మా పని మాదే...!

ABN , First Publish Date - 2021-10-19T07:45:49+05:30 IST

‘అది వివాదాస్పద ప్రభుత్వ భూమి. కోర్టు ఉత్తర్వులు వెలువడేంతవరకు ఆ స్థలంలోకి ఎవరూ ప్రవేశించకూడదు’ అన్నది రెవెన్యూ అధికారుల హెచ్చరిక. దీనిని ఆక్రమణదారులు బేఖాతరు చేశారు.

మా పని మాదే...!
అన్నాసాంపల్లి భూమిలో మట్టితో వేసిన రోడ్డు

‘అన్నాసాంపల్లె’ భూముల్లోకి వెళ్లొద్దని అధికారులు చెప్పినా మారని తీరు

మట్టి రోడ్డు ఏర్పాటు, గతంలో వేసిన షెడ్డుకు రంగులు

మీడియాకు సమాచారం ఇచ్చేవారిపై బెదిరింపులు


తిరుపతి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ‘అది వివాదాస్పద ప్రభుత్వ భూమి. కోర్టు ఉత్తర్వులు వెలువడేంతవరకు ఆ స్థలంలోకి ఎవరూ ప్రవేశించకూడదు’ అన్నది రెవెన్యూ అధికారుల హెచ్చరిక. దీనిని ఆక్రమణదారులు బేఖాతరు చేశారు. తమ పని తమదేనంటూ మట్టితో రోడ్డు వేశారు. గతంలో ఏర్పాటుచేసిన షెడ్డుకు రంగులు పూశారు. రేణిగుంట మండలం అన్నాసాంపల్లె లెక్కదాఖలా సర్వేనెం 385లో 31.65 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాపై ‘అన్నాసాంపల్లె భూమి హాంఫట్‌’ శీర్షికన ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దాదాపు రూ.250 కోట్ల ప్రభుత్వ స్థలంపై అధికార పార్టీ అండతో కబ్జాపర్వాన్ని కొనసాగిస్తున్న వారి భూబాగోతం వెలుగులోకి రావడంతో కలకలం రేగింది. ఈ స్థలంలోకి ఎవరూ ప్రవేశించకూడదని అధికారులు చెప్పినా ఆక్రమణదారులు సదరు స్థలంలోకి ప్రవేశించి తమ పని తాము చేసుకుపోతున్నారు. మీడియాకు సమాచారం ఇస్తే అంతుచూస్తామని అన్నాసాంపల్లెలోని యువకులను బెదిరిస్తున్నట్టు తెలిసింది. తప్పుడు కేసులతో భయబ్రాంతులకు గురిచేస్తున్నారంటూ.. ఇటీవల గ్రామస్థులపై నమోదైన కేసును ప్రస్తావిస్తున్నారు. ఆ కేసుపై టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. కాగా, సదరు ఆక్రమణదారుల కబ్జా పర్వం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అన్నాసాంపల్లె గ్రామపరిధిలోని మరో రెండు సర్వే నెంబర్లలో పది ఎకరాలకు పైగా కబ్జా చేసినట్టు తెలుస్తోంది. సర్వే నెంబరు 364లో 3.82 ఎకరాల డీకేటీ భూములకు సైతం రెవెన్యూ అధికారుల ద్వారా పట్టాలు పొందినట్టు సమాచారం. సర్వే నెంబరులోని 368లోని 50 సెంట్ల కాలువ పోరంబోకు, సర్వే నెంబరు 335లోని 4.46 ఎకరాల ప్రభుత్వ స్థలం, వెంకటాపురం సర్వే నెంబరు 261లో 4.50 ఎకరాల చెరువు మునక, చెన్నాయగుంట సర్వే నెంబరు 222/5లో 8.33 ఎకరాల కాలువ పొరంబోకు, సర్వేనెంబరు 218, 219లో చెక్‌డ్యాంను కూడా సదరు వ్యక్తులు ఆక్రమించుకున్నట్టు వెలుగులోకి వస్తున్నాయి. కాగా, అన్నాసాంపల్లె, చెన్నాయగుంటల్లోని భూ ఆక్రమణలపై సోమవారం  చిత్తూరులో జరిగిన ‘స్పందన’ కార్యక్రమంలో స్థానికులు కలెక్టర్‌ హరినారాయణన్‌కు ఫిర్యాదు చేశారు. 


స్థలంలోకి ప్రవేశిస్తే చర్యలు తీసుకుంటాం: తహసీల్దారు శివప్రసాద్‌ 

అన్నాసాంపల్లె లెక్కదాఖలా సర్వే నెం 385లోని 31.65 ఎకరాలు ప్రభుత్వ అనాదీనం భూమిలో ఎవరైనా ప్రవేశిస్తే చర్యలు తీసుకుంటాం. ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చినప్పటినుంచి మా సిబ్బంది ప్రతిరోజు స్థలాన్ని తనిఖీచేసి వస్తున్నారు. అక్కడ ఎలాంటి పనులు చేయడంలేదని చెబుతున్నారు. ఒకవేళ ఏదైనా జరుగుతుంటే వెంటనే నిలిపివేసి, చర్యలు చేపడతాం. తక్కిన సర్వేనెంబర్లు కూడా పరిశీలిస్తాం.

Updated Date - 2021-10-19T07:45:49+05:30 IST