ఆర్భాటమే మిగిలింది..

ABN , First Publish Date - 2021-04-11T06:06:28+05:30 IST

ఆధునికహంగులతో జిల్లా కేంద్రంలోని మానేరు తీరంలో నిర్మించిన రైతుబజార్‌ రైతులు, వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చలేకపోతోంది.

ఆర్భాటమే మిగిలింది..
సిరిసిల్ల రైతు బజార్‌లో ఖాళీగా ఉన్న షెడ్‌లు

 - ఆఽధునిక హంగులతో రైతుబజార్‌

- సిరిసిల్లలో 2.14 ఎకరాల్లో రూ.5.15 కోట్లతో నిర్మాణం 

- రైతులకు, వినియోగదారులకు చేకూరని ప్రయోజనం

- కొనుగోలుకు బల్దియా తీర్మానం 


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

ఆధునికహంగులతో జిల్లా కేంద్రంలోని మానేరు తీరంలో నిర్మించిన రైతుబజార్‌ రైతులు, వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చలేకపోతోంది. గతేడాది జూన్‌ 23న పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు, రైతుబజార్‌ను ప్రారంభించారు. ఆ రోజు మినహా మళ్లీ రైతు బజార్‌లో సందడి లేకుండా పోయింది. సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని కూరగాయల మార్కెట్‌లోనే  విక్రయాలు జరుగుతున్నాయి. మున్సిపల్‌ కౌన్సిల్‌ వ్యాపారులను, రైతులను రైతుబజార్‌కు తరలించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. పాత మార్కెట్‌లోనే విక్రయాలు కొనసాగుతుండడంతో వినయోగదారులు   అక్కడికే వెళ్తున్నారు. రైతుబజార్‌కు వచ్చిన రైతులు విక్రయాలు లేక నష్టపోతున్నారు. దీంతో చివరికి వారు కూడా మళ్లీ మున్సిపల్‌ మార్కెట్‌కే వెళుతుండడంతో కోట్ల రూపాయలు ఖర్చు చేసి మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రైతు బజార్‌ వెలవెలబోతోంది. కొందరు రైతులు రైతుబజార్‌కు వచ్చినా  షెడ్లలో కూర్చుంటే  వినియోగదారులకు కనిపించమనే  కారణంగా మళ్లీ ఫుట్‌పాత్‌పైనే కూర్చుంటున్నారు. దీంతో ఎండలో ఇబ్బందులు పడక తప్పడం లేదు. ఉదయం రెండు, మూడు గంటలు మాత్రమే రైతు బజార్‌లో కొద్దిపాటిగా సందడి కనపిస్తోంది రైతు బజార్‌లోకి రైతులు రాకపోవడంలో అధికారుల వైపల్యం ప్రధానంగా కనిపిస్తోంది. 


రూ.5.15 కోట్లతో నిర్మాణం 

రైతులు పండించిన కూరగాయలను నేరుగా అమ్ముకోవడం ద్వారా దళారుల ప్రమేయం లేకుండా కష్టానికి ఫలితం పొందుతారని భావించి సిరిసిల్ల మానేరు తీరం వద్ద 2.14 ఎకరాల్లో రూ.5.15 కోట్లతో ఆధునిక హంగులు, సౌకర్యాలతో ప్రత్యేక ఆకర్షణగా ఉమ్మడి జిల్లాలోనే మోడల్‌ రైతు బజార్‌ నిర్మించారు. సిరిసిల్ల సహకార విద్యుత్‌సరఫరా సంస్థకు చెందిన ఈ స్థలం కావడంతో మంత్రి కేటీఆర్‌ సెస్‌ పాలకవర్గాన్ని ఒప్పించి వారికి మరోచోట స్థలాన్ని కేటాయించి ప్రజలకు అందుబాటులో ఉండేలా  చూశారు. సిరిసిల్ల గాంధీచౌక్‌ వద్ద ఎప్పుడో గ్రామ పంచాయతీ హయంలో నిర్మించిన  మార్కెట్‌లోనే  కూరగాయాలు విక్రయించేవారు.   పార్కింగ్‌ సమస్యలే కాకుండా వినియోగదారులకు ఇబ్బందులు, తైబజార్‌ ఫీజుల సమస్యలు ఏర్పడ్డాయి. పండుగల సమయంలో స్థలం సరిపోక రైతులు  రోడ్లపై విక్రయాలు జరిపేవారు. అధునిక వసతులతో నిర్మించిన రైతు బజార్‌ ఈ సమస్యలను దూరం చేస్తుందని భావించినా  యథావిధిగానే ఉన్నాయి. 


విక్రయాలకు ప్రత్యేక దుకాణాలు

 మోడల్‌ రైతు బజార్‌లో రైతులు కూర్చోవడానికి వీలుగా నిర్మాణాలు చేశారు. వివిధ విక్రయాలకు వీలుగా   38 కూరగాయల దుకాణాలు, 34 మాంసం విక్రయ దుకాణాలకు కేటాయించారు. పండ్లు, పూలకు ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేశారు. రైతులకు, వినియోగదారులకు ఉపయోగపడే విధంగా మరుగుదొడ్ల సౌకర్యం, మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు.  ఇప్పటి వరకు రైతులు మాత్రమే కూరగాయలు విక్రయిస్తున్నారు. మాంసం, పూలు, పండ్లు విక్రయాలు మాత్రం కొనసాగడం లేదు. 


ఆకట్టుకుంటున్న ప్రతిమలు 

సిరిసిల్ల మానేరు ఒడ్డున బతుకమ్మ ఘాట్‌ వద్ద నిర్మించిన రైతుబజార్‌లో రైతుల ప్రతిమలు ప్రత్యేక ఆకర్షణగా  నిలిచాయి. కూరగాయలు, చేపలు, పండ్లు, విక్రయిస్తున్న ప్రతిమలను ఏర్పాటు చేశారు. ఎంతో అకర్షణీయంగా ఉన్న మోడల్‌ రైతు బజార్‌ సిరిసిల్లకే కాకుండా రాష్ట్రంలోనే ప్రత్యేకంగా నిలిచినా ప్రస్తుతం వెలవెలబోతుండడంతో అందరిలోనూ నిరాశను నింపుతోంది. 


 స్వాధీనానికి సిరిసిల్ల బల్దియా సిద్ధం

  రైతుబజార్‌ సముదాయాన్ని సిరిసిల్ల మున్సిపల్‌ ప్రత్యేక నిధుల్లో రూ.2 కోట్లతో స్వాధీనం చేసుకోవడానికి నిర్ణయించారు. రూ.5 కోట్లతో నిర్మించినా నిధుల్లో వేములవాడ మార్కెట్‌ కమిటీ వాటా రూ.కోటి, రాచర్ల బొప్పాపూర్‌ మార్కెట్‌ కమిటీ వాటా రూ.కోటి ఉన్నాయి. వారికి రూ.2 కోట్లు చెల్లించి రైతుబజార్‌ సముదాయాన్ని స్వాధీనం చేసుకోవాలని కౌన్సిల్‌ నిర్ణయించింది. స్వాధీన పర్చుకున్న తర్వాత రుణం పొంది దుకాణాల ద్వారా వచ్చే అద్దెను రుణం చెల్లించాలని కౌన్సిలర్‌ ఫిబ్రవరిలో తీర్మానించింది. 

Updated Date - 2021-04-11T06:06:28+05:30 IST