HYD : ఒళ్లు పట్టడానికో రేటు, కాళ్లకైతే ఇంకోలా.. కాస్త ఎక్కువ కావాలంటే... ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి Sting Operationలో విస్తుగొలిపే వాస్తవాలు!

ABN , First Publish Date - 2021-11-22T16:02:16+05:30 IST

ఆ సెంటర్‌లోకి అడుగు పెట్టగానే.. ‘వెల్‌కమ్‌ సార్‌. మా వద్ద పూర్తి స్థాయి విశ్రాంతి. అంతకు మించి...

HYD : ఒళ్లు పట్టడానికో రేటు, కాళ్లకైతే ఇంకోలా.. కాస్త ఎక్కువ కావాలంటే... ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి Sting Operationలో విస్తుగొలిపే వాస్తవాలు!

  • ఆపరేషన్ మసాజ్
  • ఎలాంటి ‘సర్వీసు’ అయినా ఓకే..
  • స్పా సెంటర్ల ముసుగులో చీకటి వ్యాపారం
  • పేరుకే మసాజ్‌.. అసలు దందా వేరే 
  • యువతులు చెప్పే మాటలను బట్టి కస్టమర్లకు రేటింగ్‌లు
  • గుడ్‌ రేటింగ్‌ ఉన్నవారికి తరచూ ఫోన్లు

ఆ సెంటర్‌లోకి అడుగు పెట్టగానే.. ‘వెల్‌కమ్‌ సార్‌. మా వద్ద పూర్తి స్థాయి విశ్రాంతి. అంతకు మించి సంతృప్తి. 100 శాతం గ్యారంటీ’ అంటారు. డబ్బు చెల్లిస్తే ఇక్కడ ఏదైనా సాధ్యమేనన్న సంకేతాలూ అందుతాయి. తమ పనితీరును వివరిస్తూనే ఎలాంటి సర్వీసులున్నాయో విడమర్చి చెబుతారు. కవ్వించేలా చేస్తారు. మసాజ్‌, స్పా సెంటర్ల మాటున జరుగుతున్న చీకటి దందాను వెలుగులోకి తెచ్చింది ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’.. స్టింగ్‌ ఆపరేషన్‌లో విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి.


హైదరాబాద్‌ సిటీ : ఒళ్లు పట్టడానికో రేటు, కాళ్లకైతే ఇంకో రేటు, కాస్త ఎక్కువ కావాలంటే మరో రేటు.. ఇలా మసాజ్‌ను బట్టి ధరలు ఉంటాయి. ఇంకాస్త లోనికి తొంగి చూస్తే కొన్నిచోట్ల స్పా, మసాజ్‌ల ముసుగులో హైటెక్‌ వ్యభిచారం నడుస్తోంది. మసాజ్‌ సెంటర్ల సమాచారం ఇచ్చే ఓ కంపెనీకి ఫోన్‌ చేస్తే.. సమాచారం లభించడంతో పాటు, క్షణాల్లో నగరంలోని పలు మసాజ్‌ సెంటర్లకు మీ నెంబర్‌ చేరిపోతుంది. ఆ తర్వాత ఫోన్‌ కాల్స్‌ మొదలవుతాయి. స్పాకు చెందిన యువతులే నేరుగా రంగంలోకి దిగి స్పెషల్‌ సర్వీసెస్‌ పేరిట ఆకర్షించే పనిలో పడతారు.


ఎక్కడికి వెళ్లినా..

‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ బృందం కొండాపూర్‌ ప్రాంతంలోని బోర్డు లేని ఓ స్పాకు వెళ్ళింది. అక్కడా ఇదే తంతు. అక్కడ 15 మంది యువతులను రిక్రూట్‌ చేసుకున్న నిర్వాహకులు షిఫ్టుల వారీగా దందా నడిపిస్తున్నట్లు పరిశీలనలో వెలుగు చూసింది. ఓ పెద్దావిడ ఈ వ్యవహారంలో లీడ్‌రోల్‌ పోషిస్తోంది. తొలుత కేవలం ఇక్కడ మసాజ్‌ మాత్రమే అంటుంది. లేదు ఫోన్‌లో ఇలా చెప్పారు కదా అని కదిపితే.. ఓ యువతిని పరిచయం చేసి మాట్లాడి సెట్‌ చేసుకోండి అని సలహా ఇస్తుంది. ‘గంటకు రూ. 1500. లోపలికి వెళ్లాక మీరు తృప్తి పడితే నచ్చినంత ఇవ్వండి’ అంటూ అసలు విషయం చెప్పేస్తుంది. స్టింగ్‌ ఆపరేషన్‌లో మరో అంశం కూడా బట్టబయలైంది. మంచి జీతాలు ఇచ్చి స్పా యాజమాన్యాలు అందమైన యువతులను రిక్రూట్‌ చేసుకుంటున్నట్లు తెలిసింది. మసాజ్‌ పనులు తప్ప మిగతా పనులన్నీ వారితో చేయిస్తున్నారని తేలింది. ఇటువంటి సెంటర్లను ఎక్కువగా నిర్వహిస్తోంది మహిళలేనన్న విషయం షాకింగ్‌కు గురిచేస్తోంది. 


చీకటి మాటున..

ఈ చీకటి దందాను బాహ్య ప్రపంచానికి తెలియజేయాలనే ఆలోచనతో సీక్రెట్‌ కెమెరాలు అమర్చుకున్న ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి బృందం ఓ స్పా సెంటర్‌లోకి ప్రవేశించడంతో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. అక్కడ కస్టమర్లకు రెడ్‌కార్పెడ్‌ స్వాగతం లభిస్తుంది. డబ్బును బట్టి ఏదైనా సాధ్యమేనన్న రీతిలో డిస్కషన్స్‌ జరుగుతాయి. తాము ఎంత బాగా మసాజ్‌ చేస్తామో వివరిస్తూనే, ఎలాంటి సర్వీసులున్నాయో విడమర్చి చెబుతారు. కస్టమర్లను రెచ్చగొట్టేలా వారి చేష్టలు ఉంటాయి. అక్కడి నుంచి ఇంకా ముందుకెళ్లేందుకు కూడా అభ్యంతరం లేదు. కానీ.. అంటూ నసుగుతారు. కస్టమర్‌ మళ్లీ మళ్లీ వచ్చేలా ముగ్గులోకి దింపుతారు. 


ఫుల్‌ ప్యాకేజీ 

మణికొండలోని మర్రి చెట్టు దగ్గర కనిపించిన స్పా సెంటర్‌ను చూస్తే ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం ఉండదని అనుకుంటారు. కానీ లోపలకి వెళ్ళగానే ‘మీకు ఎలాంటి ప్యాకేజ్‌ కావాలో చెప్పండి’ అనే ప్రశ్న వచ్చింది. ఫుల్‌ ప్యాకేజ్‌ అనగానే.. ‘అమ్మాయిలు రెడీగానే ఉన్నారు. మీ ఇష్టం’ అన్నారు. పోలీసులు దాడులు చేస్తే ఇబ్బందిగా అంటే ‘పోలీసుల వ్యవహారం మేం చూసుకుంటాం. ఎలాంటి సమస్య ఉండదు’ అని నమ్మకంగా చెప్పారు. అంతేకాదు.. రెండు గంటల ముందు చెబితే ‘మీ వద్దకే అమ్మాయిలను పంపుతాం’ అని కూడా చెప్పారు. ఇంట్రస్ట్‌ చూపినవారి చిరునామా రాసుకుంటున్నారు.


అలా మొదలైంది..

హైదరాబాద్‌లో ఉన్న మసాజ్‌ సెంటర్ల వివరాలు కావాలని ఏబీఎన్‌ - ఆంధ్రజ్యోతి ప్రతినిధులు వివరాలిచ్చే నెంబర్‌కు డయల్‌ చేశారు. ఆ కంపెనీ ప్రతినిధి ఫోన్‌ కట్‌ చేసిన నిమిషాల వ్యవధిలోనే పదుల సంఖ్యలో మసాజ్‌, స్పా సెంటర్ల నుంచి కాల్స్‌ ప్రారంభమయ్యాయి. నేరుగా యువతులే కాల్స్‌ చేసి ఎలాంటి సర్వీస్‌ కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఆఫర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. వారి కవ్వింపు మాటలకు యువత ఇట్టే వలలో పడే ప్రమాదం లేకపోలేదు. ఎంతోమంది ఆ మాటల గారడీకి పడిపోయి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.


నేరుగా వీడియో కాల్స్‌.. 

సమాచారం అడిగింది మొదలు.. పంజాగుట్ట, శ్రీనగర్‌ కాలనీ, కొండాపూర్‌, మణికొండ, మాదాపూర్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌తో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న క్నొన స్పా అండ్‌ బ్యూటీ సెలూన్‌ల నుంచి కాల్స్‌ రాక మొదలైంది. తమ దగ్గరికొస్తే సకల సేవలూ అందిస్తామని ఆఫర్లు ప్రకటించారు. వారి మాటలను బట్టి సెక్స్‌ రాకెట్‌ నిర్వహిస్తున్నారనే అనుమానాలు మొదలవుతాయి. కొందరైతే మరో అడుగు ముందుకేసి అందమైన యువతులతో వీడియో కాల్స్‌ చేయించి బుట్టలో పడేలా చేస్తున్నారు.


కస్టమర్లకు రేటింగ్స్‌

కస్టమర్లకు రేటింగ్‌ కూడా ఇస్తున్నట్లు తేలింది. ఫీడ్‌బ్యాక్‌ కూడా తీసుకుంటున్నారు. ఎవరైతే సర్వీసు అందిస్తున్నారో ఆ యువతి చెప్పేదాన్ని బట్టి కస్టమర్లకు రేటింగ్స్‌ ఇస్తున్నట్లు స్టింగ్‌ ఆపరేషన్‌లో వెల్లడైంది. గుడ్‌ రేటింగ్‌ ఉంటే చాలు.. వారిని వదిలిపెట్టరు. తరచూ ఫోన్లు చేస్తూ కవ్విస్తుంటారు. మసాజ్‌ మాటున సాగుతున్న అక్రమ దందాలో ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందిన అమ్మాయిలను ఎక్కువగా నియమించుకుంటున్నారు. ఏజెంట్ల ద్వారా బంగ్లాదేశ్‌, నేపాల్‌ దేశాలకు చెందిన యువతులను రప్పించి మసాజ్‌ సెంటర్‌ మాటున సెక్స్‌ రాకెట్‌ నిర్వహిస్తున్నారు. విదేశీ యువతులంటూ విటులను ప్రేరేపించి దందాను యథేచ్ఛగా నడిపిస్తున్నారు.

Updated Date - 2021-11-22T16:02:16+05:30 IST