అయ్యో.. పాపం...

ABN , First Publish Date - 2022-05-27T05:02:20+05:30 IST

మదనపల్లె మండలం వలసపల్లె పంచాయతీ 150వ మైలు రాయి వద్ద గురువారం తెల్లవారుజామున కారు కల్వర్టును ఢీకొట్టి పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లి బోల్తాపడటంతో భార్య, భర్త, ఇరువురు పిల్లలు మృత్యువాతపడ్డారు.

అయ్యో.. పాపం...
వీరగంగిరెడ్డి, మధుప్రియ, పిల్లల మృతదేహాలు

అతివేగం.. నిద్రమత్తు తెచ్చిన అనర్థం

కల్వర్టును ఢీకొట్టి..చెరువులో బోల్తాపడిన కారు

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం

రెడ్డివారిపల్లెలో విషాదం


పెళ్లిలో బంధుమిత్రులతో కలసి ఆనందంగా గడిపారు.. వధూవరులతో కలసి ఫొటోలు దిగారు.. స్వగ్రామంలో ఉదయం జరగనున్న గృహప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యేందుకు తెల్లవారుజామున బయలుదేరి వచ్చి తెల్లారేసరికి విగతజీవులుగా మారిపోయారు. మదనపల్లె మండలం వలసపల్లె పంచాయతీ 150వ మైలు రాయి వద్ద గురువారం తెల్లవారుజామున కారు కల్వర్టును ఢీకొట్టి పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లి బోల్తాపడటంతో భార్య, భర్త, ఇరువురు పిల్లలు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన నిమ్మనపల్లె మండలం రెడ్డివారిపల్లెలో తీవ్ర విషాదం నింపింది. 


మదనపల్లె క్రైం, మే 26: నిమ్మనపల్లె మండలం రెడ్డివారిపల్లెకు చెందిన నీలపరెడ్డిగారి వీరగంగిరెడ్డి (45) ట్రాక్టర్లు, టిప్పర్లు పెట్టుకుని కాంట్రాక్ట్‌ పనులు చేస్తుండేవాడు. ఇతడికి భార్య మధుప్రియ (35), పిల్లలు కుషితారెడ్డి (7), దేవాన్ష్‌రెడ్డి (5)లు ఉన్నారు. వీరు మూడేళ్ల కిందట మదనపల్లెకు కాపురాన్ని మార్చారు. పట్టణంలోని శేషప్పతోటలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. కాగా వీరగంగిరెడ్డి ఎనిమిదేళ్ల కిందట చిత్తూరు జిల్లా పులిచెర్లకు చెందిన మధుప్రియను వివాహం చేసుకున్నాడు. ఈమె వలంటీర్‌గా పనిచేస్తూ..ఆ తరువాత నిలిపేసింది. కాగా ఈ నలుగురూ బుధవారం సాయంత్రం కారులో చిత్తూరు జిల్లా పలమనేరులో జరుగుతున్న బంధువుల వివాహానికి వెళ్లారు. రాత్రి పెళ్లిలో బంధుమిత్రులతో కలసి ఆనందంగా గడిపారు. పెళ్లిముహూర్తం అయిపోగానే నిమ్మనపల్లె మండలం దిగువ మాచిరెడ్డిగారిపల్లెలో జరిగే బంధువుల నూతన గృహాప్రవేశం కార్యక్రమంలో పాల్గొనేందుకు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో బయలుదేరారు. అయితే దారిలో మదనపల్లె మండలం వలసపల్లె పంచాయతీ 150వ మైలు రాయి వద్దకు రాగానే వీరగంగిరెడ్డి నిద్రమత్తులోకి జారుకోవడంతో వాహనం అదుపుతప్పి రహదారి ఆనుకుని ఉన్న కల్వర్టును ఢీకొట్టి..ఆ పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లి బోల్తాపడింది. 20 అడుగుల ఎత్తు నుంచి చెరువులో పడి మునిగిపోయింది. అప్పటికే నిద్రలో ఉన్న నలుగురూ తీవ్రంగా గాయపడి కారులో ఇరుక్కొని..అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఉదయం గమనించిన స్థానికులు వెంటనే తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ రవిమనోహరాచారి, సీఐ మురళీకృష్ణ, ఎస్‌ఐ చంద్రశేఖర్‌లు సిబ్బందితో కలసి సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. కారు చెరువులో పడడంతో డోర్లు ఓపెన్‌ అయి మృతదేహాలు కారు కింద, పక్కన పడి ఉన్నాయి. పోలీసులు క్రేన్‌ సహాయంతో కారును, మృతదేహాలను బయటకు తీశారు. వీరితో పాటు కారులో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే అనుమానంతో చెరువులోకి దిగి ప్రమాదం జరిగిన ప్రాంతంలో గాలించారు. మృతులు నిమ్మనపల్లె మండలం రెడ్డివారిపల్లె వాసులుగా నిర్థారణ చేసి వారి కుటుంబీకులకు, బంధువులకు సమాచారం అందించారు. వారంతా సంఘటనా స్థలానికి చేరుకుని భోరున విలపించారు. అనంతరం మృతదేహాలను జిల్లా ఆస్పత్రికి తరలించారు. బంధుమిత్రులు పెద్దసంఖ్యలో ఆస్పత్రిలోని మార్చురీ వద్దకు చేరుకోవడంతో ఆ ప్రాంతం జనాలతో నిండిపోయింది. ఇద్దరి బిడ్డలతో సహా దంపతులూ..మరణించడంతో కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ మేరకు కేసునమోదు చేసినట్లు తాలూకా ఎస్‌ఐ చంద్రశేఖర్‌ చెప్పారు.


రెడ్డివారిపల్లెలో విషాదం..

ఈ ఘటనతో స్వగ్రామం రెడ్డివారిపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. వీర గంగిరెడ్డి స్థానికంగా కాంట్రాక్ట్‌ పనులు చేస్తూ.. అందరికీ సుపరిచితులయ్యారు. ఘటన జరిగిన వెంటనే రెడ్డివారిపల్లె చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన జనం పెద్ద సంఖ్యలో జిల్లా ఆస్పత్రికి చేరుకున్నారు. మార్చురీలో విగతజీవులుగా పడి ఉన్న నలుగురినీ చూసి అయ్యోపాపం అంటూ కంటతడి పెట్టారు. నలుగురినీ ఒకేసారి తీసుకెళ్లేందుకు నీకు మనసెలా వచ్చింది దేవుడా అంటూ బాధిత కుటుంబీకులు ఏడ్చడం స్థానికులను కలచివేసింది.


పలువురి పరామర్శ..

మాజీ ఎమ్మెల్యేలు దొమ్మలపాటి రమేష్‌, దేశాయ్‌ తిప్పారెడ్డి, టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యుడు డి.హర్షవర్ధన్‌రెడ్డిలు జిల్లా ఆస్పత్రికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి, ఘటనపై ఆరా తీశారు. అలాగే బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన బాధాకరమంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు.





Updated Date - 2022-05-27T05:02:20+05:30 IST