కొత్త ఆవిష్కరణలకు అవకాశం

ABN , First Publish Date - 2021-08-04T04:20:05+05:30 IST

ప్రభుత్వం ఇంటింటా ఇన్నోవేషన్‌ కార్యక్రమం ద్వారా సరికొత్త ఆవిష్కరణకు అవకాశం కల్పిస్తుందని మెదక్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ రమేశ్‌ అన్నారు.

కొత్త ఆవిష్కరణలకు అవకాశం
అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ రమేశ్‌

మెదక్‌ అదనపు కలెక్టర్‌ రమేశ్‌ 


మెదక్‌రూరల్‌, ఆగస్టు 3: ప్రభుత్వం ఇంటింటా ఇన్నోవేషన్‌ కార్యక్రమం ద్వారా సరికొత్త ఆవిష్కరణకు అవకాశం కల్పిస్తుందని మెదక్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ రమేశ్‌ అన్నారు. మంగళవారం తన ఛాంబర్‌లో విద్య, వ్యవసాయం, పరిశ్రమలు, గ్రామీణాభివృద్ధి, ఐటీఐ, ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి వ్యక్తిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి ఈ వేదిక చక్కని అవకాశాన్ని కల్పిస్తున్నదన్నారు. ప్రజల్లో దాగి ఉన్న ప్రతిభకు రూపం ఇచ్చేలా వారిని ప్రొత్సహించేందుకు ప్రభుత్వం 2019-20 నుంచి ఇన్నోవేషన్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. ఇందులో పాఠశాల, కళాశాలల విద్యార్థులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, వ్యవసాయదారులు, గృహిణులు ఇలా ఏ రంగానికి చెందిన వారైనా తమకు వచ్చిన ఆలోచనలకు పదునుపెట్టి సృజనాత్మకను జోడించి చేసిన ఆవిష్కరణలను ఆన్‌లైన్‌ ద్వారా  దరఖాస్తు చేయాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల నుంచి అనేక మంది తమ ఆవిష్కరణను ప్రదర్శించడానికి  ఇది చక్కటి అవకాశమన్నారు. కరోనా దృష్ట్యా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆన్‌లైన్‌ వేదికగా నూతన ఆవిష్కరణలు ప్రదర్శించాల్సి ఉంటుందని వివరించారు. ప్రతి ఒక్కరూ వినూత్న ఆలోచనలకు రూపకల్పన చేసి జిల్లా నుంచి ఎక్కువ సంఖ్యలో ఆవిష్కరణలు వెళ్లేలా కృషి చేయాలని కోరారు. ఆవిష్కర్తలు ఈనెల 10లోపు ఆన్‌లైన్‌లో ఆవిష్కరణలు పంపాలని కోరగా ఇప్పటి వరకు  కేవలం రెండు దరఖాస్తులు మాత్రమే వచ్చాయని తెలిపారు. ఆవిష్కర్తలు ఈనెల 10లోగా తమ ఆవిష్కరణకు సంబంధించిన ఆరు వా క్యాలు, రెండు నిమిషాల వీడియోను, ఆవిష్కరణకు సం బంధించిన 4 ఫొటోలు, పేరు, ఫోన్‌నంబర్‌, వయస్సు, ప్రస్తుత వృత్తి, ఇతర వివరాలతో 9100678543 నంబర్‌కు వాట్సాప్‌ చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో శ్రీనివాస్‌, డీఈవో రమేశ్‌, జిల్లా పరిశ్రమల మేనేజర్‌ కృష్ణమూర్తి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పరుశురాం, జిల్లా సైన్స్‌ అధికారి రాజిరెడ్డి, డీపీఆర్‌వో శాంతి కుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-04T04:20:05+05:30 IST