ఫీజుల కోసం ఆన్‌లైన్‌!

ABN , First Publish Date - 2020-07-03T11:26:31+05:30 IST

కరోనా కారణంగా మార్చి చివర్లో మూతపడిన పాఠశాలలు తిరిగి ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి.

ఫీజుల కోసం ఆన్‌లైన్‌!

తరగతులు నిర్వహిస్తామంటూ ఫోన్లు

డబ్బులు కట్టాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి

ఓ పాఠశాలను సీజ్‌ చేసినా అదే తంతు

లాక్‌డౌన్‌ నిబంధన పట్టని యాజమాన్యాలు

డబ్బులు వసూలు చేస్తున్నా టీచర్లకు మొండిచేయి!


 సిద్దిపేట, జూలై2: కరోనా కారణంగా మార్చి చివర్లో మూతపడిన పాఠశాలలు తిరిగి ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి. జూలై 31 వరకు బడులు తెరిచేది లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత కూడా కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గితేనే తెరుచుకునే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ ఉత్తర్వులకు విరుద్ధంగా జిల్లాలోని కొన్ని ప్రైవేటు పాఠశాలల వారు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తాం ఫీజులు కట్టండి అంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తున్నారు. ఇలాంటి తతంగం నిర్వహిస్తున్న నారాయణ పాఠశాలను సిద్దిపేట మండల విద్యాధికారి సీజ్‌ చేసి, కేసు నమోదు చేసినా ఆ పాఠశాల పేరిట విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి. 

 

సాధారణంగా విద్యార్థుల నుంచి రావాల్సిన ఫీజుల బకాయిలను వార్షిక పరీక్షల ముందు వసూలు చేయడం చాలా ప్రైవేటు పాఠశాలల్లో జరిగే ప్రక్రియ. కానీ అకస్మాత్తుగా పాఠశాలలు మూతపడడంతో ఫీజులు వసూలు చేయలేదు. ఫలితంగా కొన్ని యాజమాన్యాలు కొందరు టీచర్లకు పూర్తి జీతాలు చెల్లించగా, చిన్న, మధ్యతరగతి విద్యా సంస్థలు సగం జీతాలు ఇచ్చాయి. మరికొన్ని పాఠశాలలు ఉపాధ్యాయుల జీతాలకు, ఫీజుల వసూలుకు లింక్‌ పెట్టి ఇవ్వకుండా ఆపేశాయి. ఇక పాఠశాలు ఎప్పుడు పున:ప్రారంభం అవుతాయో చెప్పలేని పరిస్థితి. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల భవిష్యత్తు అయోమయంలో పడింది. దీన్ని తట్టుకోవడానికి జిల్లాలో ఆధునిక హంగులున్న కొన్ని పాఠశాలలు ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు తెరతీశాయి. తద్వారా విద్యార్థులు చదువులో వెనుకపడకుండా చూస్తామని చెబుతున్నారు. ఫీజులు కూడా చెల్లించాలని విద్యార్థుల ఇళ్లకు ఫోన్‌ చేస్తున్నారు. 


 ప్రస్తుతం ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించొద్దంటూ జిల్లా విద్యాశాఖ హెచ్చరికలు జారీ చేసింది. అన్ని ప్రైవేటు పాఠశాలలకు నోటీసులు జారీ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రవికాంతారావు తెలిపారు. అయితే సిద్దిపేటలోని నారాయ ణ పాఠశాలపై ఆరోపణలు రావడంతో జూన్‌ 30న మండల విద్యాధికారి వెళ్లి సీజ్‌ చేశారు. అయినా ఆ పాఠశాల నుంచి విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు రావడం ఆగలేదు. 


ఆన్‌లైన్‌ తరగతుల వైపు మొగ్గు

 కరోనా నేపథ్యంలో పాఠశాలలు ఎప్పుడు పున:ప్రారంభమవుతాయో తెలియని పరిస్థితుల్లో కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఆన్‌లైన్‌ క్లాసులకు మొగ్గుచూపుతున్నాయి. అందుకు డిజిటల్‌ ఎక్వి్‌పమెంట్‌ సమకూర్చుకోవడానికి సన్నద్ధం అవుతున్నాయి. ఈ లెర్నింగ్‌ను రెగ్యులర్‌ తరగతులకు అనుకూలంగా మార్చుకునేందుకు బోధన చేయాలని భావిస్తున్నాయి.


‘‘నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రీసర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌’’ కూడా 25 శాతం విద్యాబోధన ఆన్‌లైన్‌ పద్ధతిలో చేసుకోవాలని సూచన ప్రాయంగా వెల్లడించడాన్ని వాళ్లు ముందుకు తెస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆన్‌లైన్‌ తరగతులకు అనుకూలంగా ఉంటే చిన్నచిన్న స్కూళ్లు పూర్తిగా నష్టపోతాయి. కార్పొరేట్‌ హంగులున్నవే మిగులుతాయి. జిల్లాలో 240 ప్రైవేటు పాఠశాలలుండగా ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించే హంగులున్నవి పదిలోపే ఉంటాయి. 


వీధిన పడ్డ టీచర్లు

 పాఠశాలలు తెరుచుకోకపోవడంతో ప్రైవేటు ఉపాధ్యాయులు చాలామంది వేసవి సెలవుల జీతం కూడా పొందలేకపోయారు. ఈ వృత్తినే నమ్ముకున్న వారు ప్రత్యామ్నాయం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బడులు తెరిచినా తరగతులు ప్రారంభమై జీతాలు వచ్చే సరికి ఎన్ని నెలలు గడుస్తుందోనని ప్రైవేటు ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2020-07-03T11:26:31+05:30 IST