నంబర్‌ 2 ఎవరు?

ABN , First Publish Date - 2021-07-30T05:33:22+05:30 IST

మునిసిపాల్టీల్లో మరో ఎన్నిక సందడి నెలకొంది. శుక్రవారం రెండో వైస్‌ చైర్మన్‌ ఎన్నిక జరగనుంది. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లాలో ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ మునిసిపాల్టీతో పాటు పాలకొండ నగర పంచాయతీకి మార్చిలో ఎన్నికలు నిర్వహించారు.

నంబర్‌ 2 ఎవరు?


రెండో వైస్‌ చైర్మన్‌ కోసం ఆశావహుల ప్రయత్నాలు

నేతల చుట్టూ ప్రదక్షిణలు

అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని వేడుకోలు

నేడు ఎన్నిక.. 

ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

మునిసిపాల్టీల్లో మరో ఎన్నిక సందడి నెలకొంది. శుక్రవారం రెండో వైస్‌ చైర్మన్‌ ఎన్నిక జరగనుంది. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లాలో ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ మునిసిపాల్టీతో పాటు పాలకొండ నగర పంచాయతీకి మార్చిలో ఎన్నికలు నిర్వహించారు. అధికార వైసీపీ స్పష్టమైన ఆధిక్యతను కనబరచింది. ఆ పార్టీకి చెందిన వారే మూడుచోట్ల చైర్మన్‌, వైస్‌ చైర్మన్లుగా కొలువుదీరారు. పదవులకు విపరీతమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో రెండో వైస్‌ చైర్మన్‌కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. కానీ సాంకేతిక కారణాలతో జాప్యం జరిగింది. ఎట్టకేలకు నాలుగు నెలల తరువాత శుక్రవారం రెండో వైస్‌ చైర్మన్‌ను ఎంపిక చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు  జారీచేసింది. కౌన్సిలర్లు చేతులెత్తి రెండో వైస్‌ చైర్మన్‌ను ఎన్నుకోనున్నారు. పేరుకే ప్రక్రియ కానీ.. అధిష్టానం సూచించిన వ్యక్తే పదవి దక్కించుకోనున్నారు. ఇప్పటికే ఆశావహులు నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అనుచర గణంతో మంత్రులు, పార్టీ పెద్దలను కలిసి వైస్‌ చైర్మన్‌ పదవి తమకే కట్టబెట్టాలని కోరుతున్నారు. సామాజిక సమీకరణల నేపథ్యంలో ఎవరికి వారు తమకే వైస్‌ ఛైర్మన్‌ పదవి వరించనున్నదని ప్రచారం చేసుకొంటున్నారు.


 ఇచ్ఛాపురంలో..

ఇచ్ఛాపురం మునిసిపాల్టీలో వైస్‌ చైర్మన్‌ పదవికి విపరీతమైన పోటీ ఉంది. ఇక్కడ ఆరుగురు కౌన్సిలర్లు పదవిని ఆశిస్తున్నారు. మొత్తం 23 వార్డులకుగాను 15 వార్డుల్లో వైసీపీ, ఆరు వార్డుల్లో టీడీపీ, రెండుచోట్ల స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. ఎన్నికల అనంతరం ఇద్దరు స్వతంత్రులు వైసీపీ గూటికి చేరారు. దీంతో అధికార పార్టీ బలం 17 వార్డులకు చేరింది. చైర్‌పర్సన్‌గా పిలక పిలక రాజలక్ష్మి, వైస్‌ చైర్‌పర్సన్‌గా ఉలాల భారతీదివ్య కొనసాగుతున్నారు. ఇప్పుడో రెండో వైస్‌ ఛైర్మన్‌ పదవి రేసులో 7వ వార్డు కౌన్సిలర్‌ లాభాల స్వర్ణమణి, 8వ వార్డు కౌన్సిలర్‌ పుల్లటి మధుమూర్తి, ఒకటో వార్డు కౌన్సిలర్‌ సుగ్గు ప్రేమ్‌కుమార్‌, 6వ వార్డుకు చెందిన పరపటి మంజులత, 20వ వార్డుకు చెందిన సారి ఆదిరెడ్డి పోటీపడుతున్నారు. రెడ్డి, యాదవ వర్గాలకు ఇప్పటికే పదవులు ఉన్నందున... అధిష్టానం ఇతర సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. 

పాలకొండలో..

పాలకొండ నగర పంచాయతీలో రెండో వైస్‌ చైర్మన్‌ పదవి కోసం గట్టి పోటీ నెలకొంది. మొత్తం 20 వార్డులకు వైసీపీ 17, టీడీపీ 3 చోట్ల గెలుపొందింది. చైర్‌పర్సన్‌గా రాధారాణి, వైస్‌ చైర్మన్‌గా హనుమంతురావు కొనసాగుతున్నారు. రెండో వైస్‌ చైర్మన్‌ పదవికి 5వ వార్డు కౌన్సిలర్‌ వెలమల మన్మథరావు, 12వ వార్డు కౌన్సిలర్‌ కోడెం సాయికృష్ణ, 9వ వార్డు కౌన్సిలర్‌ పల్లా భాను ప్రయత్నిస్తున్నారు.  పదవిని ఆశిస్తున్న కౌన్సిలర్లు స్థానిక ఎమ్మెల్యే విశ్వసరాయ కళావతి, డీసీసీబీ మాజీ చైర్మన్‌ పాలవలస విక్రాంత్‌ను కలిశారు. తమ అభ్యర్థిత్వాలను పరిశీలించాలని కోరారు.


‘పలాస-కాశీబుగ్గ’ రెండో వైస్‌ చైర్మన్‌గా మీసాల

పలాస: పలాస-కాశీబుగ్గ మునిసిపాల్టీలో రెండో వైస్‌ చైర్మన్‌ విషయంలో ఉత్కంఠకు ముందుగానే తెరపడింది. 4వ వార్డు కౌన్సిలర్‌ మీసాల సురేష్‌బాబుకు రెండో వైస్‌ చైర్మన్‌ పదవికి ఎంపిక చేశారు. గురువారం మునిసిపల్‌ చైర్మన్‌ బళ్ల గిరిబాబు, కౌన్సిలర్లు, నాయకులతో మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు సమావేశమయ్యారు. సురేష్‌బాబును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సురేష్‌బాబు మాట్లాడుతూ మంత్రి అప్పలరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని.. మునిసిపాల్టీ అభివృద్ధికి కృషి చేస్తాననని తెలిపారు. రెండో వైస్‌ చైర్మన్‌ పదవిని మీసాల సురేష్‌బాబుతో పాటు 20వ వార్డు కౌన్సిలర్‌ అంబటి మాధురి, 18వ వార్డు కౌన్సిలర్‌ బెల్లాన శ్రీనివాసరావులు ఆశించారు. కానీ చివరకు సురేష్‌బాబుకే పదవి దక్కింది. 



Updated Date - 2021-07-30T05:33:22+05:30 IST