Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆపరేషన్‌ ఆకర్ష్‌..!

కాంగ్రెస్‌ ఓటర్లపై టీఆర్‌ఎస్‌ గురి!

అంతర్మథనంలో కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు!

టేక్మాల్‌ ఎంపీపీ పార్టీ మారడంతో అప్రమత్తమైన నేతలు


ఆంధ్రజ్యోతిప్రతినిధి, మెదక్‌, నవంబరు 28:మెదక్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓటర్లు ఎప్పుడు ఎటువైపు వెళ్తారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొన్నది. టీఆర్‌ఎస్‌ ఆపరేషన్‌కు కాంగ్రెస్‌ ఓటర్లు ఇంకా ఎంత మంది ఆకర్షితులవుతారోనని ఆపార్టీ నేతలు అంతర్మథనంలో పడ్డట్లు స్థానికంగా ప్రచారం జరుగుతున్నది.!!

 శాసనమండలి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అసలు పోటీలో ఉంటుందా?లేదా? అనుకుంటున్న తరుణంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి భార్య నిర్మలను అనూహ్యంగా ఎన్నికల బరిలో దింపారు. కాంగ్రెస్‌ నేతలు చెబుతున్న విధంగా 230 మంది ప్రజాప్రతినిధులు నిర్మలకు ఓటేస్తే ఉనికికి ఢోకా ఉండబోదని ఆ పార్టీ నేతలు  భావించారు. ఆ నమ్మకంతోనే నవంబరు 23న కాంగ్రెస్‌ అభ్యర్థి నిర్మల తన నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. నామినేషన్‌ కార్యక్రమానికి పార్టీ టికెట్‌పై గెలిచిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంద రినీ ఆహ్వానించారు. ఈ తర్వాత ఎమ్మెల్యే జగ్గారెడ్డి కానీ జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నేతలు గాని తమతో టచ్‌లో ఉండకపోవడంతో కొందరు ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే జగ్గారెడ్డి కలిసి మెదక్‌ జిల్లా స్థానిక ప్రజాప్రతినిధులతో శనివారం మెదక్‌ శివారులోని మాచవరంలో సమావేశం నిర్వహించారు. అటు కాంగ్రెస్‌ నేతల సమావేశం జరుగుతుందడగానే టేక్మాల్‌ కాంగ్రెస్‌ ఎంపీపీ స్వప్న ఆమె భర్త రవితో కలిసి హైదరాబాద్‌కు వెళ్లారు. అక్కడ మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేశారు. ఈ పరిణామంతో షాక్‌ అయిన కాంగ్రెస్‌ ముఖ్యనేతలు వెంటనే అప్రమత్తమయ్యారు. సొంత పార్టీ నేతలు చేజారకుండా జాగ్రత్త చర్యలు ప్రారంభించారు. కానీ ఇంత చేస్తున్నా ఎవరు ఎవరితోని టీఆర్‌ఎస్‌ పార్టీలోకి ఎప్పుడు వెళ్తారో తెలియని అయోమయం నెలకొన్నదని ద్వితీయ శ్రేణి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు అన్ని రకాలుగా ఆశలు చూపిస్తూ కాంగ్రెస్‌ ఓటర్లను ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యారు. టీఆర్‌ఎస్‌ ‘‘ఆపరేషన్‌ ఆకర్ష్‌’’ ఇలాగే కొనసాగితే కాంగ్రెస్‌ పరిస్థితి ఏంటని కింది స్థాయి నేతలు మదనపడుతున్నారు. 


ఆర్థిక సమస్యలే పార్టీ మారేలా చేస్తున్నాయా?

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా గెలిచి రెండేళ్లు కావొస్తున్న ఏ ఒక్క ప్రజాప్రతినిధి ఆర్థికంగా కోలుకోలేదని తెలిసింది. అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులందరి పరిస్థితి ఇదే. మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలకు సన్నిహితంగా ఉండే కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం ఏదోరకమైన పనులు చేయించుకుంటూ కొంత మేరకు ఆర్థికంగా స్థిరపడ్డారని సమాచారం. ఇక ఎవరితో సత్సంబంధాలు లేని వారు, ప్రతిపక్ష పార్టీల వారు ఆర్థికంగా తీవ్రం గా నష్టపోయారన్నది లోకల్‌గా వినిపిస్తున్న టాక్‌. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో అందరికీ ప్రాణం లేచి వచ్చినంత పనైంది. ఎన్నికల్లో గెలవాలంటే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు కచ్ఛితంగా వేయాల్సిందే. దీంతో అందరిలో ఆశలు చిగురించాయి. ఎంతో కొంత ఆర్థికంగా కలిసి వస్తుందని ఆశిస్తున్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి గెలిచి అప్పుల పాలయ్యామని బాధ పడుతున్న వారు ఇదొక అవకాశంగా భావిస్తున్నారు. అందుకే చాలా మంది ఎటు వైపు ఎక్కువ అవకాశాలు ఉంటే అటు వైపు వెళ్లడానికి మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. ఇదే సమయంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్య నేతలు రంగంలోకి దిగి కాంగ్రెస్‌, బీజేపీ ఓటర్లకు గాలం వేసి పనిని పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు సమాచారం. 


జాగ్రత్త వహిస్తున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి!

 ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓట్లు చీలకుండా మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే మెదక్‌, సిద్దిపేట జిల్లాల కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలతో సమావేశాలను ముమ్మరం చేశారు. కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచిన వారంతా ఓటేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. టీఆర్‌ఎ్‌సలో అసంతృప్తితో ఉన్న వారికి గాలం వేసే విధంగా కసరత్తు చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి ఎన్నికల బరిలో లేకపోవడంతో ఆ పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఓట్లను కూడా కాంగ్రె్‌సకు పడే విధంగా ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలిసింది. ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి గెలిచిన ఏకైక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. గెలిచిన మూడేళ్లలో జిల్లాలో పెద్దగా తిరిగిన దాఖలు లేవని, పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యక్రమాలు చే పడితే బాగుండేదని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. ముందు నుంచి జగ్గారెడ్డి కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకులకు అందుబాటులో ఉంటే పరిస్థితులు మరింత అనుకూలంగా ఉండేవని కాంగ్రెస్‌ శ్రేణులు చర్చించు కుంటున్నారు. ఏదేమైనా కాంగ్రెస్‌ పార్టీ ఓట్లు మాత్రం సొంత పార్టీకే వేసే విధంగా ఎవరి స్థాయిలో వారు ప్రయత్నం చేస్తున్నారు. 

Advertisement
Advertisement