కేంద్రానిది దురహంకారం, మొండి వైఖరి.. 14 విపక్ష పార్టీల సంయుక్త ప్రకటన

ABN , First Publish Date - 2021-08-05T01:00:14+05:30 IST

'పెగాసస్' అంశంపై చర్య జరపాలనే తమ డిమాండ్‌ నుంచి వెనక్కి తగ్గేది లేదని, దీనిపై..

కేంద్రానిది దురహంకారం, మొండి వైఖరి.. 14 విపక్ష పార్టీల సంయుక్త ప్రకటన

న్యూఢిల్లీ: 'పెగాసస్' అంశంపై చర్య జరపాలనే తమ డిమాండ్‌ నుంచి వెనక్కి తగ్గేది లేదని, దీనిపై తామంతా దృఢ వైఖరితో ఉన్నామని విపక్ష పార్టీలు బుధవారంనాడు తెలిపాయి. పార్లమెంటు ప్రతిష్టంభనకు కేంద్ర కేంద్ర ప్రభుత్వ దురహంకార, మొండివైఖరే కారణమని పేర్కొన్నాయి. ఈ మేరకు కాంగ్రెస్, మరో 13 విపక్ష పార్టీలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. రైతు వ్యతిరేక సాగు చట్టాలపైన, పెగాసస్‌పైన చర్చ జరపాలని తాము చాలా స్పష్టంగా చెప్పినట్టు ఆ ప్రకటన పేర్కొంది. పార్లమెంటు ప్రతిష్ఠంభనకు విపక్షాలే కారణమంటూ విపక్ష కూటమిపై బురద చల్లుతూ కేంద్రం తప్పుదారి పట్టిస్తోందని నేతలు విమర్శించారు.


''ఉభయ సభల్లోనూ పెగాసస్‌పై చర్చ, హోం మంత్రి సమాధానం ఇవ్వాలనే అంశంపై విపక్ష పార్టీలు చాలా పట్టుదలగా, ఐక్యంగా ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం దురహంకారంతో మొండివైఖరి ప్రదర్శిస్తోంది'' అని ఆ ప్రకటన పేర్కొంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించి చర్చలకు అనుమతించాలని కేంద్రానికి తాము మరోమారు విజ్ఞప్తి చేస్తున్నట్టు నేతలు పేర్కొన్నారు. సంయుక్త ప్రకటన జారీ చేసిన వారిలో రాజ్యసభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే, ఎన్‌సీపీ నేత శరద్ పవార్, కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ, డీఎంకే నేత టీఆర్ బాలు, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్‌గోపాల్ యాదవ్, టీఎంపీ నేతలు డెరిక్ ఒబ్రెయిన్, కల్యాణ్ బెనర్జీ, ఆర్జేడీ నేత మనోజ్ ఝా, సీపీఎం నేత ఇ.కరీం, ఆమ్ ఆద్మీ పార్టీ నేత సుశీల్ గుప్తా, ఐయూఎంఎల్ నేత ఈటీ మహమ్మద్ బషీర్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత హస్‌నయిన్ మసూది, సీపీఐ నేత బినయ్ బిశ్వం, ఆర్‌ఎస్‌పీ నేత ఎన్.కె.ప్రేమచంద్రన్, ఎల్‌జేడీ నేత ఎంవీ శ్రేయాంస్ కుమార్ ఉన్నారు.

Updated Date - 2021-08-05T01:00:14+05:30 IST