కొవిడ్‌ తగ్గినా కోటి తిప్పలా..?

ABN , First Publish Date - 2022-08-23T16:31:21+05:30 IST

కొవిడ్‌ పుణ్యమా అని పోషకాల మీద మనందరికీ అవగాహన పెరిగింది. మునుపెన్నడూ వినని ‘జింక్‌’ లాంటి ఖనిజ లవణాలతో

కొవిడ్‌ తగ్గినా కోటి తిప్పలా..?

కొవిడ్‌ పుణ్యమా అని పోషకాల మీద మనందరికీ అవగాహన పెరిగింది. మునుపెన్నడూ వినని ‘జింక్‌’ లాంటి ఖనిజ లవణాలతో పాటు  ‘డి’ విటమిన్‌ లాంటి కొన్ని కీలకమైన పోషకాల విలువలను తెలుసుకున్నాం. అయితే కొవిడ్‌ తదనంతరం తలెత్తే నీరసం, నిస్సత్తువ లాంటి ఇబ్బందులను ఆయా మల్టీ విటమిన్‌, బికాంప్లెక్స్‌ సప్లిమెంట్లతో ఎవరికి వారు భర్తీ చేసుకోవడం సరి కాదంటున్నారు వైద్యులు. సొంత వైద్యంలో కొంత చేటు దాగి ఉంటుందని హెచ్చరిస్తున్నారు!


కొవిడ్‌ వదిలి వెళ్లినా, నీరసం, నిస్సత్తువ, బలహీనతలు వదలకుండా వేధిస్తున్నాయి. ఒళ్లు నొప్పులు, మతిమరుపు, తిమ్మిర్లు.. ఇలాంటి ఇబ్బందులు కూడా దీర్ఘకాలం పాటు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇందుకు కారణం కొవిడ్‌ తదనంతరం సహజంగానే శరీరంలో విటమిన్‌ డి, బి12 లోపాలు చోటుచేసుకోవడమే! అలాగే కొవిడ్‌ నుంచి కోలుకున్న వాళ్లలో పోషకాల శోషణ కూడా కుంటుపడుతుంది. దాంతో ఎంత బలవర్ధకమైన ఆహారం తీసుకుంటున్నప్పటికీ, పోషకాల శోషణ జరగక, పోషక లోపం ఏర్పడుతుంది. అలాగే శరీరంలో పోషకాల నిల్వలు తక్కువగా ఉన్నవాళ్లకూ, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నవాళ్లకూ, మెటబాలిజం ఎక్కువగా ఉన్నవాళ్లకూ సరిపడా ఆహారం తీసుకోకపోవడం వల్ల ప్రొటీన్‌ నష్టం కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకొందర్లో మైక్రో న్యూట్రియంట్ల లోపం ఏర్పడుతుంది. ఎక్కువ మంది కొవిడ్‌ రోగుల్లో విటమిన్‌ డి, సెలీనియం, విటమిన్‌ బి1, విటమిన్‌ బి6, బి12 లోపాలు కూడా ఉంటూ ఉంటాయి.


లోపాన్ని బట్టి లక్షణాలు... 

కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌తో శరీరం ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌లోకి చేరుకుంటుంది. కాబట్టి బి-కాంప్లెక్స్‌ విటమిన్లు, ఖనిజలవణాల లోపంతో పాటు, విటమిన్‌ ఇ, డి, ఎ, గ్లూటాథయోన్‌ మొదలైన పోషకాల లోపం కూడా ఏర్పడుతుంది. అయితే ఈ లోపాలన్నీ వేర్వేరు లక్షణాలలో బయల్పడతాయి. సాధారణంగా ఎలాంటి నలత తలెత్తినా, మల్టీవిటమిన్‌ మాత్రలను ఆశ్రయిస్తూ ఉంటాం. కానీ తలెత్తిన లక్షణం ఆధారంగా, పోషక లోపాన్ని కనిపెట్టి, ఆ పోషకాన్నే తీసుకోవలసి ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా కొవిడ్‌ మూలంగా శరీరంలో తలెత్తే ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ వల్ల మొదలయ్యే లక్షణాలు, పోస్ట్‌ కొవిడ్‌ లక్షణాలూ ఒకేలా ఉంటాయి. కాబట్టి లక్షణాల అసలు కారణాన్ని కనిపెట్టి, సరిదిద్దుకోవాలి. బలహీనత, నిస్సత్తువ, చిన్న పనికే అలసిపోవడం లాంటివి పోస్ట్‌ కొవిడ్‌లో సాధారణంగా కనిపించే లక్షణాలు. ఇవి కాకుండా విటమిన్‌ స్పెసిఫిక్‌ లక్షణాలు మొదలవుతూ ఉంటాయి. అవేంటంటే... 

విటమిన్‌ బి12: తిమ్మిర్లు, మతిమరుపు, డల్‌నెస్‌

విటమిన్‌ డి: కండరాల నొప్పులు, ఎముకల నొప్పులు, మయాల్జియాలు, ఇమ్యూనిటీ సంబంధిత ఇన్‌ఫెక్షన్లు

విటమిన్‌ సి: చర్మం మీద ఎర్రని మచ్చలు, చిగుళ్ల నుంచి రక్తస్రావం 




అసలు కారణాన్ని కనిపెట్టి...

పోస్ట్‌ కొవిడ్‌ లక్షణాలు విడివిడిగా, లేదా కలిసి వేధిస్తూ ఉండవచ్చు. అయితే ఈ లక్షణాలన్నిటినీ పోస్ట్‌ కొవిడ్‌కు ఆపాదించకుండా, ఇతరత్రా శారీరక రుగ్మతలు లేవని పరీక్షలతో నిర్ధారించుకోవడం అవసరం. ఇందుకోసం అవసరాన్ని బట్టి వైద్యులు రక్తపరీక్షతో పాటు కాలేయ, మూత్రపిండాలు, థైరాయిడ్‌, షుగర్‌ పరీక్షలను సూచిస్తారు. వాటి ఫలితాలు, పూర్వం నుంచీ వాడుతున్న మందుల ఆధారంగా పోస్ట్‌ కొవిడ్‌ లక్షణాల అసలు కారణాన్ని వైద్యులు కనిపెడతారు. పోషక లోపం కారణమని తేలితే, నిర్దిష్ట పోషక లోపాన్ని గుర్తించి, సరిదిద్దే చికిత్సను సూచిస్తారు. 


పోషక శోషణ కుంటుపడితే...

పోస్ట్‌ కొవిడ్‌లో సరైన పోషకాహారం తీసుకున్నంత మాత్రాన, పోషకాలన్నీ శరీరానికి అందుతాయనే నమ్మకం లేదు. కొందర్లో పోషక శోషణ కుంటుపడుతుంది. ఇంకొందర్లో డయేరియా కారణంగా పోషక నష్టం జరుగుతూ ఉంటుంది. కాబట్టి శోషణ మెరుగ్గా ఉండాలంటే, పరిశుభ్రమైన, సమతుల ఆహారం తీసుకోవాలి. ఒకవేళ ఈ ఆహారంతో కూడా పోషక భర్తీ జరగక, పూర్వపు లక్షణాలు కొనసాగితే, సప్లిమెంట్లను తీసుకోక తప్పదు. సప్లిమెంట్లలో పోషకాలు రెండింతలుగా ఉంటాయి కాబట్టి, శోషణ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 




యాంటీబయాటిక్స్‌ చేటు

చిన్నపాటి ఇన్‌ఫెక్షన్లకు యాంటీబయాటిక్స్‌ వాడే అలవాటు వల్ల పేగుల్లోని మంచి బ్యాక్టీరియా తగ్గిపోతుంది. దాంతో పోషక శోషణ తగ్గడంతో పాటు, పేగుల సామర్థ్యం కూడా తగ్గుతుంది. తిరిగి పేగులు ఆరోగ్యంగా మారి, పూర్వపు సామర్ధ్యాన్ని పుంజుకోవాలంటే మంచి బ్యాక్టీరియా సంఖ్యను పెంచుకోవాలి. అందుకోసం పెరుగు తీసుకోవాలి. వైద్యుల సూచన మేరకు ప్రొబయాటిక్‌ మందులు వాడుకోవాలి. కొందర్లో వాంతులు, విరోచనాలు సుదీర్ఘంగా వేధిస్తూ ఉంటాయి. ఇలాంటి వాళ్లు సమస్య అదుపులోకి వచ్చేవరకూ పాల వాడకం మానేయాలి. అలాగే ప్రతి చిన్న రుగ్మతకూ యాంటీబయాటిక్స్‌ వాడకం మానేయాలి. 


సొంత వైద్యం ముప్పు 

కొవిడ్‌ సోకి, చికిత్సతో పూర్తిగా కోలుకున్నవాళ్లు లేదా ఎసింప్టమాటిక్‌ కొవిడ్‌కు గురైన వాళ్లు, పోస్ట్‌ కొవిడ్‌లో భాగంగా ఎటువంటి చిన్న అస్వస్థత తలెత్తినా వైద్యుల దృష్టికి తీసుకువెళ్లడం అవసరం. చిన్న చిన్న అస్వస్థతలన్నీ కేవలం విటమిన్‌ లోపం, మినరల్‌ లోపం, ప్రొటీన్‌ లోపాలకు మాత్రమే సూచనలు కావు. ఇతరత్రా ఆరోగ్య సమస్యల్లోనూ ఇవే లక్షణాలు కనిపిస్తాయి. ఉదాహరణకు అనీమియాకు కారణమైన హిమోగ్లోబిన్‌ లోపం తలెత్తితే, అందుకు హిమోగ్లోబిన్‌ తయారీలో సమస్య ఉండవచ్చు, లేదా తయారైన హిమోగ్లోబిన్‌ ప్రసరణలో సమస్య ఉండవచ్చు లేదా హిమోగ్లోబిన్‌ నష్టం జరుగుతూ ఉండవచ్చు. ఈ కారణాలన్నీ అనీమియాకు దారితీస్తాయి. కాబట్టి ఐరన్‌ తక్కువ ఉందని మందుల షాపుల్లో దొరికే ఐరన్‌ మాత్రలు వాడుకుంటే, సమస్య పరిష్కారం కాకపోవచ్చు. అనీమియాకు విటమిన్‌ డి, బి12 లోపాలు, దీర్ఘకాల ఇన్‌ఫ్లమేషన్‌ కూడా కారణాలుగా ఉంటూ ఉంటాయి. 


ఓవర్‌ డోస్‌ అయితే... 

విటమిన్‌, మినరల్‌ సప్లిమెంట్లు దీర్ఘకాల మందులు కావు. దీర్ఘకాలం తీసుకోవడం వల్ల శరీరంలో టాక్సిసిటీ పెరుగుతుంది. కాబట్టి వీటిని వైద్యుల సూచన మేరకు, పరిమిత కాలమే వాడుకోవాలి. 

విటమిన్‌ ఎ, డి, ఇ, కె: ఇవి విటమిన్‌ బి12లా వాటర్‌ సాల్యుబుల్‌ విటమిన్లు కావు. కాబట్టి శరీరం నుంచి తేలికగా బయటకు వెళ్లే గుణం వీటికి ఉండదు. దాంతో ఇవి అంతర్గత అవయవాల్లో పేరుకుపోయి, ఆరోగ్య సమస్యలను తెచ్చి పెడతాయి. 

విటమిన్‌ డి: ఈ విటమిన్‌ తక్కువైతే ఎలా ఒళ్లు నొప్పులు వేధిస్తాయో, ఎక్కువైనా అంతే సమానంగా ఒళ్లు నొప్పులు బాధిస్తాయి. అలాగే ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేయవలసి రావడం లాంటి ఇబ్బందులు కూడా తలెత్తుతాయి. 

ఐరన్‌: అవసరానికి మించి తీసుకుంటే, కాలేయంలో పేరుకుని కాలేయ సమస్యలు మొదలవుతాయి. క్లోమంలో పేరుకుని మధుమేహ సమస్య మొదలవుతుంది. 




చిన్నపాటి ఇన్‌ఫెక్షన్లకు యాంటీబయాటిక్స్‌ వాడే అలవాటు వల్ల పేగుల్లోని మంచి బ్యాక్టీరియా తగ్గిపోతుంది. దాంతో పోషక శోషణ తగ్గడంతో పాటు, పేగుల సామర్థ్యం కూడా తగ్గుతుంది. తిరిగి పేగులు ఆరోగ్యంగా మారి, పూర్వపు సామర్ధ్యాన్ని పుంజుకోవాలంటే మంచి బ్యాక్టీరియా సంఖ్యను పెంచుకోవాలి. 


నాడీ సంబంధ లక్షణాలతో... 

పోస్ట్‌ కొవిడ్‌లో కొందర్లో మతిమరుపు, మెంటల్‌ ఫెటీగ్‌, తలనొప్పి, నిద్రలేమి, కళ్లు తిరగడం, తిమ్మిర్లు, వాసన, రుచి కోల్పోవడం, యాంగ్జయిటీ, డిప్రెషన్‌ లాంటి లక్షణాలు కూడా దీర్ఘకాలం పాటు ఉంటాయి. వీటిని తగ్గించే చికిత్సను అందించి, పోస్ట్‌ కొవిడ్‌ దశ నుంచి బయటకొచ్చేలా వైద్యులు సహాయపడతారు. తిమ్మిర్లకు లైరికా, ప్రీగాబ్లిన్‌ మందులతో, నిద్రలేమిని రెస్టిల్‌ లాంటి మందులతో వైద్యులు చికిత్సను అందిస్తారు. ఇలా సింప్టమాటిక్‌ చికిత్స తీసుకుంటూనే సరిపడా హైడ్రేషన్‌, న్యూట్రిషన్‌ నియమాలు పాటించాలి. అలాగే కంటి నిండా నిద్రపోవాలి. అలాగే హృద్రోగులు, మధుమేహులు వారివారి ఆహార నియమాలను పాటిస్తూ, అవసరమైన మందులు వాడుకుంటూ పోస్ట్‌ కొవిడ్‌ చికిత్సను కూడా కొనసాగించాలి. 


-డాక్టర్‌ జి.నవోదయ

కన్సల్టెంట్‌ జనరల్‌ మెడిసిన్‌, కేర్‌ హాస్పిటల్స్‌, బంజారాహిల్స్‌, హైదరాబాద్‌



Updated Date - 2022-08-23T16:31:21+05:30 IST