఇచ్చారు. అయితే రెండు వ్యాక్సిన్లు ఇవ్వడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదని చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ ఏకే శ్రీవాస్తవ స్పష్టం చేశారు.


మరోవైపు, యూపీలోని షమ్లీ జిల్లాలో ముగ్గురు వయోవృద్ధులైన మహిళలకు ఇటీవల కొవిడ్‌ వ్యాక్సిన్‌కు బదులు యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌ ఇచ్చిన ఘటనకు సంబంధించి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలోని ఒక ఫార్మాసి్‌స్టపై వేటు పడింది. మరొకరిని సస్పెండ్‌ చేశారు. కాగా, కరోనా సోకిన వ్యక్తికి రక్తం గడ్డకట్టే ముప్పు సాధారణ వ్యక్తి కన్నా 100 రెట్లు, టీకా వేసుకున్న వారికన్నా 8-10 రెట్లు అధికమని లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ జరిపిన ఓ అధ్యయనంలో తేలింది.


Advertisement
Advertisement
Advertisement