నకిలీ లౌకికవాదులకు గులామీ చేయొద్దు: ఓవైసీ

ABN , First Publish Date - 2022-02-11T22:44:07+05:30 IST

మేం ఎవరి ఓట్లు చీల్చడం లేదు. ఎవరికి ఓట్లు దోచి పెట్టడం లేదు. మా ఓట్లు మేం వేసుకుంటున్నాం. మా గొంతుకను మేం బలపర్చుకుంటున్నాం. తెలంగాణలో మాకు ఎడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ ఎమ్మెల్యేలతోనే తెలంగాణలోని మైనారిటీలకు విద్య, వైద్యంలో అనేక వసతులు కల్పించగలిగాం..

నకిలీ లౌకికవాదులకు గులామీ చేయొద్దు: ఓవైసీ

లఖ్‌నవూ: లౌకికవాదులనే చెప్పుకునే పార్టీలు ముస్లింలను ఉపయోగించుకుని వదిలేశాయని, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ హిందుత్వకు భయపడి మైనారిటీల హక్కుల గురించి కనీసం మాటైనా మాట్లాడటం లేదని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ బహుజన్‌ సమాజ్‌ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.


‘‘ఒక్కో వర్గానికి ఒక్కో నేత ఉన్నారు. యాదవులకు అఖిలేష్ నాయకుడు, దళితులకు మాయావతి అధినేత. అలాగే అన్ని వర్గాలకు ఆయా నేతలు ఉన్నారు. మరి ముస్లింలకు ఎవరు ఉన్నారు. నా పేరు తీయకండి. నేను కాదు. ఇంటికి వెళ్లిన తర్వాత ఆలోచించండి మీ నాయకుడు ఎవరని’’ అని ఓవైసీ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘బీఎస్పీ, ఎస్పీలు లౌకికవాదులమని ఇన్ని రోజులు మనల్ని మభ్య పెట్టాయి. వాళ్లు నకిలీ లౌకికవాదులు. ఇంకా వారికి గులాం చేయనక్కర్లేదు. మన హక్కుల కోసం, మన వాటా కోసం మనమే పోరాడాలి’’ అని అన్నారు.


అయితే ఓవైసీ ఓట్లు చీల్చి బీజేపీకి పరోక్షంగా లాభం చేకూరుస్తున్నారని బీఎస్‌పీ అధినేత మాయావతి చేసిన వ్యాఖ్యలను ఓవైసీ ఖండించారు. ‘‘మేం ఎవరి ఓట్లు చీల్చడం లేదు. ఎవరికి ఓట్లు దోచి పెట్టడం లేదు. మా ఓట్లు మేం వేసుకుంటున్నాం. మా గొంతుకను మేం బలపర్చుకుంటున్నాం. తెలంగాణలో మాకు ఎడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ ఎమ్మెల్యేలతోనే తెలంగాణలోని మైనారిటీలకు విద్య, వైద్యంలో అనేక వసతులు కల్పించగలిగాం. ప్రభుత్వంతో మాట్లాడి మైనారిటీ వాటా తీసుకున్నాం. యూపీలో 10 సీట్లు గెలిచినా చాలు. ఎంఐఎం చేయాలనుకున్న పనిని చేసి చేపిస్తది’’ అని ఓవైసీ అన్నారు.

Updated Date - 2022-02-11T22:44:07+05:30 IST