అగ్నిపథ్‌తో పాటు సైన్యంలో చేరడానికి మార్గాలివే...

ABN , First Publish Date - 2022-06-23T14:54:33+05:30 IST

అగ్నిపథ్‌తో పాటు సైన్యంలో చేరడానికి మార్గాలివే...

అగ్నిపథ్‌తో పాటు సైన్యంలో చేరడానికి మార్గాలివే...

ఇండియన్ ఆర్మీలో రిక్రూట్‌మెంట్ కోసం ప్రారంభించిన అగ్నిపథ్ పథకంపై రచ్చ జరుగుతోంది. ఈ పథకంపై అనేక రకాల స్పందనలు వస్తున్నాయి. ఈ స్కీమ్ ద్వారా ఎంట్రీ తీసుకున్న తర్వాత నాలుగేళ్లు మాత్రమే ఆర్మీలో పనిచేయగలమని, వారి కల అసంపూర్తిగా మిగిలిపోతుందని చాలా మంది అంటున్నారు. అయితే అగ్నిపథ్ పథకం ద్వారా మాత్రమే కాకుండా ఇతర మార్గాల్లోనూ సైన్యంలో ప్రవేశం పొందవచ్చు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


మొదటి ఎంపిక: ఎన్డీఏ అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ. 16 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు ఎన్డఏ పరీక్ష ద్వారా ఆర్మీలో చేరవచ్చు. 12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇందులో ప్రవేశార్హులు. ఫిజిక్స్ లేదా మ్యాథ్స్‌తో 12వ తరగతి ఉత్తీర్ణత సాధించడం అవసరం. యూపీఎస్సీ నిర్వహించే దీనికి సంబంధించిన పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి.  ఆపై ఇంటర్వ్యూ ఉంటుంది. అందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు శిక్షణ అనంతరం పోస్టింగ్ ఇస్తారు.

రెండవ ఎంపిక: గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, సైన్యంలో చేరాలనుకునేవారు సీడీఎస్ ద్వారా చేరవచ్చు. 24 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు ఇందులో చేరేందుకు అర్హులు, అయితే వివిధ బలగాల ప్రకారం వయస్సులో మార్పు ఉంటుంది. దీనికోసం వివరణాత్మక నోటిఫికేషన్‌ చూడవచ్చు. 

మూడవ ఎంపిక: ఏఎఫ్సీఏటీ...ఇది వైమానిక దళంలో సేవ చేయాలనుకునే అభ్యర్థుల కోసం ఏర్పాటు చేసినది.  20 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు ఈ పరీక్ష రాయవచ్చు.  పైలట్ లైసెన్స్ కలిగిన వారు 26 సంవత్సరాల వయసు వరకు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్లయింగ్ బ్రాంచ్ కోసం 12వ తరగతిలో మ్యాథ్స్, ఫిజిక్స్‌లలో కనీసం 50% మార్కులు ఉండాలి. వివిధ పోస్ట్‌లు లేదా సర్వీస్ ప్రకారం అర్హతలో మార్పులు, చేర్పులు ఉంటాయి. 

నాల్గవ ఎంపిక: టెరిటోరియల్ ఆర్మీ ... వయో పరిమితిని దాటినవారు టెరిటోరియల్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ద్వారా సైన్యంలోకి ప్రవేశించవచ్చు. ఇంతేకాకుండా, TES, TDC, NCC, GAG ద్వారా వివిధ కోర్సుల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా సైన్యంలో చేరేందుకు అర్హులవుతారు. 

Updated Date - 2022-06-23T14:54:33+05:30 IST