పొగాకు కిలో రూ.188

ABN , First Publish Date - 2022-06-30T06:36:35+05:30 IST

పొగాకు గరిష్ఠ ధర ఒక్క రూపాయి పెరిగింది. రెండు వేలం కేంద్రాల్లో బుధవారం కిలో రూ.188 పలికింది.

పొగాకు కిలో రూ.188
టంగుటూరు వేలం కేంద్రంలో పొగాకు కొనుగోలు చేస్త్ను వ్యాపారులు

ఒక్క రూపాయు పెరిగిన గరిష్ఠ ధర

ఒంగోలు, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి) : పొగాకు గరిష్ఠ ధర ఒక్క రూపాయి పెరిగింది. రెండు వేలం కేంద్రాల్లో బుధవారం కిలో రూ.188 పలికింది. ఈ సీజన్‌ పొగాకు కొనుగోళ్లను ప్రారంభం రోజున మేలురకం గరిష్ఠ ధర కిలో రూ.185తో వ్యాపారులు ప్రారంభించారు. అనంతరం మీడియం, లోగ్రేడ్‌ రకాల ధరలను భారీగా పెంచి పొటీపడి కొనుగోలు చేస్తున్న వారు మేలురకం ధరలను మాత్రం అలాగే ఇస్తున్నారు. ప్రధాన కంపెనీలన్నీ ఆ విషయంలో కూటమి కట్టి సీలింగ్‌ పెట్టి రూ.185 లేదా 186తోనే నడిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారం క్రితం ఒక్క రూపాయి పెరిగింది. కనిగిరి వేలంకేంద్రంలో కొనుగోళ్ల ముగింపు రోజైన ఈనెల 22న కిలోకు రూ.187 ఇచ్చారు. సోమ, మంగళవారాల్లోనూ రెండు, మూడుచోట్ల ఆ ధర లభించగా బుధవారం మరో రూపాయి పెరిగింది. టంగుటూరు కొండపి వేలంకేంద్రాల్లో బుధవారం గరిష్ఠ ధరలు కిలో రూ.188 పలికాయి. అయితే ఆ కాస్త అయినా పెరగడం బయ్యర్లు ఈ వేలం మిషన్‌ బటన్‌ నొక్కడంలో తొందరపాటుతో తప్ప నిజంగా వ్యాపారుల మధ్య పోటీతో కాదని అధికారవర్గాల సమాచారం. కాగా మీడియం, లోగ్రేడ్‌ ధరలు భారీగా పెరిగినా మేలురకం ధరల్లో పెరుగుదల లేకపోవడంపై రైతుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. 



Updated Date - 2022-06-30T06:36:35+05:30 IST