ఒంగోలు కమిషనర్‌ బదిలీలో తిరకాసు

ABN , First Publish Date - 2022-05-18T06:05:05+05:30 IST

ఒంగోలు కార్పొరేషన్‌ కమిషనర్‌ బదిలీ వ్యవహారం రసవత్తరంగా మారింది. ప్రస్తుత ఒంగోలు మున్సిపల్‌ కమిషనర్‌ కె.భాగ్యలక్ష్మి ఏడాదిన్నర క్రితం బాధ్యతలు చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రిగా ఉండగానే ఆమె బదిలీని ప్రతిపాదించారు. ఆమె స్థానంలో బీసీ కార్పొరేషన్‌ ఈడీగా ఉన్న వెంకటేశ్వరరావుని నియమించాలని అప్పటి మంత్రి బొత్సకు సిఫార్సు చేశారు.

ఒంగోలు కమిషనర్‌ బదిలీలో తిరకాసు
వెంకటేశ్వరరావు

సీఎంకు ఫైల్‌ పంపి చేతులు దులుపుకొన్న మంత్రి సురేష్‌ 

బాలినేని ఫోన్‌తో కదిలిన సీఎంవో 

గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన జగన్‌

నేడు బదిలీ ఉత్తర్వులు వెలువడే అవకాశం 

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

ఒంగోలు కార్పొరేషన్‌ కమిషనర్‌ బదిలీ వ్యవహారం రసవత్తరంగా మారింది. ప్రస్తుత ఒంగోలు మున్సిపల్‌ కమిషనర్‌ కె.భాగ్యలక్ష్మి ఏడాదిన్నర క్రితం బాధ్యతలు చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రిగా ఉండగానే ఆమె బదిలీని ప్రతిపాదించారు. ఆమె స్థానంలో బీసీ కార్పొరేషన్‌ ఈడీగా ఉన్న వెంకటేశ్వరరావుని నియమించాలని అప్పటి మంత్రి బొత్సకు సిఫార్సు చేశారు. అయితే భాగ్యలక్ష్మి తన కుమార్తె వివాహమయ్యే వరకు కొనసాగించాలని కోరటంతో మూడు నెలల క్రితం బదిలీని ఆపేశారు. గతనెల 6న కమిషనర్‌ ఇంట్లో వివాహ వేడుకలు పూర్తికాగా 7వతేదీ ఆమెను బదిలీ చేస్తూ ఒంగోలుకి వెంకటేశ్వరరావును నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని అప్పటి మంత్రి బొత్స అధికారులకు సిఫార్సు చేశారు. అయితే ఆ తర్వాత మూడురోజులపాటు ఉత్తర్వులు ఇవ్వాల్సిన ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీలక్ష్మి అందుబాటులో లేకపోవటంతో వెంటనే ఉత్తర్వులు వెలువడలేదు. ఆ వెంటనే 11న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగ్గా పురపాలకశాఖా మంత్రిగా జిల్లాకు చెందిన సురేష్‌ నియమితులయ్యారు. దీంతో కొత్త మంత్రి అనుమతికోసం అధికారులు ఫైలు పెట్టారు. కొద్దిరోజుల క్రితం బాలినేని ప్రస్తుత మంత్రి సురే్‌షకు ఫోన్‌ చేసి ఒంగోలు కమిషనర్‌ బదిలీ వ్యవహారం పూర్తిచేయాలని సూచించారు. అయితే పురపాలకశాఖ అధికారులు బదిలీకి ఉత్తర్వులు ఇవ్వకుండా వివిధ రకాల సాకులు చూపినట్లు తెలిసింది. తదనంతరం ఈ విషయం కొన్ని మలుపులు తిరిగినట్లు కూడా సమాచారం. సీఎం పేషీలో ప్రస్తుత కమిషనర్‌ భాగ్యలక్ష్మి బంధువు ఒకరు ఆమెకు వేరే పోస్టింగ్‌ ఇప్పించే ప్రయత్నాలు ప్రారంభించారు. తొలుత ఆమెను తెనాలికి బదిలీ చేయాలనుకోగా అక్కడి నాయకుల నుంచి వ్యతిరేకత వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మూడురోజుల క్రితం బాలినేని కమిషనర్‌గా వెంకటేశ్వరరావుని నియమించే ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలని మంత్రి సురే్‌షను కోరినట్లు సమాచారం. కారణం ఏమైనా ఆయన బదిలీ ఉత్తర్వులు ఇవ్వకుండా ఫైల్‌ని సీఎం పేషీకి పంపారు. దీంతో విషయం తెలుసుకున్న బాలినేని మంగళవారం సీఎం పేషీలో ఉన్న సంబంధిత అధికారితో పాటు సీఎం రాజకీయ సలహాదారుతో కూడా ఈ విషయంపై ఆవేశంగా మాట్లాడినట్లు తెలిసింది. ఇదేమి చోద్యం.. పార్టీని నడిపే పద్ధతి ఇదేనా అంటూ.. తానొచ్చి సీఎంతో మాట్లాడతానని కూడా గట్టిగా హెచ్చరించినట్లు సమాచారం. దీంతో వారు ఆగమేఘాల మీద కదిలారు. వెంటనే సీఎం దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో ఆయన వెంటనే బదిలీ చేయమని ఆదేశించినట్లు తెలిసింది. ఆ ప్రకారం ఇటు బాలినేని సిఫార్సు మేరకు వెంకటేశ్వరరావును ఒంగోలు కమిషనర్‌గా నియమించడమే కాకుండా భాగ్యలక్ష్మిని అనంతపురం కమిషనర్‌గా బదిలీచేస్తూ ఉత్తర్వులివ్వాలని పురపాలకశాఖ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిసింది. తదనుగుణంగా బుధవారం మధ్యాహ్నంలోపు బదిలీ ఉత్తర్వులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే బాలినేని సిఫార్సు మేరకు నేరుగా బదిలీ ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉన్నా కూడా మంత్రి సురేష్‌ ఖాతరుచేయకుండా సీఎంవోకు పంపారని మాజీమంత్రి అనుచరులు ఆరోపిస్తున్నారు. కమిషనర్‌ హోదా అర్హతలు లేవన్న ఉద్దేశంతో సీఎం అనుమతి కోసం ఫైలు పంపారు తప్ప మరే ఉద్దేశం లేదని మంత్రి పేషీ సిబ్బంది బాలినేని అనుచరులకు చెప్పినట్లు తెలిసింది. ఈ వ్యవహారం సాఫీగా ముగిసినప్పటికీ అటు మంత్రి సురేష్‌, ఇటు బాలినేనిల మధ్య స్పర్థలకు బదిలీ వ్యవహారం కారణమైనట్లుగా రాజకీయ విశ్లేషకుల అంచనా.

Updated Date - 2022-05-18T06:05:05+05:30 IST