వీల్‌చైర్‌లో కూర్చుని విద్వేష వ్యాప్తా: దేశద్రోహం కేసుపై మాజీ గవర్నర్

ABN , First Publish Date - 2021-09-06T22:47:57+05:30 IST

రాజకీయంగా తనకు కీడు చేసేందుకే తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ అజిజ్ ఖురేషి..

వీల్‌చైర్‌లో కూర్చుని విద్వేష వ్యాప్తా: దేశద్రోహం కేసుపై మాజీ గవర్నర్

న్యూఢిల్లీ: రాజకీయంగా తనకు కీడు చేసేందుకే తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ అజిజ్ ఖురేషి అన్నారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కించపరచే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఖురేషిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ విధానాలను విమర్శించడం తన హక్కు అని, దీనిపై తన తుది శ్వాస వరకూ ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడుతూనే ఉంటానని అన్నారు. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు, ప్రజలను పక్కదారి పట్టించేందుకే తన వ్యాఖ్యలను వక్రీకరించారని పేర్కొన్నారు.


''ఇవాళ మాదిరిగా గతంలో ఇన్ని అకృత్యాలు జరగలేదని నేను అన్నాను. ఏ ఒక్కరినీ ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదు. ప్రభుత్వం మీద ఒక్క ప్రకటన కూడా చేయలేదు. నేను ఈ ప్రభుత్వాన్ని నా ప్రభుత్వంగా భావిస్తాను. ప్రధాన మంత్రిని యావద్దేశానికి ప్రధానికి భావిస్తాను. హోం మంత్రి, రక్షణ మంత్రిని దేశమంతటికీ మంత్రులుగా భావిస్తాను. అలాగే ముఖ్యమంత్రిని రాష్ట్రానికి సీఎంగా భావిస్తాను. ఎవరినీ ఎప్పుడూ కించపరచను. ఎవరి విధానాలనైనా విమర్శించడమనేది ప్రజాస్వామిక హక్కే అవుతుంది'' అని ఖురేషి పేర్కొన్నారు. రాజద్రోహం కేసుపై ప్రశ్నించినప్పుడు, మతతత్వం, విద్వేష వ్యాప్తి చేసే ఒక్క మాట కూడా తాను మాట్లాడలేదని, అలాంటిదేమైనా ఉంటే తనకు చూపించాలని ఆయన అన్నారు. తన సపోర్ట్ కోసం వీల్‌చైర్‌ను ఆశ్రయించే వ్యక్తి, విద్యేష వ్యాప్తి ఎలా చేస్తాడు? అని ఖురేషి సూటిగా ప్రశ్నించారు.


యోగి ఆదిత్యనాథ్‌ను కించపరచేలా వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ కార్యకర్త అకాష్ సక్సేనా ఆదివారంనాడు రాంపూర్ జిల్లాలోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన్టటు యూపీ పోలీసులు తెలిపారు. 124ఎ (రాజద్రోహం), 153ఎ (మతం పేరుతో ఇరువర్గాల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగెట్టడం) తదితర సెక్షన్ల కింద ఖురేషిపై కేసు నమోదు చేశారు.

Updated Date - 2021-09-06T22:47:57+05:30 IST