ఈ ఏడాది చివరి నాటికి.. 4 కోట్ల డోసులు

ABN , First Publish Date - 2020-10-29T06:36:16+05:30 IST

ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ ‘కొవిషీల్డ్‌’ డిసెంబరులోగా మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని సీరం

ఈ ఏడాది చివరి నాటికి.. 4 కోట్ల డోసులు

అమెరికాకు వ్యాక్సిన్‌ పంపిణీ 

చేస్తామన్న ఫైజర్‌ ఫార్మా

డిసెంబరుకల్లా ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌

ప్రకటించిన సీరం ఇన్‌స్టిట్యూట్‌

అమెరికాకు 4 కోట్ల ఫైజర్‌ డోసులు


పుణె, అక్టోబరు 28: ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ ‘కొవిషీల్డ్‌’ డిసెంబరులోగా మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) సీఈవో అధర్‌ పూనావాలా ప్రకటించారు. అయితే.. బ్రిటన్‌లో కొవిషీల్డ్‌తో జరుగుతున్న చివరి దశ ప్రయోగ ఫలితాలు, దేశంలో డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) నుంచి అనుమతులు లభించే తీరుతెన్నులపై వ్యాక్సిన్‌ విడుదల ఆధారపడి ఉంటుందన్నారు. ఒకవేళ ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు వస్తే.. అత్యవసర ప్రాతిపదికన వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు దరఖాస్తు చేసుకుంటామని ఆయన వెల్లడించారు. బ్రిటన్‌లో జరుగుతున్న ప్రయోగ పరీక్షల్లో వృద్ధులు, యువకులపైనా కొవిషీల్డ్‌ ప్రభావవంతంగా పనిచేస్తోందంటూ వచ్చిన నివేదికలను తీపి కబురుగా పూనావాలా అభివర్ణించారు. కొవిషీల్డ్‌ను ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ, ఆస్ట్రాజెనెకా కంపెనీలు సంయుక్తంగా అభివృద్ధిచేశాయి. పరిస్థితులన్నీ అనుకూలిస్తే.. ఈ ఏడాది చివరి నాటికి 4 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్‌ను అమెరికాకు సరఫరా చేస్తామని ఫైజర్‌ ఫార్మా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అల్బర్ట్‌ బౌర్లా వెల్లడించారు.


ఈ ఏడాది చివరి నాటికి 4 కోట్ల డోసులు, 2021 మార్చి నాటికి మరో 10 కోట్ల డోసుల ఫైజర్‌ వ్యాక్సిన్‌ను సరఫరా చేసేందుకు అమెరికా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నామని ఆయన తెలిపారు. నవంబరు మూడో వారానికంతా వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగానికి అందుబాటులో ఉంచుతామని తాము ఇంతకుముందు చెప్పిన దానికి కట్టుబడి ఉన్నామని, ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన వివరించారు. కాగా, ఈ ఫార్మా దిగ్గజ సంస్థ.. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో అతి తక్కువ లాభాలతోనే సరిపెట్టుకుంది.


తొలుత మార్కెట్లోకి విడుదలయ్యే కరోనా వ్యాక్సిన్లు ప్రభావవంతంగా పనిచేయకపోవచ్చని బ్రిటన్‌ ప్రభుత్వ వ్యాక్సిన్‌ టాస్క్‌ఫోర్స్‌కు నేతృత్వం వహిస్తున్న కేట్‌ బింగ్‌హాం వ్యాఖ్యానించారు. అవి అందరిపైనా ఒకేస్థాయిలో పనిచేయకపోవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. ఈమేరకు కీలక వ్యాఖ్యలతో ‘ది లాన్సెట్‌’ జర్నల్‌కు కేట్‌ ప్రత్యేక వ్యాసం రాశారు. ‘‘కరోనాకు వ్యాక్సిన్‌ వస్తుందో.. రాదో.. మనకు స్పష్టంగా తెలియదు. చాలావరకు లేదా అన్ని ప్రయోగాత్మక కొవిడ్‌ వ్యాక్సిన్లు పనిచేయకపోవచ్చు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ విడుదలపై భారీ అంచనాలను పెంచుకోవడం మంచిది కాదు. ఒకవేళ వ్యాక్సిన్‌ వచ్చినా దానివల్ల కొంతమేర ఇన్ఫెక్షన్‌ అదుపులోకి రావచ్చు.. కానీ పూర్తిగా కరోనా తగ్గకపోవచ్చు. అందరూ ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే మానసికంగా సంసిద్ధులు కావాలి’’ అని కేట్‌ బింగ్‌హాం పేర్కొన్నారు. 65 ఏళ్లకు పైబడిన వారిలో కరోనాను తిప్పికొట్టేలా రోగ నిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేయడమే ప్రధాన లక్ష్యంగా వ్యాక్సిన్ల ప్రయోగ పరీక్షలు జరుగుతున్నాయని ఆమె వెల్లడించారు.

Updated Date - 2020-10-29T06:36:16+05:30 IST