Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

ఈ భారం తగ్గాలంటే...

twitter-iconwatsapp-iconfb-icon
ఈ భారం తగ్గాలంటే...

ఆంధ్రజ్యోతి(02-03-2021)

బద్ధకం ప్రదర్శిస్తే, ‘ఒళ్లు బరువెక్కిందా?’ అనే కామెంట్లను భరించవలసివస్తుంది. నిజానికి ఒళ్లు బరువెక్కితే బద్ధకంతో పాటు బోలెడన్ని ఆరోగ్య సమస్యలూ ఆవరిస్తాయి. వాటి పర్యవసానాలకు బలి కాకుండా ఉండాలంటే పెరిగే ఒంటి బరువును బాల్యం నుంచే అదుపు చేయాలి!


ఒబేసిటీ అంటే?

ఒంట్లో అవసరానికి మించి కొవ్వు పేరుకుపోవటమే ఒబేసిటీ! సాధారణంగా ఈ కొవ్వు పొట్ట భాగంలో (ఇంట్రా విసెరల్‌), చర్మం కింద...పిరుదులు, చేతులు, మెడ, తొడల్లో (ఎక్స్‌ట్రా విసెరల్‌) పేరుకుంటూ ఉంటుంది. అయితే ఇలా కొవ్వు పేరుకుని లావుగా తయారయ్యే పరిస్థితి ‘ఒబేసిటీ’... డిజార్డర్‌ కాదు, అదొక డిసీజ్‌.


ముద్దుగా, బొద్దుగా వద్దే వద్దు!

పిల్లలు ముద్దుగా కనిపించాలంటే బొద్దుగా ఉండాలని తల్లులు కోరుకోవటం సహజమే! అందుకోసం ప్రేమతో కోరినవన్నీ తినిపిస్తుంటారు. వెంటపడి, బుజ్జగించి పిల్లల చేత బలాన్నిచ్చే పదార్థాలన్నీ ఓ పట్టు పట్టిస్తూ ఉంటారు. పిల్లల్లో ఒబేసిటీకి ఇదొక కారణమైతే, తమంతట తాముగా ఎక్కువ కొవ్వులుండే పదార్థాల్ని కొనుక్కుని తింటూ ఉండటం మరొక కారణం.ఇవేకాకుండా....


సెడెంటరీ లైఫ్‌ స్టైల్‌: అమెరికన్‌ పీడియాట్రిక్‌ అసోసియేషన్‌ పిల్లలు టీవీలు, వీడియో గేమ్స్‌ చూసే సమయాన్ని రెండు గంటలకే పరిమితం చేసింది. అంతకుమించితే సెడెంటరీ లైఫ్‌ స్టయిల్‌కు అలవాటుపడి పిల్లలు ఒబేసిటీకి గురవుతారనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ వాదన. కానీ పిల్లల్లో ఈ లెక్కలు తప్పుతున్నాయి. గంటల తరబడి టీవీలకు అతుక్కుపోయి కూర్చోవటం వల్ల శరీరంలోకి చేరే క్యాలరీలు ఖర్చయ్యే అవకాశం లేక కొవ్వుగా మారుతున్నాయి.


పెద్దల పర్యవేక్షణ కొరవడటం: పిల్లలు ఏం తింటున్నారు? ఎప్పుడు తింటున్నారు? ఎలా తింటున్నారు? అనే విషయాలను పెద్దలు పట్టించుకోకపోవటం కూడా ఛైల్డ్‌ ఒబేసిటీకి మరో ప్రధాన కారణం. 


గ్రంథుల్లో సమస్యలు: థైరాయిడ్‌, పిట్యూటరీ గ్రంథుల్లో సమస్యలున్నా పిల్లలు తేలికగా బరువు పెరుగుతారు. ఈ రుగ్మతలు వంశపారంపర్యంగా పిల్లలకు సంక్రమిస్తూ ఉంటాయి. ఈ సమస్య ఉన్న పిల్లలు ఒక వయసుకి చేరుకునేసరికి హఠాత్తుగా, అతి తక్కువ కాలంలోనే లావైపోతారు. 


హైపర్‌ ఇన్సులిజం: ఇది ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ ఉన్న మధుమేహం. ఈ సమస్య ఉన్న పిల్లలు కూడా కారణం లేకుండానే లావైపోతారు. వీళ్ల మెడ, చేతులు, కాళ్ల దగ్గర మడతల్లో నల్లని చారికలు ఏర్పడతాయి. 


మెదడులో కణుతులు: క్యాన్సర్‌ కాని కొన్ని కణుతులు మెదడులోని హైపోథలామస్‌ ప్రాంతంలో పెరిగినా పిల్లలు ఒబేస్‌గా తయారవుతారు. ఈ సమస్య ఉన్నప్పుడు ఆకలి తీరిన సమాచారం మెదడుకు అందక పిల్లలు ఆపకుండా తింటూనే ఉంటారు. వీళ్లలో ఆకలి అతిగా ఉంటుంది. 


పిల్లల్లో ఒబేసిటీని ఇలా కనిపెట్టొచ్చు

లావుగా కనిపించటంతోపాటు, పిల్లల్లో ఒబేసిటీ రుగ్మతను ఈ కింది లక్షణాల ఆధారంగా గుర్తించవచ్చు. 

శరీరాన్ని బలంగా లాగుతున్నట్టు నడవటం

నిద్రలో గురక.

నిద్రలో ఊపిరి అందక హఠాత్తుగా లేచి కూర్చోవటం

స్లీప్‌ ఆప్నియా వ్లల మెదడుకు ఆక్సిజన్‌ సరఫరా తగ్గి ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గిపోవటం

ఆయాసం

ఎక్కువ సమయం విశ్రాంతికే కేటాయించటం


చికిత్స సులువే!

పిల్లల్లో అధిక బరువు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి. బిఎమ్‌ఐ ఆధారంగా వైద్యులు జువెనైల్‌ ఒబేసిటీని లెక్కించి, అందుకు కారణాల్ని అన్వేషిస్తారు. హార్మోన్లలో అవకతవకలు, మెదడులో కణుతులు మొదలైనశారీరక సమస్యలు కారణమైతే వాటిని సరిదిద్దే చికిత్స అందిస్తే సరిపోతుంది. అలాకాకుండా ఎలాంటి ఆరోగ్య సమస్య లేకుండా పిల్లలు లావుగా తయారైతే, జీవనశైలి, ఆహారపుటలవాట్లలో మార్పులు చేసుకుని, వ్యాయామంతో అధిక బరువును తగ్గించుకోవచ్చు.

ఈ భారం తగ్గాలంటే...

పెద్దల పర్యవేక్షణ, జాగ్రత్త అత్యవసరం

పిల్లల ఆహార శైలికి పెద్దలదే బాధ్యత. వాళ్లకు సమయానికి ఆహారాన్ని అందించటంతోపాటు తినే ప్రతి పదార్థంలో ఉండే పోషకాలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించాలి. వాటితోపాటు...


కుటుంబమంతా కలిసి భోజనం చేసేలా ప్లాన్‌ చేసుకోవాలి. ఈ అలవాటు వల్ల పిల్లల ఆహారపుటలవాట్లను గమనించే వీలుంటుంది. ఏది తక్కువ తినాలో, ఏది ఎక్కువ తినాలో పిల్లలకు చెప్పగలిగే వీలుంటుంది.

ఎటువంటి పరిస్థితిలోనూ ఇంట్లో జంక్‌ ఫుడ్‌కి స్థానం కల్పించకూడదు.

శీతల పానీయాల్లో చక్కెర స్థాయిలు ఎక్కువ కాబట్టి పిల్లలకు వాటి బదులుగా తాజా పళ్ల రసాలు అలవాటు చేయాలి.

ప్యాకేజ్‌డ్‌ ఫుడ్‌ పూర్తిగా మాన్పించాలి.

ఆన్‌లైన్‌లో ఆహారం ఆర్డర్‌ ఇచ్చి ఇంటికి తెప్పించుకుని తినే అలవాటు పెద్దలు మానుకోవాలి. 

పిల్లల లంచ్‌ బాక్స్‌ ఇంటి నుంచే వెళ్లాలి.

ఉదయం అల్పాహారం తినిపించకుండా గ్లాసు పాలు తాగించేసి, పిల్లల్ని బడులకు పంపకూడదు.

స్నేహితుల సాంగత్యం ఎలాంటిది? పిల్లలు ఎలాంటి పరిసరాల్లో ఎక్కువ సమయం గడుపుతున్నారనేది పెద్దలు గమనిస్తూ ఉండాలి.

జంక్‌ ఫుడ్‌ వల్ల కలిగే దుష్ప్రభావాలు, పోషకాహారం వల్ల ఒరిగే ఆరోగ్యపరమైన ప్రయోజనాలను పిల్లలకు వివరించాలి.

ఈ భారం తగ్గాలంటే...

యుక్తవయసు ఉద్యోగుల్లో...

పాతికేళ్లకే వేలల్లో జీతం, లగ్జరీ లైఫ్‌ స్టయిల్‌ గడిపే యంగ్‌ ఎంప్లాయిస్‌ కూడా ఒబేసిటీ బారిన పడుతున్నారు. గంటలతరబడి కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేయటం, నిద్ర, ఆహార వేళలు అస్తవ్యస్థమవటం, అందుబాటులో ఉన్న ఆహారంతో సర్దుకుపోవటం, శారీరక వ్యాయామం లోపించటం...ఇలా చెప్పుకుంటూపోతే యుక్త వయస్కులైన ఉద్యోగుల్లో ఒబేసిటీకి కారణాలు బోలెడన్ని. ఈ కోవకు చెందిన వ్యక్తులు సాధారణంగా ఉదయం అల్పాహారాన్ని మానేసి నేరుగా మధ్యాహ్నం భోజనం చేసేస్తూ ఉంటారు. ఇది కూడా అధిక బరువుకు ప్రధాన కారణమే! శీతల పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్‌, చీజ్‌, నెయ్యితో తయారైన పదార్థాలు తినటం మొదలైన అలవాట్లు మానుకుని రోజు మొత్తంలో కనీసం 30 నిమిషాలపాటైనా వ్యాయామం చేయగలిగితే ఒబేసిటీ దరి చేరకుండా ఉంటుంది. కుర్చీలో కూర్చునే చేసే కొన్ని వ్యాయామాలను అలవాటు చేసుకోవాలి. ప్రతి రెండు గంటలకోసారి కుర్చీ నుంచి లేచి కనీసం 10 నిమిషాలపాటైనా నడుస్తూ ఉండాలి.


బాడీ మాస్‌ ఇండెక్స్‌

ఎత్తు, బరువులను బట్టి బిఎమ్‌ఐ లెక్కిస్తూ ఉంటారు. ఆరోగ్యకరమైన వ్యక్తి బిఎమ్‌ఐ 40 లోపే ఉండాలి. ఈ పరిధి దాటితే ఒబేస్‌, సూపర్‌ ఒబేస్‌, సూపర్‌ సూపర్‌ ఒబేస్‌లుగా వైద్యులు వర్గీకరిస్తారు. ఈ బిఎమ్‌ఐ పిల్లలకు వర్తించదు. వాళ్లలో ఎదుగుదల కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి ఈ లెక్కల ప్రకారం వాళ్లని వర్గీకరించటం సరికాదు. అయితే పిల్లల్లో కూడా ఇప్పుడు బిఎమ్‌ఐ 40 దాటిపోతోంది. ఈ పరిస్థితిని తీవ్రంగా పరిగణించాలి. అలాగే యుక్త యవసుకు చేరుకుని శరీరంలోని అన్ని అవయవాలు పూర్తిగా ఎదిగిన వాళ్లలో కూడా బిఎమ్‌ఐ 40కి మించితే చికిత్స తీసుకోవాల్సిందే!


మహిళల్లో...

పెళ్లి వరకూ నాజూకుగా ఉండి, పెళ్లయ్యాక విపరీతంగా లావైపోయే మహిళలున్నారు. సిజేరియన్‌ సర్జరీ అయ్యాక ఒళ్లొచ్చేసిందని బాధపడే ఆడవాళ్లూ ఉన్నారు. కానీ బరువు పెరగటానికి వీటికీ సంబంధమే లేదు. గర్భంతో ఉన్నప్పుడు కొవ్వు పట్టడానికి వీలుండే ఆహారం తీసుకోవటం, ప్రసవమయ్యాక పాలు తగ్గుతాయేమోననే భయంతో ఆహారం ఎక్కువగా తినటం వల్ల మహిళలు అధిక బరువు పెరుగుతారు. ఇక సర్జరీ జరిగితే ఎక్కువ రోజులు విశ్రాంతికే పరిమితమై ఒబేసిటీకి గురవుతారు. ఈ కారణాలే కాకుండా హైపో థైరాయిడ్‌ బారిన పడినా మెటబాలిజం తగ్గి శరీర బరువు పెరుగుతారు. ఒబేసిటీకి గురవకుండా, శరీర బరువు అదుపులో ఉంచుకోవటానికి మహిళలందరూ కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే...


ప్రతి ఆరు నెలలకోసారి బాడీ మాస్‌ ఇండెక్స్‌ పరీక్షించుకుంటూ ఉండాలి. అది 40కి చేరుకుంటుందంటే బరువు పెరగకుండా చూసుకోవలసిన సమయం ఆసన్నమైందని అర్థం.

35 ఏళ్లు దాటిన ప్రతి మహిళా థైరాయిడ్‌ పరీక్ష చేయించుకోవాలి.

హైపో థైరాయిడ్‌ ఉంటే మందులు వాడుతూ, వైద్యులు చెప్పిన నియమాలు పాటించాలి.

ప్రతిరోజూ వ్యాయామం తప్పనిసరి.

మెనోపాజ్‌కు గురైన మహిళలు మరింత అప్రమత్తంగా ఉండాలి.

డిప్రెషన్‌ లాంటి మానసిక సమస్యలను సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోవాలి.

ప్రొటీన్లు, పీచు ఎక్కువగా...పిండి పదార్థాలు తక్కువగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి.


డిప్రెషన్‌తో...

డిప్రెషన్‌ కూడా ఒబేసిటీకి దారి తీయొచ్చు. డిప్రెషన్‌ను నుంచి బయటపడే మార్గం తెలియక, ఆహారాన్ని ఆబగా తినేసి సంతృప్తి పడే అలవాటు క్రమేపీ ఒబేసిటీకి దారి తీస్తుంది. కడుపు నిండిన వెంటనే అందే సంతృప్తి వల్ల ఈ కోవకు చెందిన వ్యక్తులు ఆ సంతృప్తికి వ్యసనపరులుగా మారి ఆహారం మీద ఆపేక్ష పెంచుకుంటారు. దాంతో ఆకలితో సంబంధం లేకుండా తింటూనే ఉంటారు. ఫలితంగా అధిక క్యాలరీలు శరీరంలో కొవ్వుగా పేరుకుపోతాయి. ఈ సమస్యను సకాలంలో గుర్తించి డిప్రెషన్‌కు కారణాన్ని కనిపెట్టి సరిదిద్దగలిగితే అంతా సర్దుకుంటుంది. ఈమధ్య కాలంలో పిల్లల్లో కూడా డిప్రెషన్‌ రిలేటెడ్‌ ఒబేసిటీ కనిపిస్తోంది. బొద్దుగా ఉన్న పిల్లలకు స్కూళ్లలో తోటి పిల్లల హేళనలు తప్పవు. దాంతో ఆత్మ న్యూనతకు లోనై ఒంటరులుగా తయారవుతారు. ఆ ఒంటరితనాన్ని పోగొట్టుకోవటం కోసం ఆహారంతో స్నేహం చేస్తారు. పొట్ట నిండగానే విజయం సాధించినంత ఆనందపడిపోతారు. ఈ ప్రవర్తనను కూడా పెద్దలు సకాలంలో గుర్తించి, పిల్లలతో మాట్లాడి, తోడ్పాటు అందించగలిగితే ఒబేసిటీని ప్రారంభంలోనే నియంత్రించవచ్చు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement

ప్రత్యేకంLatest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.