ఉద్యోగాలు లేని వలసలకు.. వ్యవ'సాయం'!

ABN , First Publish Date - 2020-09-29T22:54:45+05:30 IST

వ్యవసాయం.. ఇది చేసే అన్నదాతలే అన్నం దొరక్క ఇబ్బందులు పడుతుంటారు. అలాంటిది వ్యవసాయం చేస్తూ వలసకూలీలను ఆదుకోవాలనుకున్నాడో పెద్దమనిషి.

ఉద్యోగాలు లేని వలసలకు.. వ్యవ'సాయం'!

సిలిగురి: వ్యవసాయం.. ఇది చేసే అన్నదాతలే అన్నం దొరక్క ఇబ్బందులు పడుతుంటారు. అలాంటిది వ్యవసాయం చేస్తూ వలసకూలీలను ఆదుకోవాలనుకున్నాడో పెద్దమనిషి. జస్ట్ అనుకోవడమే కాదు. ఓ మూడెకరాల్లో వ్యవసాయం చేసి ఆ కూలీలకు జీవనభృతి కల్పించాడు కూడా. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో జరిగింది.


కరోనా కారణంగా భారీగా నష్టపోయింది వలసకూలీలే. రాష్ట్రం కాని రాష్ట్రాల్లో బతుకు తెరువుకోసం చెమటోడుస్తున్న వీరిపై కరోనా పంజా పడింది. ఉన్నట్టుండి ఉద్యోగాలు పోయాయ్. పిడికెడు బియ్యం దొరకడం కూడా దుర్లభమైపోయింది. దీంతో వీరంతా స్వగ్రామాల బాట పట్టారు. కనీసం టికెట్ చార్జీలు కూడా లేని వీరిని దాతలు అదుకున్నారు. ఖర్చులు భరించి వారిని స్వగ్రామాలకు చేర్చారు. ఇంటికి చేరుకున్నా వీరి కష్టాలు మాత్రం తీరలేదు. అదే ఆకలి, అవే బాధలు. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురికి చెందిన ప్రదీప్ సింఘాల్.. ఇలాంటి వలస కూలీలకు ఏదైనా సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు.


వలస కూలీలకు ఆహారపదార్థాలు దానం చేసి ప్రయోజనం లేదని, ఆహారాన్ని స్వయంగా సంపాదించుకునే అవకాశం ఇవ్వడమే సరైనదని ప్రదీప్ భావించాడు. దీనికోసం బాగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకున్నాడు. అతనికి వచ్చిన ఆలోచనే సేంద్రియ వ్యవసాయం. ఈ ఆలోచన రాగానే స్థానికంగా ఉన్న సెంటర్ ఆఫ్ ఫ్లోరికల్చర్ అండ్ ఆగ్రో బిజినెస్ మేనేజ్‌మెంట్(కోఫమ్) ప్రతినిధులను కలిసి తన అభిప్రాయాలను వివరించాడు. ప్రదీప్ ఆలోచన కోఫమ్ ప్రతినిధులకు నచ్చింది. అంతే ఓ మూడెకరాల పొలంలో సేంద్రీయ వ్యవసాయం చేయడానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.


వ్యవసాయం చేయాలన్న ఆలోచన మంచిదే అయినా ఏం పండించాలన్న సమస్య ప్రదీప్ ముందుకు వచ్చింది. దీని గురించి బాగా ఆలోచించి చివరకు పుచ్చకాయలు పండించాలని అతను నిర్ణయించాడు. కరోనా కాలంలో ఇమ్యూనిటీ పెంచే ఆహారం తీసుకోవాలని వైద్యులు చెప్పిన మాట వల్లే తను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రదీప్ తెలియజేశాడు. 'ఇలా చేయడం వల్ల ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టినట్లు అవుతుంది. ఓ పక్క ప్రజలకు ఆరోగ్యకరమైన పళ్లను అందిస్తూనే మరోపక్క వలసకార్మికులకు ఆదాయమార్గం కూడా దొరుకుతుంది. అందుకే ఈ ఆలోచన చేశా' అని ప్రదీప్ చెప్పాడు.


కోఫమ్, ప్రదీప్ కలిసి ఏర్పాటు చేసిన ఈ సేంద్రియ వ్యవసాయ క్షేత్రంలో 15మంది వలసకూలీలకు పని కల్పించారు. జర్మనీకి చెందిన ముల్చింగ్ పేపర్ టెక్నాలజీతో ఇక్కడ పంట పండించారు. ఈ క్రమంలో తొలివిడతగా 8టన్నుల దిగుబడి వచ్చింది. ఈ ఫలితంపై కోఫమ్ నిపుణులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ముల్చింగ్ పేపర్ విధానంలో పండించిన పుచ్చకాయలు మార్కెట్లో దొరికే వాటికన్నా రుచిగా ఉన్నాయని, అందుకే వీటికి బాగా డిమాండ్‌ ఉంటోందని పొలంలో పనిచేసే కూలీలు చెప్తున్నారు.


కరోనా కారణంగా ఎన్నో కష్టాలు పడుతున్న వలస కార్మికులను ఎలాగైనా ఆదుకోవాలనే తపనలో నుంచే ఈ సేంద్రియ వ్యవసాయం ఆలోచన పుట్టిందని ప్రదీప్ స్పష్టంచేశారు. ఇప్పుడు ఈ పొలంలో పనిచేస్తున్న 15మంది కార్మికులు కూడా సంతృప్తిగా ఉన్నారని, తన ఆలోచన మంచి ఫలితాలివ్వడంతో చాలా సంతోషంగా ఉందని అతను తెలియజేశాడు. కరోనా మహమ్మారి కారణంగా పనులు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న వలసలకు ఇలా వ్యవసాయం చేయడం మాత్రం వినూత్న యోచనే అంటూ ప్రదీప్‌ను పలువురు మెచ్చుకుంటున్నారు.

Updated Date - 2020-09-29T22:54:45+05:30 IST