Abn logo
May 17 2021 @ 00:18AM

కొనసాగుతున్న లాక్‌డౌన్‌

సూర్యాపేటటౌన్‌, మే 16: జిల్లాలో లాక్‌డౌన్‌ విజయవంతంగా ఐదో రోజు ఆదివారం కూడా కొనసాగింది. లాక్‌డౌన్‌కు ప్రజలు స్వచ్ఛందంగా సహకరిస్తుండటంతో పకడ్బందిగా అమలవుతోంది. ఉదయం సమయంలో నిత్యావసర వస్తువులు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు ప్రజలు దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. ఉదయం 10 గంటల తరువాత దుకాణాలు మూతబడటంతో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చాక తొలి ఆదివారం కావడంతో మటన్‌, చికెన్‌ దుకాణాల వద్ద రద్దీ పెరిగింది. లాక్‌డౌన్‌కు కేవలం 4గంటలు మాత్రమే సడలింపు ఉండటంతో మాసం ప్రియులు దుకాణాల వద్ద బారులు తీరారు. అత్యవసర పనులకు తప్పితే ప్రజలు ఎవ్వరూ ఇంటి నుంచి బయటికి రావడంలేదు. కొంతమంది యువకులు అనవసరంగా బైక్‌లపై వస్తుండటంతో వారిని పోలీసులు అడ్డుకొని కేసులు నమోదు చేశారు. ఆర్టీసీ బస్సులు సైతం ఉదయం 10గంటల వరకు మాత్రమే తిరిగి అనంతరం డిపోలకే పరిమితమయ్యాయి. జాతీయ రహదారిపై వాహనాల రద్దీ తగ్గింది. లాక్‌డౌన్‌ అమలు తీరును ఎస్పీ ఆర్‌.భాస్కరన్‌ పర్యవేక్షించారు. అత్యవసర సేవలందించే ఆస్పత్రులు, మెడికల్‌ షాపులు, ల్యాబ్‌లు, పెట్రోల్‌ బంక్‌లు, గ్యాస్‌ ఏజెన్సీలు, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన దుకాణాలు, రైస్‌మిల్లులు మాత్రమే యథావిధిగా నడిచాయి. ఏటీఎంల్లో నగదు అందుబాటులో ఉండటంతో బ్యాంకులకు వెళ్లే పరిస్థితి ఏర్పడటం లేదు. ప్రభుత్వ కార్యాలయాలు, లాక్‌డౌన్‌ మినహాయింపు ఉన్న రంగాల్లో పని చేసే వారిని మాత్రమే పోలీసులు అనుమతి ఇస్తున్నారు. వారు తప్పనిసరిగా గుర్తింపుకార్డు చూపాలని కోరుతున్నారు.

Advertisement