స్వలాభం కోసం రైతుల్ని వాడుకుంటున్నారు : మోదీ

ABN , First Publish Date - 2020-09-25T17:55:33+05:30 IST

దేశం కోసం, జాతి కోసం దీనదయాళ్ ఉపాధ్యాయ చేసిన సేవ నేటి తరానికి ఎంతో ఆదర్శమని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు.

స్వలాభం కోసం రైతుల్ని వాడుకుంటున్నారు : మోదీ

న్యూఢిల్లీ : దేశం కోసం, జాతి కోసం దీనదయాళ్ ఉపాధ్యాయ చేసిన సేవ నేటి తరానికి ఎంతో ఆదర్శమని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ఆయన చూపిన మార్గం ప్రతి బీజేపీ కార్యకర్తకు మనో విశ్వాసాన్ని పెంచుతుందని పేర్కొన్నారు. బీజేపీ సిద్ధాంత కర్త దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకొని మోదీ శుక్రవారం ప్రసంగించారు. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో రైతులను బ్యాంకులకు అనుసంధానించే ప్రక్రియను వేగవంతం చేశామని, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద పది కోట్ల మంది రైతులకు ఒక లక్ష కోట్లకు పైగా బదిలీ చేశామని తెలిపారు.


దేశంలోని రైతులకు ‘కిసాన్ క్రెడిట్ కార్డ్’ అందజేయడమే లక్ష్యంగా సాగుతున్నామని, దీంతో రైతులకు సులభ ప్రక్రియలో లోన్లు దొరికే అవకాశం ఉందని తెలిపారు. గత ప్రభుత్వాలు రైతులకు, కార్మికులకు ఎప్పటీకీ అర్థం కాని వాగ్దానాలను చేశాయని, క్లిష్టమైన చట్టాలను కూడా చేశాయని విమర్శించారు. కానీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితులను మార్చడానికి ప్రయత్నిస్తున్నామని, రైతుల క్షేమం దృష్ట్యా విప్లవాత్మకమైన మార్పులను తెస్తున్నామని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం పొందిన తర్వాత రైతులు, కార్మికుల పేరిట అనేక నినాదాలను తీసుకొచ్చారని, మేనిఫెస్టోలను కూడా రూపొందించారని, అయితే వాటిని అమలు చేయడంలో మాత్రం పూర్తి నిర్లక్ష్యం వహించారని, అమలుకు వచ్చే సమయానికి ఆ చట్టాలు బోలుగా ఉన్నాయని నిరూపితమయ్యాయని ప్రధాని ఎద్దేవా చేశారు. తాజాగా కేంద్రం తీసుకొచ్చిన మూడు చట్టాలపై ప్రతిపక్షాలు లేనిపోని తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయని, వారి స్వలాభం కోసం రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రతి బీజేపీ కార్యకర్త క్షేత్ర స్థాయిలో అందరికీ అర్థమయ్యేలా వివరించాలని మోదీ పిలుపునిచ్చారు.


కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను అందరికీ అర్థమయ్యే రీతిలో, సులభంగా వాటి ప్రాధమ్యాలను వివరించాలని ఆయన సూచించారు. కొత్త బిల్లులు రైతుల జీవితాలను కచ్చితంగా మారుస్తాయని మోదీ పునరుద్ఘాటించారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 30 శాతం మంది కార్మికులు మాత్రమే కనీస వేతన హామీ పథకం పరిధిలోకి వచ్చారని, కొత్త కార్మిక చట్టాలతో కార్మికులందరూ కనీస వేతన హామీ పథకం పరిధిలోకి వస్తారని ఆయన తెలిపారు. ఈ పథకం అసంఘటిత రంగంలోని కార్మికులందరికీ వర్తిస్తుందని మోదీ పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-25T17:55:33+05:30 IST