ఓటీఎస్‌ వసూళ్లు దుర్మార్గం

ABN , First Publish Date - 2021-12-05T06:36:58+05:30 IST

ఓటీఎస్‌ వసూళ్లు దుర్మార్గం

ఓటీఎస్‌ వసూళ్లు దుర్మార్గం
మాట్లాడుతున్న టీడీపీ నాయకులు

తిరువూరు, డిసెంబరు 4:  పేదలు ఎప్పుడో నిర్మించుకున్న ఇళ్లకు వన్‌టైం సెటిల్‌మెంట్‌(ఓటీఎస్‌) పేరుతో ప్రభుత్వం రూ.4,800 కోట్లు వసూళ్లకు పాల్పడటం దుర్మార్గపు చర్య అని టీడీపీ నాయకులు విమర్శించారు. శనివారం టీడీపీ పట్టణ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీడీపీ విజయవాడ పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి వాసం మునియ్య, ఉపాధ్యక్షుడు రాజవరపు శ్రీనివాసరావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు బొమ్మసాని మహేష్‌ మాట్లాడారు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా గృహ నిర్మాణ పథకం చేపట్టి ఎందరో పేదలకు గూడు కల్పించారని, తదుపరి చంద్రబాబునాయుడు వరకు ఎందరో ముఖ్యమంత్రులు పేదలకు సహాయసహకారాలు అందించారన్నారు. ఎన్నికల ముందు బూటకపు మాటలు కపటిప్రేమ కురిపించి ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్మోహనరెడ్డి పదవి చేపట్టాక ప్రజలపై ఆర్థిక భారాలు మోపుతున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా ఒక్క పేదవాడికి ఇల్లు ఇవ్వకపోగా ఎవరో నిర్మించిన గృహాలకు తన పేరుపెట్టుకుంటున్నారని, లబ్ధిదారుల నుంచి ఓటీఎస్‌ పేరుతో నగదు వసూలుకు పాల్పడుతున్నారని వారు విమర్శించారు. ఓటీఎస్‌ పథకం స్వచ్ఛందమే అంటూ, మరోవైపు సచివాలయ సిబ్బంది, వలంటీర్లతో ఓటీఎస్‌కు ఒప్పుకోకపోతే కార్డు రద్దు అవుతుందని, ఏ పథకం రాదని బెదిరింపులకు దిగుతున్నారని నాయకులు ఆరోపించారు. పేదల్ని ఇబ్బంది పెట్టడం మానకపోతే టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆకుల ప్రసాద్‌, ఉదారపు మార్కేండేశ్వరరావు, గడిపర్తి సురేష్‌ పాల్గొన్నారు.



Updated Date - 2021-12-05T06:36:58+05:30 IST