నాడి పట్టేవారేరీ?

ABN , First Publish Date - 2020-04-03T09:25:34+05:30 IST

ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తున్న కరోనా మహమ్మారికి భయపడి జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీ (ఔట్‌ పేషెంట్‌) సేవలను పూర్తిగా నిలిపివేశారు.

నాడి పట్టేవారేరీ?

ఓపీ వైద్యసేవలు నిలిపివేత.. 

రోగుల ఇబ్బందులు వర్ణనాతీతం 

ప్రభుత్వ ఆదేశాలతోనైనా పరిస్థితి మెరుగుపడేనా? 


(విజయవాడ, ఆంధ్రజ్యోతి): ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తున్న కరోనా మహమ్మారికి భయపడి జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీ (ఔట్‌ పేషెంట్‌) సేవలను పూర్తిగా నిలిపివేశారు. పెద్దసంఖ్యలో రోగులు తరలివస్తే కరోనా వ్యాపించే ప్రమాదముందనే కారణంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఓపీ సేవలను నిలిపివేశారు. ఫలితంగా సాధారణ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు అవసరమైన వైద్యసేవలు లభించక తీవ్ర ఇబ్బందులనెదుర్కొంటున్నారు.


అన్ని ఆసుపత్రుల్లో వైద్యులు స్వీయ రక్షణ చర్యలు తీసుకుంటూ, సాధారణ వైద్య సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు. ఈ సమస్య అన్ని జిల్లాల్లోనూ ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓపీ సేవల ఆవశ్యకతను గుర్తించింది. ఈ నెల 14వ తేదీ వరకు ప్రైవేటు ఆసుపత్రుల నిర్వహణ ప్రభుత్వ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండేలా చర్యలు తీసుకోవాలని బుధవారం అన్ని జిల్లాల వైద్య ఆరోగ్యశాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. గ్రామీణ మెడికల్‌ ప్రాక్టీషనర్లు కూడా ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తే పోలీసులు, రెవెన్యూ అధికారుల సహకారంతో కఠిన చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వోలకు అధికారాలను కూడా కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో జిల్లాలో సాధారణ వైద్యసేవల పరిస్థితి ఎలా ఉందో పరిశీలిద్దాం.. 


 జిల్లా ప్రజలకు పెద్ద దిక్కుగా ఉండే విజయవాడలోని కొత్త ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని ఇటీవల పూర్తిగా కరోనా ఆసుపత్రిగా మార్చేశారు. ప్రభుత్వ సిద్ధార్థ మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా 1050 పడకలతో టీచింగ్‌ హాస్పిటల్‌గా ఉన్న ఈ పెద్దాసుపత్రి జిల్లాతోపాటు పొరుగున ఉన్న పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాల్లోని పేదలకు పెద్దదిక్కుగా ఉండేది. ప్రతి రోజూ 1500 నుంచి 2000 మంది వరకు నిరుపేదలు రకరకాల అనారోగ్య సమస్యలతో వచ్చి ఇక్కడ ఉచిత వైద్యసేవలు పొందేవారు. మెడికల్‌, సర్జికల్‌, ఆర్థోపెడిక్‌, న్యూరోసర్జరీ, కార్డియాలజీ ఇతర సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలతోపాటు ఆరోగ్యశ్రీ పథకం కింద వందల మంది ఇన్‌పేషెంట్లకు ఉచితంగానే చికిత్స అందించేవారు. ప్రస్తుతం ఈ ఆసుపత్రిని కోవిడ్‌-19 ఆసుపత్రిగా మార్చేయడంతో ఇక్కడ కరోనా వైరస్‌ సోకినవారికి, ఆ లక్షణాలున్నవారికి మాత్రమే చికిత్స అందిస్తున్నారు.


ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఇన్‌పేషెంటుగా ఉన్నవారిని డిశ్చార్జి చేసేశారు. సీరియస్‌ కండిషన్‌లో ఉన్నవారిని అంబులెన్స్‌ల్లో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఓపీ సేవలను పూర్తిగా నిలిపివేశారు. పేదల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని విజయవాడ రైల్వేస్టేషన్‌ సమీపంలో ఉన్న పాత ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవలను కొనసాగించేందుకు జీజీహెచ్‌ అధికారులు ప్రయత్నం చేసినప్పటికీ.. వందల మంది రోగులు తరలివచ్చి గుమిగూడుతుండటంతో కరోనా వ్యాప్తి చెందే ప్రమాదముందని అక్కడ కూడా ఓపీ సేవలను నిలిపివేశారు. 


విజయవాడ నగరంలో సూపర్‌ స్పెషాలిటీ వైద్య సౌకర్యాలతో కూడిన ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆసుపత్రులు, క్లినిక్‌లు వేలసంఖ్యలో ఉన్నప్పటికీ.. కరోనా భయంతో అన్ని చోట్లా ఓపీ సేవలను నిలిపివేశారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యులు ఫేస్‌ మాస్కులు, పర్సనల్‌ ప్రొటెక్షన్‌ అక్విప్‌మెంట్‌ (పీపీఈ) ధరించి తగిన ముందు జాగ్రత్తలతో ఓపీ సేవలను కొనసాగించే అవకాశం ఉన్నప్పటికీ ఆసుపత్రుల నిర్వాహకులు ముందుకు రావడం లేదు. దీంతో మామూలు జలుబు, దగ్గు, ఫ్లూ జ్వరాలు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు, మధుమేహం, రక్తపోటు, ఒళ్లునొప్పులు, కీళ్లనొప్పులు.. ఇలాంటి సాధారణ సమస్యలతో బాధపడుతున్నవారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మెడికల్‌ షాపులకు వెళ్లి తమ రోగ లక్షణాలు చెప్పి, ఫార్మాసిస్టులు ఇస్తున్న మందులనే వాడుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు పాత మందులనే కొనసాగిస్తున్నారు. 

Updated Date - 2020-04-03T09:25:34+05:30 IST