లక్ష్మీనృసింహ క్షేత్రంలో నేత్రపర్వంగా ఊంజల్‌ సేవ

ABN , First Publish Date - 2022-07-02T05:53:11+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీ నృసింహస్వామి సన్నిధిలో శుక్రవారం స్వామికి సువర్ణ పుష్పార్చన, ఆండాల్‌ అమ్మవారి ఊంజల్‌ సేవోత్సవాలు శాస్త్రోక్తం

లక్ష్మీనృసింహ క్షేత్రంలో నేత్రపర్వంగా ఊంజల్‌ సేవ
అద్దాల మండపంలో అమ్మవారికి ఊంజల్‌ సేవ నిర్వహిస్తున్న అర్చకులు

యాదగిరిగుట్ట, జూలై 1: యాదగిరిగుట్ట లక్ష్మీ నృసింహస్వామి సన్నిధిలో శుక్రవారం స్వామికి సువర్ణ పుష్పార్చన, ఆండాల్‌ అమ్మవారి ఊంజల్‌ సేవోత్సవాలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. సుప్రభాతంతో స్వయంభువులను మేల్కొలిపిన అర్చకులు బిందెతీర్థంతో నిత్యారాధనలు నిర్వహించారు. గర్భాలయంలోని ప్రతిష్టా అలంకార కవచమూర్తులను 108 సువర్ణపుష్పాలతో అర్చించారు. మూలమూర్తులను పంచామృతాలతో అభిషేకించి తులసిదళాలు, కుంకుమలతో సహస్రనామార్చనలు నిర్వహించారు. ప్రధానాలయ ప్రాకారమండపంలో హోమం, నిత్యతిరుకల్యాణోత్సవ పర్వాలు ఆగమశాస్త్రరీతిలో నిర్వహించారు. ముఖమండపంలో సువర్ణ పుష్పార్చనలు, అష్టోత్తరాల్లో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. కొండపైన శివాలయంలోని రామలింగేశ్వరుడికి, ముఖమండపంలోని స్పటికమూర్తులకు నితార్చనలు, నిర్వహించారు. సాయంత్రం ప్రధానాలయంలో, అద్దాల మండపంలో ఆండాల్‌ అమ్మవారికి ఊంజల్‌ సేవోత్సవం నిర్వహించారు. అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనృసింహుడి సన్నిధిలో స్వామికి సువర్ణ పుష్పార్చనలు, ఆండాల్‌ అమ్మవారికి ఊంజల్‌ సేవోత్సవం శాస్త్రోక్తంగా కొనసాగింది. వివిధ విభాగాల ద్వారా రూ.14,32,070 ఆదాయం సమకూరినట్టు దేవస్థాన అధికారులు తెలిపారు. యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన డాక్టర్‌ రచ్చ యాదగిరి కుటుంబసభ్యులు 12వీల్‌చైర్లను ఆలయానికి బహూకరించారు. కొండపైన దేవస్థాన పీఆర్వో కార్యాలయంలో ఈవో గీతారెడ్డికి దాత కుటుంబసభ్యులువీటిని అందజేశారు. ఇదిలా ఉండగా స్వామివారి నిత్యాన్నదాన వితరణ కోసం హన్మకొండకు చెందిన భక్తుడు కృష్ణారెడ్డి రూ.15వేల నగదును విరాళంగా ఏఈవో రమేశ్‌బాబుకు అందజేశారు.

లక్ష్మీనృసింహుడి సేవలో ప్రముఖులు

లక్ష్మీనరసింహస్వామిని ఐఏఎస్‌ అధికారి, ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీనివాసరాజు దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అర్చకులు ప్రధానాలయంలో పూజలనంతరం ఆశీర్వచనం నిర్వహించారు.  అదేవిధంగా డార్జిలింగ్‌ ఎంపీ, బీజేవైఎం జాతీయ ప్రధానకార్యదర్శి రాజు బిస్తా, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్యగౌడ్‌, హర్యానా ఎంపీ సునీతాదుగ్గల్‌, జమ్మూకాశ్మీర్‌ మాజీ మంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు ప్రియాసేథ్‌లు వేర్వేరుగా యాదగిరిక్షేత్రాన్ని సందర్శించారు. ఉత్సవమూర్తుల చెంత సువర్ణ పుష్పార్చనలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు స్వామివారి అభిషేకం లడ్డూ ప్రసాదాలను అందజేశారు.



Updated Date - 2022-07-02T05:53:11+05:30 IST