ఓటీపీతో టోపీ..

ABN , First Publish Date - 2021-03-02T06:56:29+05:30 IST

క్రెడిట్‌ కార్డు గడువు ముగిసిందంటూ ఓటీపీ

ఓటీపీతో టోపీ..

క్రెడిట్‌ కార్డు గడువు ముగిసిందని ఫోన్‌ 

నిందితుల అరెస్ట్‌ చేసిన పోలీసులు

హైదరాబాద్‌ సిటీ, మార్చి 1 (ఆంధ్రజ్యోతి):  క్రెడిట్‌ కార్డు గడువు ముగిసిందంటూ ఓటీపీ వివరాలు తెలుసుకుని డబ్బు డ్రా చేసిన ఢిల్లీకి చెందిన ఇద్దరు నిందితులను సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. గతేడాది డిసెంబర్‌ 24న తార్నాకకు చెందిన రవికుమార్‌కు ఇద్దరు ఫోన్‌ చేసి,  క్రెడిట్‌ కార్డు గడువు ముగుస్తోందని చెప్పారు. దీంతో రవికుమార్‌ క్రెడిట్‌ కార్డు కొనసాగించడానికి వారు చెప్పినట్లు చేశాడు. నిందితులు ఒకే రోజు పలు దఫాలుగా ఫోన్‌ ద్వారా ఓటీపీ  వివరాలు తెలుసుకున్నారు. క్రెడిట్‌ కార్డు నుంచి రూ. 50 వేలను మళ్లించారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించగా, దర్యాప్తు చేపట్టారు. నిందితులైన ఢిల్లీ, నారాయణ రింగ్‌రోడ్‌ నివాసి  వినీత్‌సింగ్‌ (28), సుల్తాన్‌పురివాసి  దీపక్‌సింగ్‌ రావత్‌ (32)లను గత నెల 26న ఢిల్లీలో అరెస్టు చేసి నగరానికి తరలించారు. వారి నుంచి ఆరు సెల్‌ఫోన్లు, 3 డెబిట్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. విచారించగా, ఈ తరహాలో కొన్ని వందల మందిని మోసం చేసినట్లు నిందితులు పోలీసుల ముందు ఒప్పుకున్నారు. ఇలాంటి కాల్స్‌ను నమ్మవొద్దని, క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డుల వ్యవహారంలో ఓటీపీలు చెప్పరాదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

Updated Date - 2021-03-02T06:56:29+05:30 IST