రేంజ్‌ పరిధిలో 50 వేల మందిపై కేసులు

ABN , First Publish Date - 2020-04-04T11:39:08+05:30 IST

కరోనా వైరస్‌ నేపథ్యంలో పదమూడు రోజులుగా లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలవుతున్న సందర్భంగా

రేంజ్‌ పరిధిలో 50 వేల మందిపై కేసులు

అమలాపురం, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ నేపథ్యంలో పదమూడు రోజులుగా లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలవుతున్న సందర్భంగా ఏలూరు రేంజ్‌ పరిధిలో 50వేల మందిపై కేసులు నమోదు చేసినట్టు ఏలూరు రేంజ్‌ డీఐజీ  కేవీ.మోహనరావు వెల్లడించారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్న వారిపై   కేసులు నమోదుచేసి, వారి నుంచి రూ.1.29 కోట్లు అపరాధ రుసుం వసూలు చేసినట్టు చెప్పారు. కోనసీమలో చించినాడ నుంచి కాకినాడ వరకు లాక్‌డౌన్‌ అమలు తీరుపై వివిధ ప్రాంతాల్లోని చెక్‌ పోస్టులు, పోలీసు బందోబస్తును శుక్రవారం ఆయన పరిశీలించారు. అమలాపురం గడియార స్తంభం సెంటర్‌లోని టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఏర్పాటైన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు ఏలూరు రేంజ్‌ పరిధిలో 29 పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు తెలిపారు.


జమాతే ప్రార్థనలకు వెళ్లినవారు 88మంది వరకు ఉన్నారని వారిలో కొన్ని పాజిటివ్‌ కేసులు నమోదుకాగా మరి కొందరిని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించి వైద్య పరీక్షలు చేస్తున్నారని చెప్పారు. ఏలూరు రేంజ్‌ పరిధిలో పోలీసు యంత్రాంగం నిరంతరం అప్రమత్తమై లాక్‌డౌన్‌ అమలుచేస్తున్న తీరుపట్ల డీఐజీ మోహనరావు సంతృప్తి వ్యక్తంచేశారు. నిత్యా వసర వస్తువులు, మెడికల్‌ షాపులు, గూడ్స్‌, ఆక్వాకల్చర్‌, ఫార్మామెడికల్‌, పాజిటివ్‌ కమ్యూనికేషన్‌ వంటి అన్ని రంగాలకు పరిమితులకు లోబడి అనుమతులు ఇస్తున్నామన్నారు.


ప్రజలు ప్రభుత్వం సూచించే నిబంధనలకు అనుగుణంగా  వ్యవహరించాలని, ముఖ్యంగా రోడ్లపై సంచారం తగ్గించి ఇళ్లకే పరిమితం కావాలని, ప్రతిఒక్కరూ మాస్కులు ధరించి హోం క్వారంటైన్‌లోనే ఉండాలని డీఐజీ విజ్ఞప్తి చేశారు. పట్టణ పరిధిలోని లాక్‌డౌన్‌ తీరుపై పబ్లిక్‌ నుంచి ఓపీనియన్స్‌ అడిగి తెలుసుకుని కొందరు వాహనదారులకు ఆయన మాస్కులు పంపిణీ చేశారు. డీఐజీ వెంట డీఎస్పీ షేక్‌ మసూమ్‌బాషా, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు జి.సురేష్‌బాబు, రుద్రరాజు భీమరాజు, డి.దుర్గాశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐలు ప్రశాంత్‌ కుమార్‌, ఎస్‌.శివప్రసాద్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-04T11:39:08+05:30 IST