ప్రజల్లోకి ప్రతిపక్షాలు..

ABN , First Publish Date - 2022-05-24T05:35:35+05:30 IST

ఢిల్లీ యాత్రలో ముఖ్యమంత్రి, విదేశీ టూర్‌లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఉండడంతో టీఆర్‌ఎస్‌ నేతలు, శ్రేణులు ఆటవిడుపుతో ఉన్నారు.

ప్రజల్లోకి ప్రతిపక్షాలు..

- రైతు రచ్చబండతో కాంగ్రెస్‌

- శక్తి కేంద్రాలు, క్షేత్రస్థాయి నేతలతో బీజేపీ సమావేశాలు

- - హనుమాన్‌ జయంతికి ఎంపీ ఆధ్వర్యంలో హిందూ ఏక్తాయాత్ర

- వేలాదిమందిని తరలించేందుకు ప్రయత్నాలు


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

ఢిల్లీ యాత్రలో ముఖ్యమంత్రి, విదేశీ టూర్‌లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఉండడంతో టీఆర్‌ఎస్‌ నేతలు, శ్రేణులు ఆటవిడుపుతో ఉన్నారు. ప్రతిపక్షాలు మాత్రం గ్రామాల్లోకి వెళ్లి ప్రజలను కలుస్తూ రాజకీయ సమీకరణాలు మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. మరో 18 నెలల్లో ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉండగా ఇంతకాలం స్తబ్ధంగా ఉన్న ప్రతిపక్షాలు ఒక్కసారిగా రాజకీయ వేడిని పెంచుతున్నాయి. 


 ప్రజల్లోకి కాంగ్రెస్‌ రైతు  డిక్లరేషన్‌


కాంగ్రెస్‌ పార్టీ రైతు డిక్లరేషన్‌తో రచ్చబండ పేరుతో గ్రామాల్లోకి వెళ్తున్నది. ఆ పార్టీ మాజీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ జిల్లాలోని నగునూర్‌లో ఈ కార్యక్రమానికి శ్రీకారంచుట్టి రోజుకు రెండు లేక మూడు గ్రామాల్లో రచ్చబండను నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ తన నియోజకవర్గమైన మానకొండూర్‌లోని మొగిలిపాలెం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, టీఆర్‌ఎస్‌ శ్రేణులు దానిని అడ్డుకోవడంతో తీవ్ర ఘర్షణ నెలకొన్నది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏకకాలంలో రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని, ఇందిరమ్మ రైతు భరోసా పథకం కింద రైతులకు, కౌలుదారులకు ఏడాదికి ఎకరాకు 15 వేల రూపాయలు, భూమిలేని ఉపాధిహామీ కూలీలకు ఏడాదికి 12 వేల రూపాయలు ఇస్తామని గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. అన్ని పంటలకు గిట్టుబాటు ధరలను చెల్లించి ప్రభుత్వమే ఆ ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని చెబుతూ గిట్టుబాటు ధరలను ప్రకటించి ప్రచారం చేస్తున్నారు. పంటల బీమా పథకాన్ని అమలు చేసి పంట నష్టపోతే తక్షణ నష్టపరిహారం అందిస్తామని, రైతు కూలీలకు, కౌలు రైతులకు కూడా రైతు బీమా వర్తింపజేస్తామని హామీ ఇస్తున్నారు. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని రైతులకు హామీ ఇస్తున్నారు. చక్కెర కర్మాగారాలను తెరిపిస్తామని, పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని ప్రచారం చేస్తున్నారు. రైతు కమిషన్లు ఏర్పాటు చేసి రైతుల సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని చెబుతూ ప్రజలను కూడగడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ కాంగ్రెస్‌ను గెలిపించాలని పిలుపునిస్తున్నారు. కరీంనగర్‌ పాత జిల్లా పరిధిలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జిల నేతృత్వంలో రచ్చబండ నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు పకడ్బందీ ప్రణాళికతో కాంగ్రెస్‌ నేతలు ముందుకు సాగడం జిల్లాలో కొత్త వాతావరణాన్ని కలిగిస్తున్నది. 


 తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు బీజేపీ ప్రయత్నాలు


రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రను ముగించుకున్న కరీంనగర్‌ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ తన సొంత జిల్లాలో రాజకీయంగా తిరుగులేని శక్తిగా బీజేపీని తీర్చిదిద్దాలని భావిస్తూ క్షేత్రస్థాయి నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఇప్పటికే పోలింగ్‌ బూత్‌ కమిటీల అధ్యక్షులు, శక్తి కేంద్రాల అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలతో రెండు సమావేశాలు నిర్వహించి ఆయా నేతల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగిందని, రాజకీయంగా అధికారం చేపట్టడానికి వాతావరణం నెలకొని ఉన్నందున క్షేత్రస్థాయిలో నేతలంతా కలిసికట్టుగా వ్యవహరించి ప్రజల సానుకూలతను ఓటుగా మలుచుకునేందుకు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. అన్ని జిల్లాల్లోనూ నియోజకవర్గాల వారీగా ఇలాంటి సమావేశాలు నిర్వహించాలని పార్టీ నేతలకు సూచించారు. హిందూ ఏక్తా యాత్ర పేరిట కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో భారీ ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించారు. బండి సంజయ్‌ తానే స్వయంగా కరీంనగర్‌లో ఉంటూ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. హనుమాన్‌ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 25న జరిగే ఈ ఏక్తా యాత్రకు వేలాదిగా తరలివచ్చి హిందూ సమాజ సంఘటిత శక్తిని చాటిచెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. సాధుపరిషత్‌ అధ్యక్షుడు శ్రీనివాసానంద ఈ ఏక్తా యాత్రకు వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని నాలుగు జిల్లాల నుండి భారీ ఎత్తున పార్టీ శ్రేణులు, నాయకులు ఈ ఏక్తా యాత్రకు హాజరయ్యేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే నగరాన్ని కాషాయమయం చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, కేసీఆర్‌ తనయ కల్వకుంట్ల కవిత బీజేపీవారు జై శ్రీరామ్‌ అంటే తాము జై హనుమాన్‌ అంటామని ప్రకటించి కొండగట్టులో 108 సార్లు హనుమాన్‌ చాలీసా పారాయణాన్ని నిర్వహించారు. బండి సంజయ్‌ హనుమాన్‌ జయంతిరోజే ఈ ఏక్తా యాత్ర నిర్వహించి బీజేపీనే హిందుత్వ బ్రాండ్‌ అంబాసిడర్‌ అనే అభిప్రాయాన్ని ప్రజల్లో మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. ఆధ్యాత్మిక,రాజకీయ కార్యకలాపాలను ముమ్మరం చేస్తూ బీజేపీ క్షేత్రస్థాయిలో పటిష్టపడడానికి కృషి చేస్తున్నది. అటు కాంగ్రెస్‌, ఇటు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకత్వం ఆసక్తిగా గమనిస్తున్నది. ప్రజల్లో ఆ కార్యక్రమాలపై స్పందన, వారి మనోగతాన్ని అంచనా వేసి అగ్రనేతలు తిరిగి రాగానే వారి డైరెక్షన్‌ మేరకు రాజకీయ కార్యక్రమాలను ముమ్మరం చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. 


Updated Date - 2022-05-24T05:35:35+05:30 IST